Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 16 సీట్లు వస్తే.. కేంద్రంలో కేసీఆర్‌ చక్రం తిప్పడం ఖాయమని, ప్రధానమంత్రి ఎవరన్నది టీఆర్‌ఎస్‌ నిర్ణయించే పరిస్థితి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మొనగాడు కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటే మెడలు వంచి నిధులు రాబట్టుకోవచ్చని అన్నారు. ఢిల్లీని శాసించే విధంగా గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జహీరాబాద్‌ నియోజకవర్గ సన్నాహక సభ, హైదరాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సభలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. అంటూనే తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. తెలంగాణలో రూ.80వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 పైసలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని స్వయంగా నీతిఆయోగ్‌ చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో పేదల గృహాల నిర్మాణానికి రైల్వే జాగలు అడిగితే ఇవ్వలేదని, జూబ్లీ నుంచి తూంకుంట వరకూ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కట్టడానికి రక్షణ శాఖ భూములు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. ముంబైలో మెట్రో కడితే రూ.17 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం.. మనకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఏకతాటిపైకి ప్రాంతీయ పార్టీలు
రానున్న ఎన్నికల్లో మోదీ సొంతంగా గెలిచే ప్రసక్తే లేదని, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్‌, బీజేపీలకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న ఈ రెండు పార్టీలు.. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతారని నిలదీశారు. ఈ సారి కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలను అదును చూసి దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌తో ముందుకు పోతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలపై ఏకతాటిపై తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్‌ స్థానాలను గెలుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఏడాదిలోపే తొలగించారని, కేబినెట్‌లో తెలంగాణకు అవకాశం ఇవ్వకుండా అవమానించింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహమూద్‌ అలీ, శేరి సుభా్‌షరెడ్డి బుధవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

ఓటింగ్‌ శాతం తగ్గొద్దు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్‌ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం తగ్గిందని కేటీఆర్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో అది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, కార్యకర్తలదేనన్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో 60 శాతం ఓట్లుసాధించి ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాటిస్తే తప్పరని, ఐదేళ్లలో హైదరాబాద్‌ రూపరేఖలు మారుస్తారని తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం తెలంగాణ పథకాలు ఆకర్షిస్తున్నాయని, మహారాష్ట్రలోని 40 పంచాయతీల సర్పంచ్‌లు.. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేయడం గర్వకారణమన్నారు.