Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేవతలు ఎందరైనా ఉండొచ్చు. కానీ ప్రత్యక్షదైవం మాత్రం ఒక్కడే. ఆయనే సూర్యుడు. ఆధ్యాత్మికవాదులు దేవుడిగా కొలిచినా, జ్యోతిష శాస్త్రం గ్రహంగా పరిగణించినా, ఖగోళశాస్త్రం నక్షత్రం అని పేర్కొన్నా విస్మరించలేని ఉనికి సూర్యుడిది. అనాదికాలం నుంచీ అన్ని నాగరికతలూ సూర్యుడిని ఆరాధించాయి. మన వేదాలూ, పురాణాలూ ఆయనను ప్రస్తుతించాయి.
పురాణ కథనాల ప్రకారం- అదితి, కశ్యపుల కుమారుడు సూర్యుడు. అందుకే ఆదిత్యుడు, కాశ్యపేయుడు అనే పేర్లు ఆయనకు ఉన్నాయి. మాఘ శుద్ధ సప్తమినాడు ఆయన జన్మించాడు. కనుక ఈ రోజును సూర్యజయంతిగా జరుపుకొంటారు. అలాగే విశ్వానికి వెలుగునిచ్చే బాధ్యతలను స్వీకరించి, సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని సూర్యుడు అధిరోహించినది కూడా ఈ రోజేనని చెబుతారు. కాబట్టే ఇది రథ సప్తమి అయింది. రథసప్తమి రోజున చేసే దానాలూ విశేషమైన ఫలితాలను ఇస్తాయనీ, ఆవు పిడకలపై ఆవు పాలతో పరమాన్నం చేసి నివేదిస్తే సూర్యానుగ్రహం కలుగుతుందనీ పెద్దలు చెబుతారు. ఆరోగ్యప్రదాతగా, జగద్రక్షకుడిగా పూజలందుకొనే సూర్యుడు నిత్యచైతన్య స్వరూపం. ఆయన సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపమేనని ఇతిహాసాలు అభివర్ణించాయి. రణరంగంలో క్లేశానికి గురై, అగస్త్యుడి ప్రబోధం మేరకు శ్రీరాముడు సూర్యుడిని ఆరాధించి యుద్ధంలో విజయం సాధించినట్టు రామాయణం చెబుతోంది. ‘ఆదిత్య హృదయం’ ఆ సందర్భంలోనిదే.
అరసవిల్లిలో...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయం ఉంది. దేశంలోని ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాల్లో ఇదొకటి. రథసప్తమి సందర్భంగా అర్ధరాత్రి నుంచీ ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు, స్వామికి క్షీరాభిషేకాలూ మొదలవుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి సూర్యనారాయణుడిని దర్శించుకుంటారు. శ్రీకాకుళం పట్టణాన్ని అరసవిల్లి ఆనుకొని ఉంటుంది. బస్సు, రైలు మార్గాల్లో శ్రీకాకుళం వెళ్ళి, అక్కడినుంచి అరసవిల్లి చేరుకోవచ్చు.