Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం అమెరికాలో అత్యధికమంది ప్రవాసులు నివసించేది హెచ్‌-1బీ వీసాపైనే. మారిన పరిస్థితులు, నిబంధనల కారణంగా ఆ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారందరి పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండటమే కాదు, ఏకంగా శాశ్వత పౌరసత్వం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈబీ-5వీసా. కనీసం ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తే, గ్రీన్‌కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే, త్వరలో ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠిన తరం చేయనున్నారట. పెట్టుబడిని 5మిలియన్‌ డాలర్లకు పెంచనున్నారని అమెరికన్‌ కాంగ్రెస్‌మెన్‌ ఆరోన్‌ స్కాక్‌ చెబుతున్నారు. అయితే, పెట్టుబడి పెంపునకు సంబంధించి ఈ ఏడాది డిసెంబరు వరకూ ఎలాంటి మార్పు ఉండబోందని అంటున్నారు.

‘ఈబీ-5 కార్యక్రమాన్ని సెప్టెంబరు వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటివరకూ పెట్టుబడి విషయంలో పెరుగుదల ఉంటుందని నేను అనుకోను. కొత్త సెషన్‌ ప్రారంభమైన తర్వాత పెట్టుబడి విషయంలో మార్పులు ఉండవచ్చు’’ అని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన స్కాక్‌ పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఈబీ-5వీసాలను పొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా 30-40 శాతం వృద్ధి నమోదవుతోంది. వచ్చే 3-4నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. గత 30ఏళ్లుగా పెట్టుబడి మొత్తం స్థిరంగా ఉందని, అందులో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఈ వీసాలకు సంబంధించి యూకే 2మిలియన్‌ డాలర్లకు పెంచగా, కెనడా ఒక మిలియన్‌ డాలర్లకు, ఆస్ట్రేలియా 4 మిలియన్‌ డాలర్లకు పెంచిందని తెలిపారు.

‘ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏ రోజు నుంచి పెట్టుబడి మొత్తం పెరుగుతుందో చెప్పలేను. కానీ, కచ్చితంగా అది జరుగుతుంది. అయితే ఈ పెంపు 1 మిలియన్‌ డాలర్‌నుంచి 1.3 మిలియన్‌ డాలర్ల వరకూ ఉండవచ్చు.’ అని అన్నారు. ఈబీ-5వీసా కార్యక్రమం కింద ఏటా 10వేలమందికి అమెరికా వీసాలను మంజూరు చేస్తోంది. ఈ వీసాలు పొందే జాబితాలో భారత్‌మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో చైనా, వియత్నాం ఉన్నాయి.

‘సరైన అవగాహన లేని సమయంలో ఈబీ-5 దరఖాస్తుల్లో 30-35శాతం వృద్ధి ఉంది. రాబోయే కొన్నేళ్లలో పూర్తి అవగాహన వస్తే, వృద్ధిరేటు భారీగా ఉంటుంది’ అని చికాగోకు చెందిన ఏవీబీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన విక్రమ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. భారతీయులు అత్యధికంగా సంపద సృష్టిస్తున్నారని, 2012లో 50వేల మిలియనీర్లు ఉండగా, 2018నాటికి వారి సంఖ్య 3.30లక్షలకు చేరిందని విక్రమ్‌ తెలిపారు. కనీస పెట్టుబడి 5మిలియన్‌ డాలర్లకు పెంచితే, ఈబీ-5వీసాపై అమెరికాలో ఉండాలనుకునేవారు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెట్టవచ్చు.