Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మూడు దశాబ్దాల కిందట.. బతుకు భారమై.. విశాఖ ఏజెన్సీ నుంచి కొందరు ఆదివాసీలు ఇక్కడికి తరలివచ్చారు. గలగల పారుతున్న తడికవాగును చూసి.. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నారు. ఈ ప్రాంతం తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ మండల కేంద్రమైన చింతూరుకు 41 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటికి ఇక్కడ ఊరంటూ ఏదీ లేదు. ఈ ఆదివాసీలు తడికవాగు పరిసరాలను ఆవాసంగా మలుచుకున్న తర్వాత ఆ ప్రాంతానికి తడికవాగు అని పేరొచ్చింది.
ఆశలన్నీ ఆవిరి
ఎన్నో ఆశలతో వచ్చారిక్కడికి. తడికవాగులో జల సంపద చూసి అచ్చెరువొందారు. ఇక తమకు ఏ కష్టం రాదనుకున్నారు. అందరూ కలిసి పోడు వ్యవసాయం చేయడం ప్రారంభించారు. వర్షాలు చక్కగా కురిశాయి. చేనులో బంగారం పండింది. అందరూ పొంగిపోయారు. తమ కష్టాలన్నీ తీరాయని సంబరపడ్డారు.
రెండో పంటకు సిద్ధమయ్యారు. ఈసారి వాన చుక్క పడలేదు. పంట చేతికి రాలేదు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. రోజులు గడుస్తున్నాయి. బతుకు బండిని బలవంతంగా ఈడ్చుకొచ్చారు. సంతతి పెరిగింది. ఖర్చులూ పెరుగుతూ వచ్చాయి. వ్యవసాయాన్ని కాదనుకుంటే కూలి పనులు చేసుకోవాలి. 40 కిలోమీటర్లు వెళ్తే గానీ కూలి దొరకదు. కన్న ఊరును వీళ్లు కాదనుకున్నారు.. ఉన్న ఊరు వీళ్లను కాదంటోంది. దిక్కు తోచని స్థితిలో కాలం వెళ్లదీశారు. మంచి భవిష్యత్తు ఉంటుందని ఇక్కడికి వలస వచ్చిన కుటుంబాల్లో కొన్ని.. ‘ఇదీ ఒక బతుకేనా’ అనుకొని మళ్లీ వలస బాటపట్టారు. ఒక్కొక్కరుగా ఊరి విడిచి వెళ్లిపోసాగారు.
తడికవాగును నమ్ముకొని..
ప్రకృతి విధించిన శాపం నుంచి బయటపడేందుకు ఎవరికి తోచిన ఆలోచన వాళ్లు చేశారు. ఒకరోజు తడికవాగు ఒడ్డున కూర్చొని అలా ఆలోచిస్తున్న గమ్మిల బాలరాజుకు బుర్రలో ఏదో మెదిలింది. కళ్లల్లో సంతోషం తొంగిచూసింది. పరుగు పరుగున ఊళ్లోకి వెళ్లాడు. అందరినీ ఒకచోటికి రమ్మన్నాడు. బాలరాజు అంటే ఊళ్లో అందరికీ నమ్మకం. ఆయన మాటను ఎవరూ జవదాటరు. ఆ నమ్మకమే వారి జీవితాలను మర్చేసింది.
వానలు కురిసినా.. కురవకపోయినా.. కొండలూ, కోనలూ దాటుకుంటూ వచ్చే తడికవాగు ఏడాది పొడుగునా పారుతూనే ఉంటుంది. ఆ వాగునే జీవనాధారంగా భావించాడు బాలరాజు. అదే విషయాన్ని తనవారికి తెలియజేశాడు. ‘‘తడికవాగు ప్రవాహానికి అడ్డుకట్ట వేసి (చెక్‌ డ్యామ్‌ నిర్మించి) నీటిని పంట పొలాలకు మళ్లించగలిగితే మన కష్టాలు తీరుతాయ’’ని నమ్మకంగా చెప్పాడు బాలరాజు. అందరూ సరేనన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా..
మరుసటి రోజుకు ప్రణాళిక సిద్ధమైంది. బాలరాజు నాయకత్వంలో పిల్లా-జెల్లా, ముసలి-ముతక అందరూ పలుగు-పార పట్టుకుని రంగంలోకి దిగారు. గ్రామంలోని రాములోరి గుడికి వెళ్లి దండం పెట్టుకుని పనిలోపడ్డారు. మొదట చెక్‌ డ్యామ్‌ నిర్మించదలచిన ప్రదేశం నుంచి తమ పొలాలకు పిల్ల కాల్వలు తవ్వారు. తన, మన అనే తారతమ్యం లేకుండా.. అందరి పొలాలకూ కాల్వలు తవ్వారు.
