Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆధ్యాత్మిక జీవనం గడిపేందుకు సన్యాసులు, బ్రహ్మచారులు ఉండేదానిని మఠం అంటారు. దేవతను ప్రతిష్ఠించిన అనంతరం అది పీఠంగా ప్రభవిస్తుంది. శంకరాచార్యుడు దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడు. వీటినే చతుర్మఠాలని పిలుస్తారు. వీటిలో మొదటిది ద్వారకా మఠం. ఈ మఠానికి తొలి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యుడైన పద్మపాదాచార్యుడు. రెండవది గోవర్ధన మఠం. ఇది ఒడిశాలోని పూరీ పట్టణంలో ఉంది. ఈ మఠానికి చెందిన సన్యాసులను ‘ప్రకాశకులు’ అని వ్యవహరిస్తారు. మూడవది శృంగేరీ మఠం. ఇది కర్ణాటకలోని శృంగేరిలో ఉంది. ఈ మఠం తొలి అధిపతి సురేశ్వరాచార్యుడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనేది ఈ మఠం అనుసరించే మహావాక్యం. నాలుగవది జ్యోతిర్మఠం. దీనిని బదరికాశ్రమము కూడా అంటారు. ఇక్కడ అథర్వణ వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలివి. వీటితోపాటు శంకరుడు ముక్తి పొందిన కంచి మఠం అయిదవది. దీనిని సర్వజ్ఞ పీఠం అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిపీఠంలో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠం ప్రథమ ఆచార్యుడు ఆది శంకరుడే అని చెబుతారు.