Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మార్కెట్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న హైదరాబాద్‌కు చెందిన సిల్లీ మాంక్స్‌ కంపెనీ డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌లో అవకాశాలపై దృష్టి సారించనుంది. గురువారం కంపెనీ షేర్లు హైదరాబాద్‌ వేదికగా ఎన్‌ఎస్‌ ఎమర్జ్‌లో లిస్టింగ్‌ అయిన సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక చైర్మన్‌ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ ఏటా 38 శాతం వృద్ధిని సాధిస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ 2020 నాటికి 18 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా అని, ఆ విభాగంలో తమకు గల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా వాటాదారుల పెట్టుబడికి మంచి విలువను అందించడం తమ లక్ష్యమని చెప్పారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో అపార అనుభవం గల తాను అనిల్‌ పల్లాలతో కలిసి 2013 సంవత్సరంలో ఈ కంపెనీ ఏర్పాటు చేశానని, వ్యాపార విస్తరణ కోసం పిఇ ఇన్వెస్టర్లను ఆశ్రయించకుండా నేరుగా ప్రజల నుంచే నిధులు సమీకరించాలన్నది మొదటి నుంచి తన స్వప్నమని ఆయన అన్నారు.
ఈ లక్ష్యంతో మార్కెట్‌లోకి వచ్చిన తమకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని, ఇష్యూ 17 రెట్లు పైబడి ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ కావడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. తాము ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, త్వరలో బెంగాలీ, హిందీ, మరాఠీ భాషల్లో ప్రవేశించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోని అన్ని విభాగాల్లోను ప్రవేశించడం, డిజిటల్‌ కంటెంట్‌ తయారుచేసే కంపెనీలు అందుబాటులోకి వస్తే కొనుగోలు చేయడం, ఆగ్నేయాసియా మార్కెట్‌లో అడుగు మోపడం తమ తొలి ప్రాధాన్యతలని సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ అనిల్‌ చెప్పారు.
హైదరాబాద్‌ నుంచి నాలుగో కంపెనీ
లిస్టింగ్‌తో కంపెనీల బాధ్యత పెరుగుతుందని, వారు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలకు కట్టుబడడంతోపాటు తమపై విశ్వాసం ఉంచిన ఇన్వెస్టర్ల విలువను పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్‌ఎ్‌సఇ దక్షిణ ప్రాంత హెడ్‌ అచల్‌ జైస్వాల్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన లిస్టింగ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ ఎమర్జ్‌లో లిస్టింగ్‌ అయిన 115వ కంపెనీ, హైదరాబాద్‌ నుంచి నాలుగో కంపెనీ సిల్లీ మాంక్స్‌ అని చెప్పారు. భారత వృద్ధి క్రమంలో ఎస్‌ఎంఇల పాత్ర కీలకమైనదని, జిడిపిలో 20 శాతం, ఉద్యోగాల్లో 40 శాతం వాటా వాటిదేనని ఆయన అన్నారు. ఎన్‌ఎస్‌ ఎమర్జ్‌లో లిస్టింగ్‌ అయిన తొలి డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ కూడా ఇదేనని ఆయన చెప్పారు.
లిస్టింగ్‌లోనే అదరగొట్టింది
సిల్లీమాంక్స్‌ కంపెనీ లిస్టింగ్‌లోనే దూసుకుపోయింది. ఇష్యూ ధర 120 రూపాయలపై 20 శాతం ప్రీమియంతో 144 రూపాయల వద్ద లిస్టింగ్‌ అయి ఎగువ సర్క్యూట్‌ని తాకింది. ఈ నెల 5 నుంచి 10 తేదీల మధ్య మార్కెట్‌లో ఉన్న ఈ కంపెనీ ఇష్యూ 17.23 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి. హెచ్‌ఎన్‌ఐల విభాగంలో 24.08 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 12.35 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చింది. ఒక్కోటి 10 రూపాయల ముఖవిలువ గల 12.60 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇష్యూ ద్వారా 15.12 కోట్ల రూపాయలు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం కాగా మొత్తం బిడ్ల విలువ 260 కోట్ల రూపాయలు దాటిపోయింది.