Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఈ నగరాన్ని రెసిడెన్షియల్‌ సిటీగా పిలుస్తారు. ఇక్కడ టూత్‌ బ్రష్‌ నుంచి ఖరీదైన కార్ల వరకు అన్నీ లభిస్తాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో లభించే తినుబండారాలు ఈ నగరంలో లభిస్తాయి. కరివేపాకు నుంచి మేక మాంసం వరకు అన్నీ దొరుకుతాయి. బయట 50 డిగ్రీల వేడి ఉన్నా అది మీకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో, ఆఫీసులో ఏసీ ఉంటుంది. ఇరవై నాలుగు గంటలూ ఏసీ గదుల్లోనే ఉంటారు. ఒక్క సెకను కూడా కరెంటు పోదు. సామాన్యుడికి అందాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి. ఇక ఇక్కడి సిటిజన్‌కు అయితే సకల సదుపాయాలనూ ప్రభుత్వం అందిస్తుంది. అల్‌ అయిన్‌ నగరవాసికి తప్పనిసరి ఇంటి నిర్మాణంతో పాటు ఉద్యోగం ఇస్తుంది. ఇక్కడ జన్మించిన పిల్లలకు పుట్టిన దగ్గరి నుంచి అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ నెలకు వెయ్యి దీరమ్‌(పదిహేడు వేలు)లను అకౌంట్‌లో వేస్తారు. ఉద్యోగం చేసే వయసు వచ్చేసరికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలోకి తీసుకుంటారు.
నిబందనలు కఠినం
ఇక్కడ ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా ఉంటాయి. జీబ్రాలైన్‌పై ఎవరైనా క్రాస్‌ చేస్తుంటే కార్లు ఆగిపోవాల్సిందే. ఎన్ని వాహనాలు ఉన్నా కొంచెం కూడా ట్రాపిక్‌ జామ్‌ ఉండదు. వాహనాలన్నీ ఒక క్రమపద్ధతిలో ప్రయాణిస్తుంటాయి. ట్రాఫిక్‌ పోలీస్‌ ఒక్కరు కూడా కనిపించరు. అయినా ట్రాఫిక్‌ సిస్టమేటిక్‌గా సాగిపోతూ ఉంటుంది. వాహనాల తాకిడి ఎంతున్నా మనుషులు రోడ్‌ దాటడం కోసం నిమిషం పాటు సిగ్నల్‌ పడుతుంది. వెహికిల్‌ హారన్‌ సౌండ్‌ వినిపించదు. ఇక్కడ రోడ్డును బట్టి వాహనాల స్పీడ్‌ లిమిట్‌ ఉంటుంది. స్పీడ్‌ కాస్త ఎక్కువైనా సరే…. డిజిటల్‌ రాడార్‌ క్యాచ్‌ చేస్తుంది. దాంతో స్పీడ్‌ లిమిట్‌ దాటిన వాహనానికి వెంటనే ఫైన్‌ అప్‌లోడ్‌ అవుతుంది.
లైసెన్స్ పొందాలంటే
ట్రాఫిక్‌ నియమనిబంధనలు కచ్చితంగా పాటించే ఈ నగరంలో కారు నడపాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. లైసెన్స్‌ లేకుండా బండి బయటికి తీయరు. ఈ నగరంలో లైసెన్స్‌ తీసుకోవాలంటే పెద్ద టాస్కే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అధికారులు నెల పాటు శిక్షణ ఇచ్చి మరీ లైసెన్స్‌ జారీ చేస్తారు. అయితే లైసెన్స్‌కు అక్షరాల పదివేల దీరమ్‌లు(లక్షాడెబ్భైఐదువేలు) ఫీజు కట్టాల్సి ఉంటుంది.
భవన నిర్మాణాలలోనూ నిబందనలూ
దుబాయ్‌, అబుదాబీలలో ఎత్తైన భవనాలు కనిపిస్తాయి కానీ అల్‌ అయిన్‌ నగరంలో నాలుగు అంతస్థులకు మించి భవన నిర్మాణాలు ఉండవు. నిబంధనలు ఉల్లఘించే పరిస్థితి అసలే ఉండదు ఎందుకంటే ప్రతీది ఇక్కడి బల్దియా కనుసన్నల్లో జరుగుతుంది. ప్రతి చిన్న నిర్మాణానికీ పర్మిషన్‌ తప్పనిసరి. పర్మిషన్‌ లేకుండా చిన్న గది కూడా నిర్మించలేరు.
