Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అలక్‌పురాలో మగవారితో పోలిస్తే ఆడవారి శాతం చాలా తక్కువ. అందుకు అక్కడున్న అసమానతలే కారణం. కానీ ఆ చీకటి తెరలు ఛేదించుకుని గ్రామంలోని బాలికలు ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చారు. ఆటలు మగవారికే కానీ… ఆడపిల్లలకు కాదు పొమ్మన్న కోచ్‌నే ఒప్పించి ‘కిక్‌’ మొదలుపెట్టారు. సరదాగా మొదలైన ఆటలో మెల్లగా మెళకువలు నేర్చుకుని విశ్వ వేదికలపై ‘గోల్స్‌’ కొట్టే స్థాయికి చేరారు.
ఇప్పుడా ఊరి ‘చిత్రం’ మారింది. ఒకప్పుడు ‘అబల’ అన్నవారే ఇప్పుడు దండ వేసి తిరుగులేదంటూ అభినందనల జల్లు కురిపిస్తున్నారు. దీని వెనుక నాడు తెగువ చూపి సమానత్వపు బాటలేసిన మగువలెందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే గ్రామంలోని రెండు అతిపెద్ద ఫుట్‌బాల్‌ మైదానాలు ఔత్సాహికులైన అమ్మాయిలతో నేడు కిక్కిరిసిపోతున్నాయి. రోజూ సాయంత్రం వేళ రెండో సెషన్‌ ప్రాక్టీస్‌ కోసం సరిగ్గా అరగంటలో దాదాపు రెండొందల మంది బాలికలు ఈ మైదానాల్లో గుమికూడతారు. ఒక పక్క మంచు కురుస్తూ… చలి చంపేస్తుంటే… మరోవైపు కఠోర సాధనతో స్వేదం చిందిస్తుంటారు. వారికి ఫుట్‌బాల్‌ ఆట మాత్రమే కాదు… కన్న కలలు నిజం చేసుకొనే ఒక మార్గం కూడా!
ట్రోఫీలు… స్కాలర్‌షిప్‌లు…
అమ్మాయిల ఫుట్‌బాల్‌ ఆట ఎన్నో ట్రోఫీలు, స్కాలర్‌షిప్‌లే కాదు… ఉద్యోగాలు సైతం సాధించిపెట్టింది. దాదాపు డజను మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను దేశానికి అందించింది. అన్నింటికీ మించి… గ్రామంలో పాతుకుపోయిన లింగ విచక్షణను రూపుమాపి మహిళా సాధికారతకు అర్థం చెప్పింది.
సరదాగా మొదలుపెట్టి…
పదేళ్ల కిందట అలక్‌పురా వేరు… ఇప్పుడు చూస్తున్న అలక్‌పురా వేరు. అప్పటి స్థానిక స్కూల్‌ కోచ్‌ గోవర్ధన్‌ దాస్‌ ఎప్పుడూ మగపిల్లలకు కబడ్డీ శిక్షణ ఇవ్వడంలో బిజీగా ఉండేవారు. ‘మమ్మల్ని కూడా ఆడించండి’ అంటూ ఆడపిల్లలు పదే పదే ప్రాథేయపడేవారు. దీంతో కోచ్‌ కాస్త మెత్త పడ్డాడరు. స్పోర్ట్స్‌రూమ్‌లో నిరుపయోగంగా పడివున్న ఫుట్‌బాల్‌ను వారికి ఇచ్చారు. బాలికల ఆనందానికి హద్దులు లేవు. నలభై యాభై మంది రోజూ ఆ బాల్‌ వెంట పడేవారు. సరదాగా ‘కిక్‌’ మొదలుపెట్టిన అమ్మాయిలు… దాన్నో ఫిజికల్‌ యాక్టివిటీగా మార్చుకున్నారు. నిదానంగా ఆటలో మెలకువలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఎక్కడపడితే అక్కడ రాళ్లు, గుట్టలున్న మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ… నైపుణ్యం పెంచుకున్నారు. గత ఏడాది వరకూ అక్కడ గోల్‌పోస్ట్‌ స్థానంలో రెండు రాళ్లు ఉండేవి. దాన్నిబట్టి అక్కడి సౌకర్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ వేదికపై మెరుపులు…
‘వాళ్ల ఆట చూసి ముగ్ధుడినయ్యాను. సరైన శిక్షణ ఇస్తే మంచి క్రీడాకారిణులుగా తయార వుతారని అనిపించింది’ అంటారు దాస్‌. అక్కడే ఊరి అమ్మాయిల జీవితం పెద్ద మలుపు తిరిగింది. చరిత్రకు బీజం వేసింది. 2012లో ‘అలక్‌పురా ఫుట్‌బాల్‌ క్లబ్‌’ ఆవిర్భవించింది. అప్పటి నుంచీ డజనుకు పైగా గ్రామ బాలికలు ఫుట్‌బాల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఏడాది అలక్‌పురా ఫుట్‌బాల్‌ క్లబ్‌ ‘ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌’లో పోటీపడింది. క్లబ్‌కు చెందిన సంజూ యాదవ్‌ 11 గోల్స్‌ చేసి లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అండర్‌ 17 కేటగిరీలో ఈ క్లబ్‌ రెండుసార్లు సుబ్రతో కప్‌ (జాతీయ స్థాయి స్కూల్‌ చాంపియన్‌షిప్‌) టైటిళ్లు గెలుచుకుంది.
