Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశంలో ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ పరిశ్రమ, మీడియా, క్రీడా రంగాలతో పాటు తాజాగా రాజకీయ రంగాన్ని కూడా మీటూ ఉద్యమం కుదుపేస్తోంది. బాలీవుడ్‌, దక్షిణాది అనే తేడా లేకుండా ఇప్పటికే పలువురు ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మీటూ సెగ ప్రముఖ యాక్షన్‌ డైరెక్టర్‌ ,బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తండ్రి శ్యామ్‌ కౌషల్‌కి తగిలింది.

శ్యామ్‌ కౌశల్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పలు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నమిత ప్రకాశ్‌ ఆరోపించారు. ‘మనోహరమ్‌ సిక్స్‌ ఫీట్‌ అండర్‌’, ‘అప్‌ తక్‌ చప్పాన్‌’ తదితర సినిమాలకు నమిత సహాయక దర్శకురాలిగా పనిచేశారు. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో శ్యామ్‌ తనను వేధించాడని సోషల్‌ మీడియా వేదికగా వాపోయారు.

‘2006లో ఓ సినిమా ఔట్‌డోర్‌ షూటింగ్‌కై కౌషల్‌తో వెళ్లాను. రాత్రి సమయంలో అతను మద్యం సేవిస్తున్నాడు. తనతో కలిసి మద్యం తాగమని నన్ను కోరారు. నేను తాగనని చెప్పి బయటకు వచ్చాను. అతను నా దగ్గరకి వచ్చి తన ఫోన్‌ తీసుకొని అశ్లీల చిత్రాలు చూపించబోయాడు. ఈ విషయం నిర్మాతకు తెలియజేశాను. వారు నాకు క్షమాపణ చెప్పారు కానీ అతనిపై చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి కౌశల్‌ను కలవలేదు. ఆయన షూటింగ్‌లో ఉంటే నేను రెస్ట్‌ తీసుకునేదాన్ని, పోరాట సన్నివేశాలు షూటింగ్‌ చేసే సమయంలో అక్కడికి వెళ్లకపోయేదాన్ని.అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేనూ కౌశల్‌కి దూరంగా ఉంటున్నాను’ అని నమిత పేర్కొంది. కాగా ఈ విషయంపై విక్కీ కానీ, శ్యామ్‌కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం