Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రతి సంవత్సరం దీపావళికి ఐదురోజుల పాటు కేవలం స్వచ్ఛమైన నీళ్లు మాత్రమే దొరికే, జనసంచారం లేని అడవుల్లోకి ప్రధాని మోదీ వెళ్లేవారట. పాపులర్ ఫేస్ బుక్ పేజీ ‘ది హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు దగ్గరవడంతో పాటు 17 ఏళ్ల వయసులో ఆయన రెండేళ్ల పాటు హిమాలయాల్లో పర్యటించడం వంటి పలు విషయాలు మోదీ వెల్లడించారు.

‘హిమాలయాల నుంచి తిరిగి రాగానే ఇతరుల సేవ కోసమే నా జీవితం అంకితం చేయాలని మనసు కోరుకుంటున్నట్టు గ్రహించాను. ఆ తర్వాత కొద్ది కాలానికే నేను అలహాబాద్ చేరుకున్నాను. అతి పెద్ద నగరంలో నివసించడం అదే మొదటిసారి. అక్కడి భిన్నమైన జీవనవిధానం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అప్పుడప్పుడు మా అంకుల్‌కు క్యాంటిన్‌లో సాయం చేస్తూ నా సమయాన్ని వెచ్చించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్‌లో పూర్తి స్థాయి ప్రచారక్‌ అయ్యాను. అక్కడ వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని ముచ్చటించే అవకాశం దొరికేది. ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడం, సహచరుల కోసం టీ, ఆహారం తయారు చేయడం, వంటపాత్రలు తోమడం వంటివన్నీ మేము చేసేవాళ్లం’ అని మోదీ తెలిపారు.

చాలా మందికి ఈ విషయం తెలియదు..
‘ఈ విషయం చాలా మందికి తెలియదు. దీపావళికి ఐదు రోజులు ఏదో ఒక అడవికి వెళ్లిపోతుండే వాడిని. నీళ్లు తప్పిస్తే జన సంచారం ఉండని అడవులవి. ఐదు రోజులకు సరిపడా ఆహారం ప్యాక్ చేయించుకునే వాడిని. ఆ సమయంలో రేడియోలు, వార్తా పత్రికలకు దూరం. టీవీలు, ఇంటర్నెట్‌లకు ఛాన్సే లేదు’ అని మోదీ తెలిపారు. ఒంటరిగా గడిపే ఈ సమయం, అనుభూతులు ఇప్పటికీ జీవితాన్ని గడిపేందుకు తగిన బలం తనకు ఇస్తుంటాయని చెప్పారు. ‘ఎవర్ని మీట్ (కలుసుకోవడం) కావడం కోసం వెళ్తున్నారు? అని జనం నన్ను అడుగుతుంటారు. నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్తున్నానని చెబుతుంటాను’ అని మోదీ తన గతస్మృతులు నెమరేసుకున్నారు.

యువ మిత్రులకు ఇచ్చే సందేశం…
మోదీ తన యువ మిత్రులకు కూడా ఓ సలహా ఇచ్చారు. ‘వేగవంతమైన జీవితం, బిజీ షెడ్యూల్ మధ్య కొంత సమయం ఆత్మపరిశీలనకు కేటాయించండి. అది మీ దృష్టి కోణంలో మార్పులు తీసుకు వస్తుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు’ అని మోదీ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.