Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మన భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం దంపతులు ఒకే మాట, ఒకే బాటగా జీవితం సాగించాలి. వాళ్ళను బట్టే, వాళ్ళకు కలిగే పిల్లలూ తయారవుతారు. ఇవాళ్టి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. మనకు అనాది కాలంగా వస్తున్న సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలున్నాయి. వాటిని ఈనాటి పిల్లలకు బోధిస్తూ, ధర్మం చెప్పడం ఎంతో అవసరమనేది అందుకే! అది ఎలాంటి ధర్మం అంటే- అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం ఉన్న ధర్మం. ఈ అయిదూ అందరికీ అవసరం. అయితే, వాటిని ముందుగా తల్లితండ్రులు ఆచరించాలి.
తల్లితండ్రుల ప్రవర్తనే పిల్లలకు గురువుగా మార్గదర్శనం చేస్తుంది. అలా పిల్లలకు తమ ప్రవర్తన ద్వారా నేర్పాలి. ఇలా జాతి అంతా ఐకమత్యంగా ధర్మమార్గంలో వెళితే, అప్పుడే దేశ సౌభాగ్యం. జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఇదే మార్గం. ధర్మం విషయంలో ఎప్పుడైనా, ఏదైనా సందేహం కలిగితే, ఉత్తముడైన గురువును ఆశ్రయించాలి. మామూలు మాటల్లో చెప్పాలంటే, పరోపకారమే పరమ ధర్మం. వృద్ధులను సేవించడం, తోటివారిని ప్రేమించడం, ఆపదలో… అవసరంలో… ఉన్నవారిని ఆదుకొనడం… ఇంతకు మించి వేరే ధర్మం ఏముంటుంది! ఇలాంటి ధర్మాచరణ వల్ల మనుషులు బాగుంటారు. మనుషులు బాగుంటే, జీవితం బాగుంటుంది. చుట్టుపక్కల అందరి జీవితం బాగుంటే, సమాజం బాగుంటుంది. అంటే మన దేశం బాగుంటుంది.
చిరస్మరణీయం
ప్రతి ఒక్కరికీ, వారి జీవితంలో మేలిమలుపుగా నిలిచిపోయే, బాగా గుర్తుండిపోయే రోజు ఒకటి ఉంటుంది. నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అలాంటి రోజు 1983 మే 29వ తేదీ. ఆ రోజున మా గురుదేవులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీ చేతుల మీదుగా నేను సన్న్యాస దీక్ష తీసుకున్నాను. దివ్యస్వరూపులైన నా గురువు నన్ను అక్కున చేర్చుకొని, పక్షి తన పిల్లను సాకినట్టు నన్ను సాకడం నా భాగ్యం! వెనక్కి తిరిగి చూసుకుంటే మా గురువుగారి సన్నిహిత సాహచర్యంలో నేను గడిపిన సంవత్సరాలు కనిపిస్తున్నాయి.
అయస్కాంతం ఇనుప రజనును లాగినట్టు నన్ను ఆయన తన వైపు ఆకర్షించుకున్నారు. చాలా సన్నిహితంగా ఉంటూ నేను ఆయనలో గమనించిన గొప్ప గుణాల గురించి వ్యక్తపరచడానికి నా దగ్గరున్న మాటలు సరిపోవు. ‘‘‘శ్రీమఠం’ (కంచి కామకోటి పీఠం) కోసం మీ గురువు (జయేంద్ర సరస్వతి) చేసిన సేవలు మరెవరూ చెయ్యలేరు’’ అంటూ పరమాచార్య (శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి) నాతో అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. అవి ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నా గురువు బహుముఖీనమైన వ్యక్తి. శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ వల్లభాచార్య రచించిన శ్లోకం ఒకటుంది.
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురం
ఇదే విధంగా మా గురువుగారి ప్రతి లక్షణాన్నీ నేను గణించినట్టయితే, ఆయన సర్వ సద్గుణాల రాశిగా దర్శనమిస్తారు. ఆయనను విశ్వంలో విశిష్ట వ్యక్తిగా చేసిన కొన్ని లక్షణాలను చెప్పాలనుకుంటున్నాను.
శ్రీ ఆది శంకర భగవత్పాదులు రెండువేల అయిదువందల సంవత్సరాల కిందట స్థాపించిన ‘శ్రీ కంచి కామకోటి పీఠం’ అధిపతిగా అత్యున్నతమైన పదవిని నిర్వహిస్తున్నప్పటికీ పూజ్య గురువులు చాలా నిరాడంబరంగా, ఎల్లప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే మోముతో ఉండేవారు. ఎవరైనా ఆయనను చాలా సులభంగా కలుసుకోవచ్చు. తన భక్తుల జీవితాల్లో సమస్యలను ఆయన చాలా ఓపికగా వింటారు. పరిహారాలతో పరిష్కారాలు సూచిస్తారు. వారిని ఆశీర్వదిస్తారు. తనకు అసౌకర్యం కలిగినా లెక్క చెయ్యకుండా దర్శనం వారికి ప్రసాదిస్తారు. తన దగ్గరకు వచ్చినవారెవరినీ ఆశాభంగంతో తిరిగి వెళ్ళనివ్వరు. భగవంతుడికి అనేక నామాల్లో అచ్యుతుడనేది ఒకటి, ‘తన దగ్గరకు చేరిన వారిని తన చేతుల నుంచీ విడవని వాడు’ అని దాని అర్థం. సరిగ్గా మా గురుదేవులు అలాంటివారే!