Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలపై మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావని.. సాయంత్రం ఆరు గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి వెళ్తుందనేది కూడా దుష్ప్రచారమేనని.. దయచేసి పుకార్లను నమ్మవద్దని ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోల్‌ నిర్వహించినట్లు తెలిపారు. అయితే కొన్నిచోట్ల మాక్‌ పోల్‌ తర్వాత వచ్చిన రిజల్ట్స్‌ను డిలీట్‌ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. మొత్తం ఆరు పోలింగ్‌ స్టేషన్లలో ఈవిధంగా జరిగిందని.. అయితే అసలు పోలింగ్‌ ప్రారంభం కాలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆరు చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నగా, 344 ఈవీఎంలలో సమస్యలు వచ్చాయని.. ప్రస్తుతం వాటిని సరిచేశామని పేర్కొన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేశారని వెల్లడించారు. 12 ప్రాంతాల్లో స్వల్ప ఘటనలు జరిగాయని, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారని పేర్కొన్నారు.

ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి
ఉదయం 11 గంటల వరకు మొత్తం 15 శాతం పోలింగ్‌ నమోదైందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ‘కొన్నిచోట్ల ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. ఆరుగంటలలోపు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నవారికి రాత్రి పది గంటల వరకైనా సరే కచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తాం. 25 చోట్ల ఇష్యూలు ఉన్నట్లు దృష్టికి వచ్చింది. వాటిని అధిగమిస్తాం. 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్న ఆరోపణలను నేను ఖండిస్తున్నా. నా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. అంతేగానీ అనవసరంగా ఆరోపణలు చేస్తే ఏమీ చేయలేం. ఒకవేళ ఆరోపణలు చేసే వారు ఆధారాలతో సహా వచ్చినపుడు, నిజంగానే సమస్య ఉందని భావిస్తే తప్పకుండా రీపోలింగ్‌కు వెళ్తాం. కొన్నిచోట్ల ఈవీఎంలు సరిగానే పనిచేస్తున్నా సిబ్బంది పొరపాట్ల వలన చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నాం. కాబట్టి ఈవీఎంలపై దుష్ప్రచారం సరైంది కాదు. కొన్ని ఛానళ్లలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.