Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వచ్చే నాలుగైదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు ఒక కోటికిపైగా ఉద్యోగాలను సృష్టించనున్నాయని నోమురా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. మధ్యతరగతి వర్గాలు పెరగడం, ఖర్చు చేయదగ్గ ఆదాయాల్లో వృద్ధి వెరశి భారత్‌ను వినియోగానికి ఆకర్షణీయ మార్కెట్‌గా నిలబెట్టనున్నాయి. అయితే వినియోగం అవుతున్న ఉత్పత్తుల్లో దిగుమతుల వాటా గణనీయంగా ఉండడంతో దేశీయంగా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాల సృష్టి పరిమితం అవుతోందని నివేదిక తెలిపింది. మరోవైపు పలు క్లస్టర్లలో ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ కంపెనీల్లో తయారీకి బూస్ట్‌నిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించింది. కాగా, దేశవ్యాప్తంగా వర్క్‌ ఫోర్స్‌ 48 కోట్లుంది. 2025 నాటికి వీరికి అదనంగా 4.5 కోట్ల మంది జతకూడనున్నారు. మొత్తం పనివారిలో తయారీ రంగంలో 12.5 శాతం మంది ఉంటారు.

సింహభాగం ఎంఎస్‌ఎంఈదే..
ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం.. తయారీ రంగంలో 3.6 కోట్ల ఉద్యోగాలతో ఎంఎస్‌ఎంఈ కంపెనీలు 70 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వినియోగదార్ల అభిరుచులు, సాంకేతిక మార్పుల ప్రభావం తయారీ రంగంపై ప్రస్ఫుటంగా కనపడుతోంది. కొత్త ఉద్యోగాల కల్పనలో సూక్ష్మ, చిన్న కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని ఎన్‌ఆర్‌ఐ కన్సల్టింగ్‌ పార్ట్‌నర్‌ ఆశిమ్‌ శర్మ వ్యాఖ్యానించారు. మార్కెట్‌ ఆధారిత వ్యూహాలు అనుసరించి ఈ రంగ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ కంపెనీలు తయారు చేసిన వస్తువులు వాడుతున్న కస్టమర్లలో ప్రభావితం చేయగల కంపెనీలుగానీ వ్యక్తులుగానీ ఈ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉండాలని నివేదిక అభిప్రాయపడింది. తద్వారా ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిపింది.