Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మనసుంటే మార్గముంటుంది అంటారు. అవును నిజమే.. మంచి చేయాలనే మనసుండాలే కానీ, మార్గం దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. మారుతీరెడ్డి విషయంలో అదే జరిగింది. ప్రభుత్వ కార్యాయలయంలో చిరుద్యోగిగా పనిచేసే మారుతి.. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ‘మనీ’ పిచ్చితో మానవత్వాన్ని మరిచిపోతున్న ఈ సమాజానికి తానొక మెసేజ్‌గా మారాడు.
అనంతపురం జిల్లా పెనుకొండ పంచాయతీ కార్యాలయంలో మారుతీరెడ్డి వాటర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం తన తండ్రి అంజన్ రెడ్డి పెనుకొండ పంచాయతీకి వైస్ సర్పంచ్‌గా పనిచేశారు. అప్పటి నుంచే తండ్రితో పాటు మారుతి సేవాకార్యమాల్లో పాల్గొనేవాడు. సమాజానికి మంచి చేయాలనే కోరిక అతడి మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే చిన్న ఉద్యోగం చేసే తాను ఎలాంటి సేవ చేయగలనని ఆలోచించాడు. అలాంటి ఆలోచనల్లో ఉన్న మారుతి ఓ రోజు ఒక దృశ్యం చూసి చలించిపోయాడు. అందరూ ఉన్నా అనాధలుగా మిగిలిపోయిన శవాలకు పంచాయతీ కార్మికులే ఖననం చేస్తుండడాన్ని గమనించాడు. పెనుకొండ సమీపంలో జాతీయ రహదారి ఉండడంతో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. శ్రీకృష్ణదేవరాయల రెండో రాజధాని అయిన పెనుకొండ చారిత్రక పట్టణాన్ని సందర్శించడానికి పర్యాటకులు, యాచకులు వస్తుంటారు. ప్రమాదాల బారిన పడి కొందరు.. అనారోగ్యంతో మరికొందరు మృత్యువాత పడుతుంటారు. అలాంటి వారి భౌతిక కాయాలను తరలించి ఖననం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఇలాంటి పరిస్థితుల్లో కులమతాలకతీతంగా అనాధ శవాలకు నేనున్నానంటూ ముందుకొచ్చాడు మారుతి. అయితే మృతదేహాలను తరలించడానికి అతడి వద్ద అంబులెన్సు లాంటి అనువైన వాహనం లేదు. దీంతో ఏం చేయాలని ఆలోచించాడు. వెంటనే అతడికో ఆలోచన తట్టింది. తన ద్విచక్రవాహనానికే ట్రాలీ బిగించి వైకుంఠ రథంగా మార్చేశాడు. పోలీసుల నుంచి, అలాగే ఆస్పత్రి నుంచి ఫోన్ రాగానే వెంటనే వాలిపోతాడు. శవానికి పోస్టుమార్టం అయిన వెంటనే ఆ మృతదేహాన్ని తన వాహనం ద్వారా శ్మశానానికి తరలించి శవాన్ని ఖననం చేసేంత వరకు అన్ని తానై చూసుకుంటాడు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో బలవన్మరణాలకు పాల్పడి వారి కుటుంబ సభ్యులు పేదవారైతే తనకు ఫోన్ చెయ్యాలని పైసా ఖర్చు లేకుండా సేవలందిస్తానని చెబుతున్నాడు. పెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాల వారికి తన ఫోన్ నెంబర్‌ను అందుబాటులో ఉంచాడు.
పుట్టుకతోనే ఎవరూ అనాధలు కారని.. చస్తే వెంట వచ్చేది ఏదీ లేదని మారుతి చెబుతాడు. మతం కంటే మానత్వం గొప్పదని తాను నమ్ముతానని తెలిపాడు. పేదలు, విధివంచితులైన అభాగ్యులపై దయచూపకపోతే ఈ మానవ జన్మ ఎందుకని ప్రశ్నిస్తున్నాడు మారుతీరెడ్డి. గత శనివారం రాత్రి పెనుకొండ మండల పరిధిలోని వెంకటాపురంతాండ వద్ద జాతీయ రహాదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధయాచకురాలు మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న మారుతీరెడ్డి ఆస్పత్రికి చేరుకొని పోస్టుమార్టం అనంతరం పోలీసులతో మాట్లాడి తన సొంత వాహనంపై శవాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలను నిర్వహించాడు. పంచాయతీ సిబ్బంది సహకారంతో తాను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నట్లు మారుతీరెడ్డి చెప్పుకొచ్చాడు.