Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజస్థాన్‌లోని అల్వర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. 1855లో ప్రారంభమైన తొలి స్టీమ్‌ ఇంజన్‌ రైలు ‘ఫెయిరీ క్వీన్‌’ చివరి స్టేషన్‌ ఇది. మనదేశంలో ఇప్పటికీ పట్టాలపై పరుగెత్తుతున్న పురాతన రైలు ఇదే కావడం విశేషం. ‘ఫెయిరీ క్వీన్‌’లో న్యూఢిల్లీ నుంచి అల్వర్‌కు వెళ్లడం గొప్ప అనుభూతిగా పర్యాటకులు చెబుతుంటారు. ఈ రైలు 1909లో రిటైర్‌ అయినప్పటికీ, బాగుచేసి తిరిగి 1997 నుంచి నడుపుతున్నారు.
 అల్వర్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో అక్కడ ‘మత్స్య ఫెస్టివల్‌’ కన్నులపండువగా జరుగుతుంది. చుట్టూ కొండలు, చెరువులు, చారిత్రక కట్టడాలతో పురాతన పట్టణంలా కనిపించే అల్వర్‌లో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. వారంతా ఎన్నో తరాలుగా సంప్రదాయంగా జరుపుకునే ఈ ఫెస్టివల్‌ కారణంగా అల్వర్‌ను ‘మత్స్య నగర్‌’గా కూడా పిలుస్తారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు, దేశ రాజధాని న్యూఢిల్లీకి సరిగ్గా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అల్వర్‌. స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ‘మత్స్య ఫెస్టివల్‌’ సందర్భంగా ఆళ్వార్‌ సరికొత్తగా ముస్తాబవుతుంది.
 ఊరు ఊరంతా రంగులమయంగా మారుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఎక్కడ చూసినా ఎగ్జిబిషన్లు, ఆటలు, సంప్రదాయ గీతాలు, నృత్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ‘రుమాల్‌ జాపట్టా’ (నేల మీద ఉన్న రుమాలు కోసం ఆడే ఆట), ‘రస్సా కస్సీ’ (మహిళలు ఆడే టగ్‌ ఆఫ్‌ వార్‌), ‘తీర్‌ అందాజ్‌’ (స్థానికంగా చేసిన విల్లంబులతో ఆడే ఆట) చూసేందుకు వేలసంఖ్యలో జనం గుమిగూడుతారు. ఇవన్నీ కూడా స్థానికుల సంప్రదాయంలో భాగమే అయినప్పటికీ వాటిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
 ఈ సందర్భంగా రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ధారోహార్‌’ అనే పురావస్తు ప్రదర్శనను కూడా ఏర్పాటుచేస్తుంది. పిల్లల కోసం చిత్రోత్సవం జరుపుతారు. అల్వర్‌ చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలకు కొదవే లేదు. అనేక కోటలతో పాటు ఆరావళి కొండ ప్రాంతంలో ఉన్న ‘సరిస్కా’ పులుల సంరక్షణ కేంద్రం చూసి తీరాల్సిందే!
ఈ ఏడాది ‘మత్స్య ఫెస్టివల్‌’ నవంబర్‌ 25, 26 తేదీల్లో జరగనుంది. ఇంకెందుకు ఆలస్యం… బ్యాగులు సర్దుకోండి మరి.