Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈ టెక్నాలజీ యుగంలో వినియోగదారుల అభిరుచులూ కాలంతోపాటే వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా మొబైల్‌ వాడకం విషయంలో ఈ స్పీడ్‌ కాస్త ఎక్కువగానే ఉంది. యువ కస్టమర్లయితే మార్కెట్లోకి వచ్చే కొత్త మోడళ్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు.

వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లను చాలా త్వరగా మార్చేస్తున్నారు. 40 శాతం మంది తమ ఫోన్లను ఏడాదిలోపే మార్చేస్తున్నారని 91మొబైల్స్‌ డాట్‌ కామ్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఉత్తర, తూర్పు భారత వినియోగదారులు మిగతా ప్రాంతాల వారికంటే తరచుగా అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. మహిళల కంటే పురుషులు మాటిమాటికి తమ ఫోన్లను మార్చేస్తున్నారని ఏడాదిలోపు మొబైల్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పురుషులు 40 శాతం కాగా.. మహిళల్లో ఇది వాటా 30 శాతం ఉందని 91 మొబైల్స్‌ వెల్లడించింది. 35 ఏళ్ల పైబడిన వారితో పోలిస్తే యువత (35 ఏళ్ల లోపువారు) మరింత తరచుగా ఫోన్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే ఆలోచన ఉందని సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది వెల్లడించారు.

ఏ ఫోన్‌.. ఎలా కొనుగోలు?
వచ్చేసారి రూ.10,000-20,000 మధ్యలో ఉండే మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు 56 శాతం మంది వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలని 44 శాతం మంది, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యమిస్తామని 40 శాతం చెప్పగా.. 16 శాతం ఎటూ తేల్చుకోలేకపోయారు.
ఆన్‌లైన్‌తో పోలిస్తే ఆఫ్‌లైన్‌లో రూ.1,000 అధికంగా వెచ్చించాల్సిన పక్షంలో 60 శాతం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయనున్నట్లు తెలుపగా.. 23 శాతం మంది మాత్రం ఆఫ్‌లైన్‌నే ఎంచు కుంటామన్నారు.

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో కొనాలా అనే విషయంపై ఇంకా నిర్ణయించుకోనప్పటికీ కొత్తగా కొనుగోలు చేయబోయే మోడల్‌పై ఆన్‌లైన్‌లో రీసెర్చ్‌ చేస్తామని 80ు మంది తెలిపారు.
ప్రాధాన్యతలేంటి..?

పనితీరు లేదా స్పీడ్‌, కెమెరా, బ్యాటరీ.. మొబైల్‌ కొనుగోలుకు ముందు వినియోగదారులు ముఖ్యంగా పరిశీలించే అంశాలు. కెమెరా, బ్యాటరీ కంటే పనితీరుకు రెండింతల ప్రాధాన్యం.

యువత (35 ఏళ్ల లోపు వారు) ఎక్కువగా మొబైల్‌ పనితీరు, కెమెరా సామర్థ్యానికి ప్రాధాన్యమిస్తుండగా.. 35 ఏళ్ల పైబడినవారు మాత్రం బ్యాటరీ, డిస్‌ప్లే బాగా ఉండే ఫోన్లను ఎంచుకుంటున్నారు.

పురుషులు మొబైల్‌ పనితీరు, డిస్‌ప్లేకు.. మహిళలు కెమెరా, బ్యాటరీ, డిజైన్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

అధ్యయనం ఇలా..
15,000 మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల నుంచి సేకరించిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే రిపోర్టును వెబ్‌సైట్‌ తయారు చేసింది. ఈ ఏడాదిలో కొత్త ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఏయే అంశాలను పరిశీలిస్తారు..? ఎంత తరచుగా ఫోన్‌ అప్‌గ్రేడ్‌ చేస్తుంటారు..?, కొత్త ఫోన్లపై ఎలా రీసెర్చ్‌ చేస్తారు..? ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తారా..? వంటి ప్రశ్నలకు వినియోగదారుల నుంచి సమాధానాలు రాబట్టింది.

పనితీరును ఎలా నిర్ణయిస్తున్నారు..?
స్మార్ట్‌ఫోన్‌ పనితీరుపై ఓ అంచనాకు రావాలంటే ప్రాసెసర్‌ బ్రాండ్‌ చాలా కీలక అంశమని సర్వేలో పాల్గొన్న 43 శాతం మంది వెల్లడించారు. ర్యామ్‌ సామర్థ్యాన్ని చూస్తామని 27 శాతం మంది తెలిపారు.
యువత ఎక్కువగా ప్రాసెసర్‌ బ్రాండ్‌కు ప్రాధాన్యమిస్తుండగా.. పెద్దవారు మాత్రం ర్యామ్‌ సామర్థ్యం అధికంగా స్మార్ట్‌ఫోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
మిగతా అంశాల విషయానికొస్తే.. కెమెరా రిజల్యూషన్‌ (34 శాతం), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యానికి (31 శాతం) ప్రాధాన్యం ఇస్తున్నారు.
సెల్ఫీ ఫీచర్‌పై పురుషుల కంటే మహిళలే అధిక ప్రాధాన్యమిస్తారట. సెల్ఫీ దిగేందుకు అత్యంత సమర్థవంతమైన ఫోన్‌నే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతామని 16 శాతం మంది మహిళలు తెలిపారు.