Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జ్రీవాల్‌ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు విధించింది. ‘వీరంతా ఎమ్మెల్యేలుగా ఉంటూనే లాభదాయక పదవులు నిర్వహించారు’ అంటూ ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎమ్మెల్యేలు 2015 మార్చి 13 నుంచి 2016 సెప్టెంబరు 8వ తేదీ దాకా… పార్లమెంటరీ కార్యదర్శులుగా వ్యవహరించారని తెలిపింది. ఇది నిబంధనలకు విరుద్ధమని… వారందరినీ అనర్హులుగా ప్రకటించాలని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఈసీ సిఫారసు చేసింది. 2015లో ఆప్‌ ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ 21 మంది ఎమ్మెల్యేలను ‘పార్లమెంటరీ సెక్రటరీ’లుగా నియమించారు.
అయితే… ఇలాంటి పోస్టులు రాజ్యాంగంలో లేవని, ఆ ఎమ్మెల్యేలు ‘లాభదాయక పదవుల్లో’ ఉన్నందున వారిపై అనర్హత వేటు విధించాలని ప్రశాంత్‌ పటేల్‌ అనే న్యాయవాది రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి తనకు అందిన ఫిర్యాదులు, పిటిషన్లను రాష్ట్రపతి ఈసీకి పంపించడం రివాజు. ఇలా.. 21 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో ఆయనపై చర్యలు నిలిపివేసింది. మిగిలిన 20 మంది నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. వారు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అనర్హలుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ప్రజా ప్రతినిధులపై ఫిర్యాదులు, ఎన్నికల అంశాలకు సంబంధించి ఈసీ సిఫారసులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంది. వెరసి.. 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ రాష్ట్రపతి నిర్ణయం వెలువడితే.. ఆ నియోజకవర్గాలన్నింటికీ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.
హైకోర్టుకు ఎమ్మెల్యేలు…
ఎన్నికల కమిషన్‌ నిర్ణయంతో ఆప్‌కు షాక్‌ తగిలింది. అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఏడుగురు అప్పటికప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని విచారణకు స్వీకరించింది. కానీ.. వారికి అక్కడ ఎలాంటి ఊటర లభించలేదు. ఈసీ సిఫారసులపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది.
సర్కారుకు ఢోకా లేదు, కానీ..
ఇరవై మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా… ఢిల్లీలో కేజ్రీవాల్‌ సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదు. ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలుండగా… అందులో 67 ఆప్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు 20 మందిపై అనర్హత వేటు పడినా… మరో 47 మంది ఎమ్మెల్యేలుంటారు. వెరసి.. కేజ్రీ ప్రభుత్వానికి ఢోకా ఉండదు. అయితే… అనర్హత వేటు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువమంది ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితులే కావడం గమనార్హం. ఈసీ సిఫారసును రాష్ట్రపతి ఆమోదించినప్పటికీ.. దీనిపై ఆప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది.
అక్కడ కూడా ఊరట లభించకపోతే.. ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే. ఏకంగా 20 స్థానాల్లో ఉప ఎన్నికలంటే.. అది ‘మధ్యంతర’ పరీక్ష లాంటిదే. గత ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ పురపాలక ఎన్నికల్లో ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పరిధిలోని మూడు నగర పాలక సంస్థలను బీజేపీ సొంతం చేసుకుంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఆప్‌ ఓటు బ్యాంకు సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ ప్రజల నాడి తెలుసుకునేందుకు ఉప ఎన్నికల ద్వారా అన్ని పార్టీలకు అవకాశం లభిస్తుంది.