Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సీఎం వసుంధరా రాజేపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ప్రశంసలు కురిపించారు. ‘‘ఇతరులెవ్వరూ చేయలేని పనిని ఆమె చేసి చూపించారు. ఆ మాటకొస్తే బీజేపీలోనే కాదు.. మొత్తం దేశంలోనే ఆమెలా ఎవరూ నిలబడలేకపోయారు…’’ అని పైలట్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేసులో ముందున్న ఆయన ఎన్డీటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ప్రేమపూర్వక రాజకీయ విధానాలు పాటిస్తామంటూ మీ పార్టీ చీఫ్ రాహుల్ చెబుతుంటారు కదా.. ఆ స్ఫూర్తితో మీ ప్రత్యర్థి గురించి రెండు మంచిమాటలు చెప్పండి…’’ అని ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించగా…
‘‘అమిత్ షా స్థానం ఏమిటో ఆమె చూపించగలిగారు. బీజేపీలో ఎవరికీ ఇలా చెప్పగల ధైర్యం లేదు. వాస్తవానికి ఆమె తనంతతానే నిలబడి పోరాడుతున్నారు. పార్టీలో 75 రోజులుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నా ఒంటిచేత్తో నడిపిస్తున్నారు..’’ అని పైలట్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో రాజస్థాన్ ఉపఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో పార్టీ చీఫ్ అమిత్ షా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామీని తొలగించి, ఆయన స్థానంలో తన అనుకూలుడైన గజేంద్ర సింగ్ షె‌కావత్‌ను నియమించాలని భావించారు. అందుకు సీఎం వసుంధర ససేమిరా అనడంతో పార్టీలో ‘‘కోల్డ్ వార్’’ మొదలైనట్టు చెబుతారు.
కాగా వసుంధర గురించి మరో మంచి విషయం చెప్పాలని అడగడంతో సచిన్ పైలట్ స్పందిస్తూ… ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజా జీవితంలోనూ, పార్టీ పరంగానూ ఆమె విశేష సేవలు అందించారని.. ఒక మహిళగా ఆమెను ఈ విషయంలో గౌరవించాల్సిందేనన్నారు. అయితే ఆమె పరిపాలనలో అహంభావం ప్రదర్శిస్తూ ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారని పేర్కొన్నారు. వెంటనే ఇలా పాజిటివ్ నుంచి నెగిటివ్‌గా ఎలా మాట్లాడతారని అడగ్గా.. ‘‘నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నిజాయితీగా ఉండాలి కదా…’’ అంటూ ఆయన నవ్వేశారు. 2013లో వసుంధర మొత్తం 611 హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారనీ.. వాటిలో ఎన్ని హామీలను నెరవేర్చారో చెప్పాలన్నారు. రాజస్థాన్‌లో వచ్చే నెల 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తర్వాతి నాలుగు రోజుల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.