Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పేపర్‌ లీక్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా పలు సెంటర్లలో జరిగిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (టైర్‌–2) పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరపాలంటూ ఎస్‌ఎస్‌సీ కోరిన నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ‘విద్యార్థుల డిమాండ్‌ను మేం అంగీకరించాం.

సీబీఐ విచారణకు ఆదేశించాం. ఈ విద్యార్థులంతా ఆందోళనలు విరమించాలని కోరుతున్నాం’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పేపర్‌ లీక్‌ను నిరసిస్తూ ఫిబ్రవరి 27నుంచి ఢిల్లీలోని ఎస్‌ఎస్‌సీ కార్యాలయం ముందు ఉద్యోగ ఆశావహులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్‌ తివారీ.. పలువురు విద్యార్థుల బృందంతో కలిసి ఆదివారం కమిషన్‌ చైర్మన్‌ అషీమ్‌ ఖురానాతో చర్చలు జరిపి.. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు.

హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి తమ ఆందోళనను తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిగువశ్రేణి ఉద్యోగాలను భర్తీచేసేందుకు ఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు జరిగిన ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1,90,000 మంది హాజరయ్యారు. అయితే ఫిబ్రవరి 17న జరిగిన పరీక్షలో ఢిల్లీ, భోపాల్లోని ఒక్కో పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు వెల్లడవటంతో విద్యార్థులు ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.