ఇంటికో మహిళా ఫుట్‌బాలర్‌…
ఇప్పుడు ‘ఇంటికో మహిళా ఫుట్‌బాలర్‌ ఉంది’ అంటూ గర్వంగా చెప్పుకొంటన్నారు గ్రామస్తులు. ఒకప్పుడు వారే ఆడపిల్లలకు కోచింగ్‌ ఇస్తున్నందుకు దాస్‌ను అవహేళన చేశారు. ఆయన తరువాత శిక్షణ బాధ్యతలను సోనికా బిజర్నియా తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆడిన బాలికలకు స్కాలర్‌షిప్‌లు దక్కాయి. అవి వారి తల్లిదండ్రుల్లో తమపై, తమ ఆటపై నమ్మకం కలిగేలా చేశాయి. చాలామందికి స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఆడపిల్లలనగానే ఎన్నో బాధలు, ఇబ్బందులూ ఉంటాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగి విజయాలు సాధించడం వారి పట్టుదలకు నిదర్శనం. అర్జెంటీనా, బ్రెజిల్‌ ఆటగాళ్లలా వీరిని కూడా చూడాలన్నది సోనికా కల!
ఆటే ప్రాణం…
ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫడెరేషన్‌’ 2016, 17 ఈవెంట్స్‌ మహిళా విభాగం పోటీల్లో భారత జట్టు తరుఫున గ్రామానికి చెందిన పూనమ్‌ శర్మ పాల్గొంది. పదేళ్ల కిందట పూనమ్‌ ఊళ్లో ఆట మొదటుపెట్టినప్పుడు ఎలాంటి లక్ష్యం లేదు. కానీ… ఇప్పుడు అమ్మాయిలందరూ ఆటను ఆస్వాదిస్తున్నారు. పూనమ్‌కు ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఆడ పిల్లలు తనకు భారంగా మారారని వాళ్ల నాన్న ఎప్పుడూ తిడుతూ ఉండేవారు.
కానీ ఇప్పుడు… ఫుట్‌బాల్‌లో విజయాలు సాధిస్తున్న తరువాత ఆయనే తన ఆడ పిల్లల్ని చూసి గర్విస్తున్నారు. డిగ్రీ చదువుతున్న పూనమ్‌కు ఫుట్‌బాలే ప్రాణం. మలేసియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రితూ బగారియా తొమ్మిదేళ్లుగా ఫుట్‌బాల్‌ ఆడుతోంది. రోజూ చదువు, ఫుట్‌బాల్‌ సాధనతో పాటు ఇంట్లో అమ్మకు.. పొలంలో నాన్నకు సహకరిస్తుంది. అటు ఆటను… ఇటు ఇంట్లో పనిని ఎలాంటి ఒత్తిడి లేకుండా సమన్వయంతో చేసుకుపోతోంది బగారియా. తనే కాదు… ఇలా ఎందరో అమ్మాయిలు ఆ గ్రామం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో మట్టిలో మాణిక్యాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిస్తున్నారు. ఇలాంటి విజయగాథలెన్నో అలక్‌పురాలో ఏ ఇంటి తలుపు తట్టినా కనిపిస్తాయి.