Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సిడ్నీ: చైనీస్ మొబైల్ మేకర్ హవేయికి ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. మొబైల్ మేకింగ్‌లో దిగ్గజ సంస్థగా ఉన్న హవేయి టెక్నాలజీస్ కో లిమిటెడ్‌పై నిషేధం విధించింది. దేశంలో 5జీ మొబైల్ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం హవేయి నుంచి పరికరాలను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. విదేశీ సంస్థలు ఇందులో భాగం కావడం వల్ల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది.

5జీ మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటులో హవేయి భాగస్వామ్యం కావడంపై ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, ఆస్ట్రేలియా రాజకీయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఆస్ట్రేలియా నిర్ణయంపై అమెరికా ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ఆరోపణలతో అమెరికా మార్కెట్ నుంచి ఇటీవల హవేయిని నిషేధించింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా హవేయిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాల్లో ఎక్కడా హవేయి పేరును ప్రస్తావించలేదు. విదేశీ ప్రభుత్వ ఆదేశాలతో పనిచేసే సంస్థల జోక్యాన్ని సహించబోమని, వీటివల్ల తమ నెట్‌వర్క్‌ దుర్బలంగా మారుతుందని, కాబట్టి తప్పుకోవాలని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వ ఆరోపణలను హవేయి ఆస్ట్రేలియా గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమను ప్రభుత్వం నియంత్రిస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని పేర్కొంది. హవేయి ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ గేర్ మేకర్‌గా ఖ్యాతిగాంచింది. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నంబర్ 3గా కొనసాగుతోంది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో 5జీ నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్, అంటే.. బేస్ స్టేషన్ల ఏర్పాటు, టవర్ల నిర్మాణం, రేడియో ట్రాన్స్‌మిషన్ ఎక్విప్‌మెంట్ వంటి వాటిపై పర్యవేక్షణ అప్పగించింది. ఇప్పుడు భద్రతాపరమైన కారణాలతో ఆ సంస్థను తప్పుకోవాల్సిందిగా కోరింది.