Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకూ క్షీణిస్తుండటం దేశీయ విమానయాన సంస్థలను కలవర పెడుతోంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), విమానాల లీజు, విమానాల మరమ్మతులు-నిర్వహణ (ఎంఆర్‌ఓ)కు చెల్లింపులన్నీ డాలర్‌ రూపేణ జరపాల్సి రావడం ఇందుకు కారణం. దేశీయంగా ఆదాయమేమో రూపాయల్లో వస్తుంటే, చెల్లింపులు డాలర్లలో జరపాల్సి ఉంది. ఇప్పుడు డాలర్‌ రూ.70.80కి చేరడంతో, విమానయాన సంస్థలకు చేతిచమురు వదులుతోంది. ఫలితంగా టికెట్‌ వ్యయాలు కూడా పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు  అంటున్నాయి.

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్యలో రెండంకెల వృద్ధి లభిస్తోంది. 125 కోట్ల మంది జనాభా ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. ఇందులో సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు అధికం. ఇటువంటి వారు తరచుగా (రిపీటెడ్‌) ప్రయాణిస్తుంటారు. అయితే మధ్యతరగతి ప్రజలను, కొత్త ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయాణికులను ఆకర్షించేందుకు తొలుత సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. క్రమంగా విమానయానానికి అలవాటు పడితే, ఛార్జీలు పెరిగినా, కొనసాగుతారనే అంచనాలతో సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే మళ్లీ కొత్త సంస్థ ఏదైనా సేవలు ప్రారంభించి, ఆఫర్లు ఇస్తుంటే, మిగలిన సంస్థలు కూడా ఛార్జీలు పెంచే వీలుండటం లేదు. తక్కువ ఛార్జీలతో ముందస్తు బుకింగ్‌లు చేయిస్తూ, నగదు లభ్యతను చూసుకుంటున్న సంస్థలు, క్రమంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం డాలరే.

డాలర్‌ భారం ఇలా..
విమానయాన సంస్థలు లీజ్‌, ఇతర అవసరాల కోసం డాలర్‌ రూపేణ రుణాలు తీసుకుంటాయి. ఇవీ ఇప్పుడు భారమవుతున్నాయి. తమ రుణాల్లో 65 శాతం డాలర్‌ రూపేణ ఉన్నాయని, ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇటీవల ప్రకటించడం గమనార్హం.

విమానాలను విదేశీ సంస్థలు లీజుకు ఇస్తుంటాయి. దేశీయంగానే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా విమానయాన సేవల్లోకి వచ్చే సంస్థ, తొలుత విమానాలు కొనదు. లీజుకు తీసుకునే నిర్వహిస్తుంది. సాధారణంగా విమాన ధరలో 1 శాతం వసూలు చేస్తున్నారు. దేశీయంగా చూస్తే 110 సీట్ల విమానాలకు నెలకు 2.85 లక్షల డాలర్లు (దాదాపు రూ.2.0 కోట్లు) పైగా లీజ్‌ చెల్లించాల్సి వస్తోంది. చెల్లింపులు డాలర్‌ రూపేణ ఉంటాయి. డాలర్‌ విలువ రూ.60 ఉన్నపుడు ఇది రూ.1.71 కోట్లు మాత్రమే అయ్యేది. ఏటీఆర్‌ రకం చిన్న విమానాలకూ 1-1.25 లక్షల డాలర్లు (రూ.70-87 లక్షలు) ప్రతినెలా చెల్లిస్తునఆనయి. కింగ్‌ఫిషర్‌ కొన్ని విమానాలకు లీజు కూడా చెల్లించలేకపోవడంతో, 12 నెలల అద్దె ముందస్తుగా చెల్లించాలనీ విదేశీ సంస్థలు పట్టుబడుతున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉన్న రూ.8,620 కోట్ల రుణాల్లో, విమాన సంబంధిత రుణాలే రూ.1,968 కోట్లు.
ఆయా విమనాలకు మరమ్మతు, నిర్వహణ సేవలు (ఎంఆర్‌ఓ) కూడా తామే చేపడతామనే నిబంధనను లీజ్‌కు ఇచ్చే సంస్థలు విధిస్తున్నాయి. ఇందుకోసం ఇంజిన్‌, విమాన తయారీ సంస్థలకు డాలర్లలోనే చెల్లించాలి.
విమానాల నిర్వహణలో ఇంధనం (ఏటీఎఫ్‌) వాటాయే 40 శాతం ఉంటుంది. ఇంధన వ్యయాలు పెరుగుతున్నందున, ఈ ఖర్చు పెరిగిపోతోంది. 2017 ఏప్రిల్‌-జూన్‌లో ఇంధన వ్యయం రూ.1,524 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.2,332 కోట్లకు పెరిగిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. ఇంకా ఇతర కారణాలు కూడా జతకలిసి సంస్థ రూ.1323 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇందులో డాలర్‌ విలువ పెరగడం వల్లే రూ.350 కోట్ల అదనపు భారం పడింది. ఏడాది క్రితం రూ.53 కోట్ల లాభంలో సంస్థ ఉంది. ఏడాది కాలంలో రూపాయల పరంగా ఆదాయం పెరిగినా కూడా, నష్టాలు మూటకట్టుకునేందుకు ఇంధనం ఖర్చు, డాలర్‌ మారకపు విలువే కారణం. ఇండిగో కూడా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.250 కోట్ల డాలర్‌ భారాన్ని మోసింది.