కాల్వల పని పూర్తవ్వగానే చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తడికవాగుకు ఒకవైపు అడ్డంగా బండరాళ్లతో చెక్‌డ్యామ్‌ ఏర్పాటు చేశారు. ఊరంతా కలిసి నాలుగు నెలలు శ్రమిస్తే గానీ.. ఈ పనులన్నీ పూర్తవ్వలేదు. ఊరు దశను మార్చేసే జలయజ్ఞం కోసం వీరు ఒక్క రూపాయి వెచ్చించలేదు. సిమెంట్‌ కూడా వినియోగించలేదు. కేవలం కాయకష్టాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ‘మన ఊరు- మన భవిష్యత్తు’ అని మనసారా భావించారు. చెక్‌డ్యామ్‌ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేశారు.
పులకరించిన పుడమి
చెక్‌ డ్యామ్‌ మొదలుపెట్టే నాటికి తడికవాగు గ్రామంలో మిగిలింది పది కుటుంబాలే! ముప్ఫయ్‌ ఎకరాలు సాగులో ఉండేది. చెక్‌ డ్యామ్‌ పూర్తయ్యాక ఆ ఊరు దశ మారిపోయింది. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో మాగాణం మురిసిపోయింది. నేల ఈనిందా అన్నట్టుగా పంటలు పండాయి. వలస వెళ్లిన వాళ్లు మళ్లీ ఊళ్లోకి వచ్చారు. వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. కాయగూరలు పండిస్తున్నారు. పంటలు అడవి జంతువుల బారిన పడకుండా.. ఎవరి పొలాల్లో వారు మంచెలు ఏర్పాటు చేసుకొని కాపలా ఉంటున్నారు. దిగుబడి బాగా రాసాగింది. రెండు పూటలా తిండి పుట్టింది. ఇప్పుడు ఆ గ్రామం ఎత్తయిన కొండల నడుమ ఉన్న పచ్చలదీవిలా కనిపిస్తోంది. పిల్లగాలులతో ఆహ్లాదంగా అలరిస్తోంది. ఇప్పుడు వేసవిలో కూడా పంటలు పండించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తడికవాగు వాసులు. ‘‘ చెక్‌ డ్యాం ఏర్పాటు తర్వాత పంటలు బాగా పండుతున్నాయి.
ఇప్పుడు మాకు సాగునీటికి కొదువ లేదు. వేసవిలోనూ పంటలు పండించాలన్నది మా లక్ష్యం. అందుకు తగ్గట్టుగా కృషి చేస్తున్నాం’’ అంటారు బాలరాజు. ఇంతటి సంతోషంలోనూ తడికవాగు వాసులకు ఒక కష్టం ఉంది. అదే తాగునీరు. వానకాలంలో వాగు నీరు తాగడం వల్ల అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ‘‘మా కష్టం మేం పడ్డాం. పొలాలకు నీళ్లొచ్చినయ్‌! మా దాహం మాత్రం తీరుతలేదు. వాగు నీళ్లు తాగితే రోగాలొస్తున్నయ్‌. ప్రభుత్వం స్పందించి మాకు ఒక బోరు వేయిస్తే.. వాళ్ల పేరు చెప్పుకుంటం’’ అంటోంది తడికవాగుకు చెందిన సుమిత్ర. కారడవిలో గొంతెండిపోతున్న పుడమితల్లి దాహం తీర్చిన కాటన్‌దొర వారసులు వీళ్లు. ఈ ఆదివాసీల గొంతు తడిపేందుకు సర్కార్‌ ముందుకురావాలని కోరుకుందాం.
ఎప్పుడూ పనే!
ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆదివాసీలు పదుగురికీ ఆదర్శంగా నిలిచారు. ఈ గ్రామంలో పెద్దవారికి అక్షరజ్ఞానం లేదు. గిరిజన భాష మాట్లాడుతారు. వచ్చీరాని తెలుగులో పలకరిస్తారు. ఊళ్లోకి కొత్తగా ఎవరైనా వస్తే.. ‘స్వామి’ అని మర్యాదగా పిలుస్తారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు. అతిథి మర్యాదల్లో ఏ లోటూ రానివ్వరు. ఎప్పుడే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. సమయాన్ని అస్సలు వృథా చెయ్యరు.
ఆజన్మాంతం కాషాయ వస్త్రాలే
తడికవాగు ఆదివాసీలు ఎంతటి శ్రమజీవులో అంతటి భక్తిపరులు. ఊరి నడిబొడ్డున అందరూ కలిసి రామాలయం నిర్మించుకున్నారు. రోజు ఉదయాన్నే గ్రామస్థులందరూ రామాలయానికి వెళ్తారు. రామయ్య దర్శనం తర్వాతే పొలం పనులకు వెళ్తారు. ఏటా ఏప్రిల్‌లో రాములోరికి ఉత్సవాలూ నిర్వహిస్తారు. ఊళ్లోని వారందరూ కాషాయ వస్త్రాలే ధరిస్తారు. ‘అబద్ధం ఆడరాదు’ అన్నది వారి కఠిన నిర్ణయం. అబద్ధం చెబితే ఏదో ఒక నష్టం వాటిల్లుతుందని విశ్వసిస్తారు. వీళ్లు కేవలం శాకాహారులే. మాంసం అనే మాటను కూడా సహించరు.