Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

2014 సార్వత్రిక ఎన్నికలకు మార్చి ఐదవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి ప్రకటించకుండా ఎందుకో ఇంకా తాత్సారం చేస్తోంది. మరో పక్క ఎన్నికల షెడ్యూల్‌ ఏ క్షణమైన విడుదల కావచ్చనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆశ్చర్యంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునర్‌ ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. గత రెండు వారాల్లో కేంద్ర కేబినెట్‌ పలుసార్లు సమావేశమై అనేక ఆర్డినెన్స్‌లు తీసుకరావడం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం విశేషం.

కేంద్ర కేబినెట్‌ ఒక్క గురువారం నాడే ఏకంగా 30 నిర్ణయాలు తీసుకోవడం విశేషం కాదు, విచిత్రం. గురువారం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని ముఖ్యమైనవి…..
1. బిహార్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌లోని విద్యుత్‌ ప్రాజెక్టులకు 31 వేల కోట్ల రూపాయలను ప్రకటించారు.
2. దేశంలోని మరో 50 కేంద్రీయ విద్యాలయాలు.
3. ముంబై, ఢిల్లీ నగరాల్లో మరిన్ని మెట్రో లైన్లకు అనుమతి.
4. నిరుపయోగంగా ఉన్న విమానాలు దిగే వైమానిక తలాల (ఎయిర్‌ స్ట్రిప్స్‌) పునరుద్ధరణకు 4,500 కోట్ల రూపాయల కేటాయింపు.
5. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి 1,866 కోట్ల రూపాయల కేటాయింపు.
6. బ్యాంకుల నుంచి తీసుకున్న 12,900 కోట్ల రూపాయల రుణాలకు వడ్డీ కింద 2,900 కోట్ల రూపాయల గ్రాంట్‌ మంజూరు.

పలు ఆర్డినెన్స్‌లు
ఏ ప్రభుత్వమైన అత్యయిక పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌లను తీసుకొస్తుంది. ఎలాంటి అత్యయిక పరిస్థితులు లేకుండానే నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. అధార్‌ కార్డుకు అనుసంధానించి బయోమెట్రిక్‌ గుర్తింపులను ప్రైవేటు కంపెనీలు ఉపయోగించుకునేందుకు వీలుగా ఆధార్‌ చట్టంలో సవరణలో చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. యూనివర్శిటీ ఫ్యాకల్టీలలో ఎస్సీ, ఎస్టీ టీచర్ల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికను కూడా పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్శిటీల 13 పాయింట్ల ప్రోగ్రామ్‌ను 200 పాయింట్ల ప్రోగ్రామ్‌గా మారుస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. గత రెండు వారాల్లో కేంద్రం తీసుకొచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లో ఇవి రెండు.

మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి ఏడవ తేదీ వరకు మోదీ దేశంలో విస్తతంగా పర్యటిస్తూ అనేక అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గుజరాత్‌లోని వస్త్రల్‌ నుంచి పేదల కోసం ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి రైలు మార్గాన్ని ప్రారంభించడం ఒక్కటి. అలాగే అహ్మదాబాద్‌లో మెట్రో తొలి దశను ప్రారంభించారు. బాండ్రా–జామ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రారంభోత్సవం చేశారు. జామ్‌నగర్‌లోనే ఓ ఆస్పత్రిని ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాల షెడ్యూల్‌ పూర్తి కావడం కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించకుండా తాత్సారం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల ప్రకారం ఎన్నికలకు మూడు నెలల ముందు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకూడదు. మూడు నెలలకు మించి కొనసాగే ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను చేపట్టకూడదు. ఈ విలువలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తోంది.