Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శ్రీకృష్ణపరమాత్మ తన విశ్వరూపాన్ని తనే వ్యాఖ్యానించాక నిర్భయంగా లేచి యుద్ధం చేయవయ్యా! నిమిత్తమాత్రంగా చేయవయ్యా! అంతా కర్మ ప్రకారం జరిగిపోతుంది. నడిపించే వాణ్ణి నేనున్నాను, నడవడానికే ఇంత భయపడితే ఎలాగయ్యా! అని అంటాడు. శ్రీకృష్ణుని మాటలు విన్నాక అర్జునుడికి కొంత ధైర్యం వచ్చింది. ఆ విశ్వరూపాన్ని చూసిన తన్మయభావంతో స్తోత్రం చేస్తున్నాడు.
త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌!
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప!! 
నీవే ఆది దేవుడవు. పురాణ పురుషుడవు. ఈ విశ్వానికి మూలమైనటువంటి నిధి, కారణం, ఆధారం.. అన్నీ నువ్వే! తెలుసుకునే వాడివి నువ్వే! తెలుసుకోబడే వాడివి కూడా నువ్వే! అనంతమైన రూపములు కలిగిన ఓ మహానుభావా! నీ చేతనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది.
‘‘భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడమ్మా! ఏ రూపంలోనైనా రావచ్చు’’ అని అంటారు. ఇది తప్పుడు వ్యాఖ్యానం. ఉన్న రూపాలన్నీ భగవంతుడివే. నువ్వు ఎవరితో ఈ మాట అంటున్నావో వారు కూడా భగవంతుడే. ఏ రూపంలోనైనా రావచ్చని అనొద్దు. వచ్చిన రూపం భగవంతుడే. ఈ విషయాన్ని గుర్తించకపోవడం వల్లే ఇబ్బందులన్నీ వస్తున్నాయి.
అర్జునుడు భగవంతుని విశ్వరూపాన్ని దర్శించిన అనుభూతితో ఇలా అంటున్నాడు.
నమః పురస్తాదథ పుృష్ఠతస్తే
నమో స్తుతే సర్వత ఏవ సర్వ!
అనంత వీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతో సి సర్వః!!
అర్జునుడు మాట్లాడిన మాటల్లో సర్వ అనే శబ్దం వినిపిస్తుంది. అంటే అన్నీ భగవంతుడే. మనది అనుకుంటే తాపత్రయం ఎక్కువవుతుంది. మనది కాదు అని తెలిస్తే తాపత్రయం ఉండదు.
భగవంతుడా! ‘నువ్విచ్చిన పాత్రను సమర్ధంగా పోషిస్తున్నాను. సూత్రధారివి నువ్వు, పాత్రధారిని నేను’ అని అనుకోవాలి. ‘నువ్వెలా ఆడిస్తే అలా ఆడతాను’! అనుకోవాలి. అలాంటప్పుడు దుఃఖం వచ్చినా ఏడవకూడదు. ఇదొక ఆట. జీవితాన్ని నాటకంలో పాత్రలా అనుకోవడం లేదు. నాటకంలో ఒక పాత్ర వేసినపుడు నప్పిస్తే చాలు, ఒప్పిస్తే చాలు అనుకుంటారు. జీవితంలో అలా ఉండటం లేదు. ఈ నాటకంలో మనది అనుకున్న వారు ఎవరైనా నిలబడగలరా? ఎంతో మంది మన కళ్ల ముందు నుంచి వెళ్లిపోవడం చూస్తున్నాం వాళ్ల పాత్రలు అయిపోయాక! విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు. సీతాకల్యాణం తరువాత మళ్లీ కనిపించడు. కాబట్టి ‘అంతటా నిండి ఉన్న పరమాత్మా! నీకు నమస్కారం. నీకు ఎంతైనా శౌర్యం ఉంది. ఎంతైనా పరాక్రమం ఉంది’ ఈ విశ్వాన్ని భగవంతునిగా చూడటం మనం బాగా అలవాటు పడితే అహంకారం పూర్తిగా నిర్మూలన అవుతుంది. అప్పుడు ‘నేనెంత! నేనెంత!’ అనుకుంటారు. అలా అవ్వాలంటే కొంత సమయం కేటాయించాలి. డాబా మీద ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చోవాలి. నిత్యం కదులుతున్న మబ్బులను, గాలికి కదులుతున్న చెట్లను చూడండి. అప్పుడు మనమెంత అల్పులమో అర్థమవుతుంది.