Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత అసాధ్యాలన్నీ సుసాధ్యాలైపోతున్నాయి. వైద్య రంగంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దంపతులు గతేడాది డిసెంబర్‌ 9న మగశిశువుకు జన్మనిచ్చారు. పిల్లలు లేని దంపతుల పాలిట వరంలా మారిన సరోగసీ విధానం వల్ల ఇది సుసాధ్యమైంది. దీంతో మృతుల తల్లిదండ్రులు మనవడిని పొందగలిగారు. 2013లో చనిపోయిన దంపతుల శిశువుకు సరోగసి ద్వారా  ఓ మహిళ జన్మనిచ్చిందని చైనా మీడియా పేర్కొంది. బాబు నానమ్మా తాతయ్యలు అతడికి ‘టయాంటిన్‌’ అనే ముద్దు పేరు పెట్టారని స్థానిక మీడియాలో వార్తలు ప్రచురితం అవుతున్నాయి.

పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది..
సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం చైనాలో చట్టవిరుద్ధం. ప్రమాదంలో మరణించిన దంపతుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిరూపాన్ని చూడాలని భావించారు. సరోగసీ కోసం వారు లావోస్‌కు చెందిన ఒక మహిళను ఆశ్రయించారు. కానీ ఆ పక్రియ అంతా పూర్తి కావడానికి చట్టపరంగా అనేక చిక్కులు ఏర్పడ్డాయి. సరోగసీ ద్వారా విదేశంలో జన్మించిన పిల్లలు చైనా పౌరులుగా గుర్తింపబడాలంటే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లాడి తల్లి లేదా తండ్రి చైనా పౌరులై ఉంటేనే అతడికి పౌరసత్వం లభిస్తుంది. ఇందుకోసం ఆ సరోగసీ మదర్‌ని టూరిస్ట్‌ వీసా మీద చైనాలోని గవాంగూ సిటీలో ఉన్న ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. 15 రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న పిల్లాడికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి నానమ్మ తాతయ్యలకు అప్పగించారు.

పెద్దయ్యాకే అతడికి నిజం చెప్తాం..
‘ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మనవడిని పొందాము. తన పుట్టుక గురించి ఇప్పుడే నిజం చెప్పాలనుకోవడం లేదు. అతను పెరిగి పెద్ద వాడయ్యేంతవరకు తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారని చెప్తామంటూ’ పిల్లాడి తాతయ్య మీడియాకు వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సరోగసీని చట్టబద్ధం చేయాలంటూ చైనీయులు వాదిస్తున్నారు.