ఛార్జీలు పెంచొచ్చు కదా అనుకుంటే..
పిల్లలకు సెలవులు ఉండే వేసవిలో దేశీయులు అధికంగా పర్యటిస్తుంటారు. పండుగ సీజన్‌కు తోడు, శీతాకాలంలోనూ (అక్టోబరు-డిసెంబరు) ఇటీవల పర్యటనలు పెరుగుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన దేశీయులు కూడా ఆసమయంలో సెలవులకు, సొంత ప్రాంతాలకు రావడమూ కలిసి వస్తోంది. అయితే జులై-సెప్టెంబరులో మాత్రం వర్షాలకు తోడు, విద్యా సంస్థల హడావుడి ఉంటుంది కనుక, బస్సు-రైళ్లకే పెద్ద గిరాకీ ఉండదు. ఇక విమానాల సంగతి చెప్పేదేముంది.

5.99 కోట్లు 
2011లో దేశీయంగా విమాన ప్రయాణికులు
67 
2011లో దేశీయంగా ప్రతి గంటకు ఎగిరిన విమానాలు
75.5%
2011లో దేశీయ విమానాల్లోసీట్ల భర్తీ
11.72 కోట్లు 
2017లో దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారు
100
2017లో దేశీయంగా ప్రతి గంటకు ఎగిరిన విమానాలు
86.1%
2017లో దేశీయ విమానాల్లో సీట్ల భర్తీ

సంస్థలేం చేస్తున్నాయి?
తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే విమానాలను దేశీయ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో కొంటే 15-20 శాతం రాయితీ లభిస్తుంది కనుక, దశలవారీగా పొందేలా ఆర్డర్లు ఇస్తున్నాయి. లీజ్‌కు ఇచ్చే సంస్థల (లెస్సర్లు)కు విక్రయిస్తూ, మార్జిన్‌ రూపేణ లాభపడుతున్నాయి. మళ్లీ వాటి దగ్గరే లీజ్‌కు తీసుకుంటున్నాయి. ఉన్న విమానాలనే సాధ్యమైనన్ని, రద్దీ అధికంగా ఉండే గమ్యస్థానాలకు తిప్పడం, సిబ్బంది ఉత్పాదకతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. టికెట్‌ ఛార్జీలను కూడా, నిర్వహణ వ్యయాలకు అనుగుణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తక్కువదూరం ప్రయాణాలు తీసుకుంటే, విమానం ప్రయాణం మొత్తంమీద వినియోగించుకునే ఇంధనంలో దాదాపు సగం మేర ఎగిరేందుకే అవసరమవుతుంది. అందువల్ల తక్కువదూరం ప్రయాణాలకు హేతుబద్ద ఛార్జీలు లేకపోతే దీర్ఘకాలంలో మనుగడ సాగించడం కష్టమవుతుందని చెబుతున్నాయి.