Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అప్పుల్లో, చిక్కుల్లో ఉన్న ఐఎల్‌ & ఎఫ్‌ఎస్‌ను బయటపడేయడానికి ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. కంపెనీని టేకోవర్‌ చేసుకుంది. ఇందుకు ద నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతులు కూడా దక్కాయి. మరిన్ని రుణ ఎగవేతలు జరగకుండా నిలువరిచండానికి ప్రముఖ బ్యాంకరైన ఉదయ్‌ కోటక్‌ సహా ఆరుగురు ప్రభుత్వ నామినీలను బోర్డులో నియమించడానికి ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఆ గ్రూప్‌ కంపెనీల షేర్లు  20 శాతం దాకా పరుగులు తీయడం విశేషం. ఇలా ఒక కంపెనీ బోర్డును టేకోవర్‌ చేసుకోవడం సత్యం తర్వాత ఇదే ప్రథమం కావడం విశేషం.

ఆగమేఘాల మీద..
ఐఎల్‌ అండ్‌  ఎఫ్‌ఎస్‌ డైరెక్టర్లు తమ విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని.. కంపెనీ ఒక వేళ కుప్పకూలితే చాలా వరకు మ్యూచువల్‌ ఫండ్‌లు కూడా కుప్పకూలుతాయని.. ఈ విషయంలో ఎన్‌సీఎల్‌టీ తక్షణం జోక్యం చేసుకోవాలని సోమవారం ఉదయం విజ్ఞప్తి చేసింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం ఆగమేఘాల మీద మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది.

నిపుణుల ఎంపిక
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లిమిటెడ్‌ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వారిలో పలువురు నిపుణులు ఉన్నారు. వారి అనుభవం ఈ సంస్థను ఒడ్డున పడవేయటానికి దోహదపడుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
కోటక్‌ బ్యాంకుకు చెందిన ఉదయ్‌ కోటక్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగంలో విశేష అనుభవం ఉంది. సెబీ మాజీ ఛైర్మన్‌ అయిన జీఎన్‌ బాజ్‌పాయ్‌ సెబీ నియమ నిబంధనలను, రెగ్యులేటరీ వ్యవహారాల్లో నిపుణుడు.
వినీత్‌ నయ్యర్‌ సత్యం సంక్షోభాన్ని బాగా దగ్గర నుంచి చూసిన వ్యక్తి. సత్యం కంప్యూటర్స్‌ను టెక్‌ మహీంద్రా టేకోవర్‌ చేసిన తర్వాత ఆ సంస్థను తిరిగి గాడిన పెట్టటంలో కీలకమైన పాత్ర పోషించారు. మాలినీ శంకర్‌ ఐఎఎస్‌ అధికారి. ప్రభుత్వంలో ఎన్నో ముఖ్యమైన హోదాల్లో పనిచేశారు.
అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మలి దశలో మరికొందరు డైరెక్టర్లను కూడా నియమించవచ్చు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లిమిటెడ్‌లో పది మందిని బోర్డు డైరెక్టర్లుగా నియమించే అవకాశం ఉంది.

నిర్దిష్ట వ్యవధిలో ప్రణాళిక..
తక్షణం కొత్త బోర్డు అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. అంతే కాదు.. తమ బాధ్యతలను సైతం తక్షణమే చేపడుతుంది. ఒక నిర్దిష్ట కాల పరిమితిలో ఒక పటిష్ఠ ప్రణాళికను తయారుచేయడంలో తలమునకలవుతుందని ఆ ప్రకటన పేర్కొంది.

సస్పెండైన డైరెక్టర్లపై నిషేధం
ఐఎల్‌ అండ్‌  ఎఫ్‌ఎస్‌ బోర్డును టేకోవర్‌ చేయడానికి ఆరుగురు ప్రభుత్వ నామినీలకు న్యాయమూర్తులు ఎమ్‌.కె. షెరావత్‌, రవికుమార్‌ దురైసామిలతో కూడిన ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం తక్షణ అనుమతులు ఇచ్చింది. అదే సమయంలో సస్పెండైన డైరెక్టర్లు కంపెనీలో ఏ హోదాలోనూ ప్రాతినిధ్యం వహించడానికి వీల్లేదని నిషేధం విధించింది.

ఇదీ విజ్ఞప్తి..
సత్యం కంప్యూటర్స్‌ను 2009లో టేకోవర్‌ చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కేసులోనూ కంపెనీల చట్టం(2013)లోని 241(2), 242 సెక్షన్లను ఉపయోగించాలంటూ ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీని కోరింది. ఈ సెక్షన్ల ప్రకారం.. ఏదైనా కంపెనీ కార్యకలాపాల వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావిస్తే.. సదరు కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడానికి ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఇదీ తీర్పు..
‘‘ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఐఎల్‌ అండ్‌  ఎఫ్‌ఎస్‌ కార్యకలాపాల వల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని విశ్వసిస్తున్నాం. అందుకే కంపెనీల చట్టంలోని 241(2), 242 సెక్షన్లు ఈ కేసుకు సరిపోతాయని భావిస్తున్నామ’ని ప్రభుత్వ వాదనలను విన్న ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ నామినీలు ఆ కంపెనీని టేకోవర్‌ చేసుకోవచ్చని తెలిపింది. కొత్త బోర్డు అక్టోబరు 8లోగా తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని.. వచ్చే విచారణ తేదీ(అక్టోబరు 31)కల్లా కార్యాచరణ ప్రణాళిక, ఇతరత్రా వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అంశాలపైన అక్టోబరు 15లోగా స్పందించాలని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆ స్పందనలపై ప్రభుత్వం అక్టోబరు 30లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) ద్వారా కంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని ఎన్‌సీఎల్‌టీ ఇది వరలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆర్థిక శాఖ హామీ ఇదీ..
‘ఆర్థిక వ్యవస్థ నుంచి ఐఎల్‌ అండ్‌  ఎఫ్‌ఎస్‌కు అవసరమైన నిధులను అందజేయడానికి ఆర్థిక శాఖ కట్టుబడి ఉంది. తద్వారా మరిన్ని ఎగవేతలు జరగకుండా కాపాడతాం. ఆ కంపెనీ చేపట్టిన మౌలిక ప్రాజెక్టులు సజావుగా జరిగేలా చేస్తామ’ని ఆర్థిక శాఖ దిల్లీలో ఒక ప్రకటనలో తెలిపింది. ‘స్టాక్‌ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలో ‘తిరిగి విశ్వాసాన్ని కల్పించడం’ కోసమే ఈ టేకోవర్‌ జరిగింది. ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వాన్ని అందించడానికి మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తామ’ని స్పష్టం చేసింది. ‘ఐఎల్‌ అండ్‌  ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు రూ.1.15 లక్షల కోట్ల ఆస్తులున్నప్పటికీ.. రూ.91,000 కోట్ల అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రుణాల విషయంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే ఇలా జరిగింద’ని అందులో చెప్పుకొచ్చింది.