Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చట్టపరమైన గడువు ముగిసినా తమ దేశంలోనే ఉంటున్న విదేశీయులను.. బయటకు పంపించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకు వీలు కల్పించే కొత్త నిబంధనను అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనుంది. దీని ప్రకారం వీసా స్థితి మార్పు, పొడగింపు వంటి అభ్యర్థనలు తిరస్కరణకు గురవడంతో.. అమెరికాలో ఉండే గడువు తీరిపోయినవారిని దేశం నుంచి బయటకు పంపిస్తారు. అయితే ఈ నిబంధన నుంచి ప్రస్తుతానికి.. హెచ్‌-1బీ లాంటి ఉద్యోగ సంబంధ  వీసాల వారికి, కారుణ్య అభ్యర్థనలు చేసుకున్నవారికి మినహాయింపును ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా హెచ్‌-1బీ వీసాదారుల వీసా పొడగింపు దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. వారికి కూడా ఈ నిబంధనను వర్తింపజేస్తే.. చాలా మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం పడేది. ఇటు సోమవారం నుంచి కొత్త నిబంధన అమలవుతుందని.. గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారికి వలసల న్యాయమూర్తి ముందు హాజరు కావాలని నోటీసు (ఎన్‌టీఏ)లు పంపుతామని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) అధికారులు చెప్పారు. ఇటు నేర చరితులు, మోసగాళ్లు, దేశ భద్రతకు ముప్పుగా ఉన్నవారి కేసులకు.. ప్రాధాన్యత కేటాయిస్తామని చెప్పారు. అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని పంపించివేసే ప్రక్రియలో.. ఎన్‌టీఏను మొదటి అడుగుగా పరిగణించవచ్చు.