Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఫేక్‌ న్యూస్‌, డేటాచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నసోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ ఫొటో షేరింగ్‌ ప్లాట్‌పాం ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సిస్ట్రోమ్‌, మైక్‌ క్రెగర్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్ని వారాల్లో కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. సిస్ట్రోమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవిలో, క్రెగర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నదీ స్పష్టత ఇవ్వకుండానే రాజీనామా లేఖను కంపెనీకి సమర్పించారు. వీరి రాజీనామా విషయాన్ని సంబంధిత వర్గాలు తమకు తెలిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

మరోవైపు ఈ రాజీనామాను ధృవీకరించిన సిస్ట్రోమ్‌ కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో సోమవారం రాత్రి ఒక పోస్ట్ పెట్టారు. కొత్త చాప్టర్‌కి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. కొత్త ఉత్సుకతను సృజనాత్మకతను మరోసారి వెలికి తీయాలి. ఈ అన్వేషణకు కొంత సమయాన్ని కేటాయించాలని తెలిపారు. తమకు స్ఫూర్తినిచ్చేది, ప్రపంచానికి ఏది కావాలో అర్థం చేసు​కోవాలి..ఆ వైపుగా ప్లాన్‌ చేస్తున్నామని, అందుకే వైదొలిగినట్లు తెలిపారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ తమ  ప్రస్థానాన్ని  మర్చిపోలేమని వ్యాఖ్యానించారు.

కాగా ఎనిమిదేళ్ల కింద 2010లో లాంచ్‌ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట 2012లో ఫేస్‌బుక్‌ 715 మిలియన్‌ డాలర్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఆ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ఢోకా ఉండదని ఫేస్‌బుక్‌ వాగ్దానం చేసింది. అయితే కాలక్రమలో ఇన్‌స్టాగ్రామ్‌ పూర్తిగా తన స్వేచ్ఛను కోల్పోతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌ మధ్య నెలకొన్న విభేదాల వల్లే వీరు రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇది ఇలావుంటే  ఈ వార్తలపై ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పందించారు.

కెవిన్‌, మైక్‌ అద్భుతమైన ప్రొడక్ట్‌ లీడర్లు.. వారి సృజనాత్మక ఉమ్మడి కృషికి ఇన్‌స్టాగ్రామ్‌ ఒక తార్కాణం. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. వారికి ఆల్‌ ది బెస్ట్‌ ..తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాలని వుందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.