శ్రీలక్ష్మీ సురేశ్… పసి వయసులోనే డిజిటల్ ప్రపంచంతో పరిచయమైన అమ్మాయి. తొమ్మిదేళ్ళ క్రితం పట్టుమని పదేళ్ళ వయసులోనే ఏకంగా తనకంటూ ఒక కంపెనీ (ఇ-డిజైన్ టెక్నాలజీస్) స్థాపించిన ఔత్సాహికురాలు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన సి.ఇ.ఓలలో ఒకరిగా రికార్డుల్లోకెక్కిన అమ్మాయి. ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మందికి పైగా క్లయింట్లకు ఆమె కంపెనీ సేవలు అందిస్తోంది. ఒక్కమాటలో ఇవాళ్టి డిజిటల్ ఇండియాకు ఆమే ముఖచిత్రం అనవచ్చు. కేరళలోని కోళిక్కోడ్ ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మీ సురేశ్ ఇంకా డిగ్రీ కూడా పూర్తి చేయని కాలేజీ విద్యార్థిని. స్థానిక సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో బి.బి.ఏ. ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి కథ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఉత్సాహం, ఉత్తేజం నింపే విషయమే. వెబ్ డిజైనింగ్ నాకు తరగని ఆసక్తిగా మొదలైంది.

‘‘నాలుగేళ్ళ వయసప్పుడు నేను కంప్యూటర్లు ఆపరేట్ చేయడం మొదలుపెట్టానట. నోట్ ప్యాడ్‌లో టైప్ చేయడం ద్వారా నేను అక్షరాలు నేర్చుకున్నానట. అప్పట్లోనే మైక్రోసాఫ్ట్ పెయింట్ అప్లికేషన్‌లో బొమ్మలు గీసేదాన్నని మా అమ్మా నాన్న (విజు సురేశ్, సురేశ్ మీనన్) ఇప్పటికీ చెబుతుంటారు. మొదటిసారిగా నాకు ఓ వెబ్ సైట్‌ను చూపించినప్పుడు దాన్ని కూడా ఓ కళాచిత్రం లానే చూసేదాన్ని. కాకపోతే, దాని మీద నుంచి నా దృష్టిని మరల్చేదాన్ని కాదు. క్రమంగా వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నా. అలా మొదలైంది నా ప్రయాణం. తీరా ఎనిమిదేళ్ళ వయసు వచ్చేసరికల్లా వెబ్ డిజైనింగ్‌లో నేను నిపుణురాలినైపోయానంటే నమ్మండి’’ అని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు.
నాలుగో తరగతి చదివే సమయంలోనే ఆమె తన స్కూల్ వెబ్ సైట్ డిజైన్ చేశారు. అదే ఆమె డిజైన్ చేసిన తొలి వెబ్ సైట్. ‘‘ఆ వయసులో మా స్కూల్ వెబ్ సైట్ డిజైన్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. అది నాకు దక్కిన పెద్ద గుర్తింపు కూడా! అప్పటి నుంచి మా టీచర్లు, నా స్నేహితులు ఈ రంగంలో ముందుకు వెళ్ళేలా నన్ను ప్రోత్సహించారు. పత్రికల్లో కూడా వార్తలు రావడంతో బోలెడన్ని వెబ్ సైట్లకు డిజైన్ చేయాలంటూ ఆఫర్లు వచ్చాయి’’ అని అప్పటి సంగతులు ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ తరువాత ఏడాది తిరిగేసరికల్లా 2008లో శ్రీలక్ష్మికి నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎఛీవ్‌మెంట్ వచ్చింది. ఢిల్లీలో సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకుంది. ‘‘జీవితంలో ఎప్పటికప్పుడు నేను మెరుగ్గా ముందుకు సాగడానికి మా అమ్మానాన్నలు నాకు స్ఫూర్తినిచ్చారు. వాళ్లెప్పుడూ నన్ను నిరుత్సాహపరచలేదు. అది నిజంగా నా అదృష్టం. పదేళ్ళ వయసులో నేను ఓ కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు మా అమ్మానాన్నకు చెప్పాను. వాళ్ళు వెంటనే ఓకే చెప్పేశారు.
నిజానికి, ఓ కంపెనీ నడపడంలోని కష్టనష్టాలేమిటో అప్పటికి నాకు ఏమీ తెలియదు. అయినా సరే ఓ ప్రయత్నం చేద్దామనుకున్నా…చేశా’’ అని నవ్వుతూ అంటారు శ్రీలక్ష్మి. అలా కంపెనీ మొదలుపెట్టిన ఈ చిన్నారి కొద్దికాలంలోనే తన సత్తా చాటారు. ‘‘స్కూల్లో చదువుకుంటూ ఉండడంతో, అప్పట్లో నాకు తగినంత తీరిక కూడా దొరికేది కాదు. స్కూల్లో క్లాసులన్నీ అయిపోయి, ఇంటికొచ్చాక అప్పుడు వెబ్ డిజైనింగ్ మీద కూర్చొనేదాన్ని. అప్పట్లో వరుసగా రకరకాల క్లబ్బులు, అసోసియేషన్లు, చిన్న చిన్న కంపెనీల నుంచి వెబ్ డిజైన్ చేయమంటూ నాకు అభ్యర్థనలు వచ్చేవి. అవన్నీ చేస్తూ వచ్చా. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రశంసలు నాలో మరింత ఉత్సాహం నింపాయి. దాంతో, వెబ్ డిజైనింగ్ రంగంలో పోనుపోనూ మరింత నేర్చుకున్నా.
