Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సీనియర్‌ నటుడు, కమల్‌ హాసన్‌ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైపోయారు. వచ్చే బుధవారం పార్టీ పేరుతోపాటు పలు కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే తన పార్టీ అసలు ఎజెండా ఏంటో ఇప్పుడు ఆయన వివరించే పనిలో నిమగ్నమయ్యారు. తమిళ వారపత్రిక ఆనంద వికటన్‌లో ఈ మేరకు ఆయన ఓ వ్యాసం రాశారు.

‘రైతన్నల సమస్యల పరిష్కారం- ఆ దిశగా పోరాటం’ తన పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని కమల్‌ ప్రకటించేశాడు. ‘‘తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. అభివృద్ధి పేపర్ల మీద తప్ప ఆచరణలో కనిపించటం లేదు. ఇక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున రైతులు దీక్షలు చేసినా.. దేశం మొత్తం చర్చించుకున్నా ప్రభుత్వాల్లో కదలికలు రాలేదు. అందుకే ఆ అంశాన్ని పార్టీ ప్రధాన ఎజెండాగా ఎత్తుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా’’ అని కమల్‌ వివరించారు.

ఇక అమెరికా పర్యటనలో భారత వ్యాపారవేత్తలతో భేటీ అయిన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ‘తమిళనాడు వ్యవసాయ రంగం గురించి భారత వ్యాపారవేత్తలతో చర్చించా. గ్రామాల అభివృద్ధికి వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే పంట భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగానో, విద్యాలయాలకు కేంద్రంగానో భావించవద్దని విజ్ఞప్తి చేశా. అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు’ అని కమల్‌ వివరించారు.

దేశానికి అన్నం పెట్టే అన్నదాతను, వ్యవసాయాన్ని సజీవంగా సమాధి చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని… అందుకే తన పోరాటాన్ని(రాష్ట్ర పర్యటన) గ్రామాల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. తమిళనాడులోని గ్రామాలన్నింటిని స్వర్గధామంగా చూడటమే తన కల అని కమల్‌ ఆ వ్యాసంలో వెల్లడించారు.