అడుగడుగునా నిఘా
నగరం మొత్తం పోలీస్‌ కనుసన్నల్లో, కెమెరాల నిఘాలో ఉంటుంది. కెమెరాలు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ కచ్చితంగా కెమెరా నిఘాల్లో ఉంటాం. ‘బిగ్‌బాస్‌ షో’లో నిఘా ఉన్నట్లు రోడ్డుపై తిరిగే సమయంలో ఎలాంటి నిబంధనలు ఉల్లఘించినా కెమెరా కంటికి చిక్కినట్టే! ఇక్కడ ప్రతి షాపు, కార్యాలయం, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, చిరు దుకాణాలు సహా అన్నింటిలో కెమెరాలు తప్పనిసరి. సీసీ కెమెరాలు లేనిదే షాపుకు పర్మిషన్‌ ఇవ్వరు. ఒక మనిషి రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా కారు ఆగకపోతే పది నుండి పదిహేను నిమిషాల్లో ఆ కారును పట్టుకుని జరిమానా వేస్తారు. రాత్రి, పగలు అని లేకుండా ప్రతి రోడ్డులో షుర్తా(పోలీస్‌) చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక్కడి పోలీ్‌సకు మరో ప్రత్యేకత ఉంది. మార్కెట్‌లోకి వచ్చే ప్రతి కొత్త కారూ పోలీ్‌సస్టేషన్‌లో ఉంటుంది. మెర్సిడెస్‌, బెంజ్‌, ఆడి… ఇలా ఎంత ఖరీదైన కారైనా పోలీ్‌సస్టేషన్‌లో ఉంటుంది. వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తనిఖీలు చేసి, వివరాలు తీసుకుంటారు. ఇక్కడ నేరాల సంఖ్య చాలా తక్కువ. ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల వ్యవధిలో స్పందిస్తారు.
 
కాలుష్యం జీరో
ఈ నగరంలో కాలుష్యం శాతం సున్నా. వేల సంఖ్యలో కార్లు ఉన్నా కొంచెం కూడా పొగ కనిపించదు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఉండదు. ఇళ్లలో చెత్తను రోజుకు మూడుసార్లు బల్దియా తీసుకెళుతుంది. రోడ్డుపై కాగితం ముక్క కూడా కనిపించదు. గాలికి కొట్టుకొచ్చే ఇసుకను రోడ్డుపై నుంచి నిమిషాల వ్యవధిలో శుభ్రపరుస్తారు.
కాసుల(చిల్లర)దే కాలం
గతంలో మన దగ్గర చారణా, ఆఠానా, బారాణా అంటూ చిల్లర పైసలు చలామణిలో ఉండేవి. అవి మన దగ్గర కనుమరుగై చాలా కాలం అయింది. అయితే అల్‌ అయిన్‌ నగరంలో ఇప్పటికీ చిల్లర పైసలు చలామణిలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏక్‌దీరమ్‌ అని పిలుస్తారు. ఒక్క దీరమ్‌కు ఛాయ్‌, ఒక్క దీరమ్‌కు కూల్‌ డ్రింక్‌, రెండు దీరమ్‌లలో టిఫిన్‌ లభిస్తాయి. మూడు, నాలుగు ధిరమ్‌లతో భోజనం దొరుకుతుంది. సంపన్నులు కూడా కాయిన్స్‌తో పని కానిచ్చేస్తుంటారు. నోట్లు వాడడం షాపింగ్‌ మాల్స్‌లో తప్ప బయట కనిపించదు. టాక్స్‌ఫ్రీ సిటీ కావడంతో ధరలు చాలా వరకు తక్కువనే చెప్పవచ్చు.
మహిళల రక్షణకు ప్రాదాన్యం
ఈ నగరంలో మహిళల రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు కనిపిస్తాయి. ఇక్కడి వారికే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన మహిళలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినశిక్షలు ఉంటాయి. మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఏ సమయంలోనైనా మహిళలు ధైర్యంగా తిరగొచ్చు.
 గ్రీన్ సిటీ
ఎడారి ప్రాంతంలో నీరు దొరకడమే కష్టం. అలాంటి భూమిపై చెట్టు పెంచాలంటే ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. అయితే ఈ నగరమంతా పచ్చని చెట్లతో కళకళలాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్‌ అయిన్‌ నగరంలోని ప్రతి రోడ్డు, ప్రతీ వీధి పచ్చని చెట్లతో కనిపిస్తాయి. ఎండలు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ నగరం మంచి నివాస ప్రాంతంగా పేరు సంపాదించడానికి ఇదే ముఖ్య కారణం. దుబాయ్‌, అబుదాబీ, షార్జా లాంటి నగరాలలో అతి ఎక్కువ వేడితో పది నిమిషాలు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. కానీ అల్‌ అయిన్‌లో సాయంత్రం పూట హాయిగా బయట తిరిగే వాతావరణం కనిపిస్తుంది. మన దగ్గర కనిపించే వేప చెట్లు, తుమ్మ చెట్లు, తంగేడు చెట్లు అల్‌ అయిన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఖర్జూర తోటలు వందల సంఖ్యలో ఉంటాయి. ప్రతి ఇంటి ముందు, రోడ్డు మధ్యలో ఖర్జూర చెట్లు దర్శనమిస్తాయి. ఇక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉన్నారు.