క్రమంగా పైకి వచ్చా’’ అని ఆమె చెప్పారు. ‘‘ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్డర్ల నుంచి ముఖ్యమైనవి ఆచితూచి ఎంచుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా వెబ్ సైట్ డిజైనింగ్, సైట్ మెయిన్‌టెనెన్స్ మీదే! నా పాత క్లయింట్ల దగ్గర నుంచి కూడా బోలెడన్ని ప్రాజెక్టులు వస్తుంటాయి. ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్న స్టేట్ ఆఫ్ కేరళ డాట్ ఇన్ వెబ్ సైట్ అయితే, కేరళ రాష్ట్రం గురించి ఒక చిన్న విజ్ఞాన సర్వస్వం లాంటిదనుకోండి’’ అని శ్రీలక్ష్మి తెలిపారు. ఇప్పటికీ ఓ పక్క బి.బి.ఏ. క్లాసులకు వెళుతూనే, మరోపక్క ఈ డిజైనింగ్‌తో ఆమె బిజీగా గడుపుతున్నారు. పరీక్షల టైమ్‌లో మాత్రం వెబ్ సైట్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కష్టమవుతున్నా, ఒక పక్క చదువు, మరోపక్క పని… రెంటి మధ్య సమతూకం పాటిస్తున్నారు.
సగటున రోజుకు మూడు, నాలుగు గంటలు కంపెనీ పని మీద కూర్చుంటారు. చాలాకాలంగా శ్రీలక్ష్మి చేస్తున్న ఈ కృషికి బాగానే గుర్తింపు వచ్చింది. వెబ్ డిజైనింగ్‌లో చూపిన ప్రతిభకు గాను అమెరికన్ వెబ్ మాస్టర్స్ అసోసియేషన్ వారు ఇచ్చే అత్యున్నత గోల్డ్ వెబ్ అవార్డు ఆమెకు దక్కింది. ఆ అసోసియేషన్‌లో 18 ఏళ్ల కన్నా తక్కువ వయసులో సభ్యురాలైంది ఆమె ఒక్కరే. ‘‘ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరాలంటే పట్టుదల, కఠోరశ్రమ అవసరం. కృతనిశ్చయంతో, కలల సాకారానికి కృషి చేస్తే ఏదైనా సాధ్యమే. మీరు మనస్ఫూర్తిగా ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేస్తే చాలు… అదే నా జీవన మంత్ర’’ అని చెప్పుకొచ్చిందీ టీనేజర్.
వెబ్ డిజైనింగ్, వెబ్‌సైట్ మెయిన్‌టెనెన్స్ వ్యాపార రంగంలో ఇవాళ అందరూ చెప్పుకొనే స్థాయికి చేరిన శ్రీలక్ష్మి ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఆఫ్ కేరళ, వి.పి.కె. ఫుడ్ ప్రొడక్ట్స్ జెనెసిస్ మాంటిస్సోరీ, ఏంజెల్స్ ఇంటర్నేషనల్ లాంటి ప్రాజెక్టులకు పని చేస్తున్నారు. ఒక్క బార్ కౌన్సిల్ ఆఫ్ కేరళ వెబ్‌సైట్‌లోనే ఆ రాష్ట్రంలోని దాదాపు 40 వేల మంది ప్రాక్టీసింగ్ వకీళ్ళ వివరాలన్నీ నమోదై ఉంటాయి. దేశ విదేశాల్లోని పలు సంస్థల వెబ్ సైట్లను కూడా ఆమె నిర్వహిస్తున్నారు.
చిన్న వయసులోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారిన ఈ అమ్మాయికి ఇప్పుడు ఓ కంపెనీని ఎలా నడపాలో వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. కంపెనీ ఆర్థిక వివరాలు చెప్పడానికి సున్నితంగా నిరాకరించే ఈ టీనేజర్ చెప్సే మాట ఒకటే… ‘‘ఈ రంగంలో బోలెడంత పోటీ ఉంది. అందుకే, నేను వీలైనంత తక్కువ ఛార్జ్ చేస్తూ, పని చేస్తుంటా. అయితే, ఎంత మొత్తం తీసుకున్నామనే దానికన్నా అప్పగించిన పని పూర్తి చేయాలని చూస్తా’’నన్నారు. కంపెనీ నిర్వహణ కోసం ఇప్పటి దాకా ఆట్టే నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా శ్రీలక్ష్మికి రాలేదు.
అదే సమయంలో కంపెనీ ప్రచారం కోసం కూడా ఆమె ఒక్క పైసా ఖర్చుపెట్టలేదు. ‘‘నా పనితనం గురించి ఒకరి నుంచి మరొకరు ఆ నోటా ఈ నోటా విని ఆర్డర్లు ఇస్తుంటారు’’ అని నవ్వేసింది. చిన్న వయసులోనే ఇంత సాధించినా, ఆమె కొత్త కలలు కనడం మానలేదు. మైక్రోసాఫ్ట్ విండో్‌సకు భిన్నమైన మరో యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించాలన్నది శ్రీలక్ష్మికి ఉన్న అతి పెద్ద కల. ‘‘ఏదో ఒక రోజుకు ఆ కల నిజం చేసుకుంటా’’ అని ఆమె గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెబుతారు. ఎంచుకున్న ఏ రంగంలోనైనా పురోగమించడానికి కావాల్సింది ఆ నమ్మకమేనని శ్రీలక్ష్మి మాటలు, చేతలు కూడా నిరూపిస్తున్నాయి.