Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్‌: గత వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన వరదలు రావడంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజులు గడిచినా భారీవర్షాలు ఎడతెరిపినివ్వకపోవడంతో జనజీవనం అస్తవ్యస్థమయింది. 13జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 385 మంది దుర్మరణం చెందారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. కొందరు నేరుగా సాయం చేస్తే… మరి కొందరు కేరళ వాసులకు సాయం చేయాలని పిలుపునిస్తున్నారు.

23 ఏళ్ల భారత యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ రూ.15లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు అతని తండ్రి విశ్వనాథ్‌.. సీఎం విజయన్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ…‘పబ్లిసిటీ కోసం నేను ఇలా చేయలేదు. నేను సాయం చేసిన విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. కేరళ వాసుల కోసం మీరందరూ కూడా సాయం చేయండి. నేను చేసిన ఈ సాయాన్ని చూసి మరికొందరు కదులుతారన్న ఆశతో ఇలా చేశాను’ అని తెలిపారు. భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునీల్‌ ఛెత్రి మాట్లాడుతూ…‘కేరళకు మన అవసరం ఉంది. వారిని కాపాడుకోవడం మన బాధ్యత. బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌(బీఎఫ్‌సీ) తరఫున కేరళ వాసులకు సాయమందిద్దాం. బెంగళూరు ఫుట్‌బాల్‌ స్టేడియంలో బీఎఫ్‌సీ ప్రతినిధులు ఉన్నారు. వారికి మీ సాయాన్ని అందించండి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కేరళకు పంపిద్దాం’ అని ఛెత్రీ తెలిపాడు.

* కేరళలోని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండండి. త్వరలో మీ సమస్యలు తీరతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న భారత ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌కు ధన్యవాదాలు. దృఢంగా, జాగ్రత్తగా ఉండండి: విరాట్ కోహ్లీ

* కేరళ ప్రజల కోసం ప్రార్థనలు చేస్తున్నాను: సానియా మీర్జా

* కేరళలోని సోదరసోదరీమణులకు సాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను: హార్దిక్‌ పాండ్య

వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌సింగ్‌, శిఖర్ ‌ధావన్‌తో పాటు పలువురు క్రీడాకారులు కేరళకు సాయం అందించాలని సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపునిచ్చారు.