Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

 

73 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. మధుర జ్ఞాపకాలను మననం చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం… భారత అథ్లెటిక్స్‌ రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ప్రపంచ స్థాయిలో మన దేశం పేరు మార్మోగేలా చేస్తుంది. హిమదాస్‌… ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 400 మీ. పరుగులో స్వర్ణం నెగ్గడంతో పాటు ఆసియా క్రీడల్లో మూడు పతకాలు   సాధించడానికి కారణం ఈ బామ్మే! ఆమే భారత 400మీ, 4×400 మీ. రిలే జట్టు కోచ్‌ గలీనా పెట్రోవా బుకారిన. గతేడాది భారత అథ్లెటిక్స్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె కొద్దికాలంలోనే అద్భుత ఫలితాలు రాబడుతోంది.

హిమదాస్‌.. ప్రస్తుత భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ రంగంలో మార్మోగుతున్న పేరు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో   స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. భవిష్యత్తు మీద భారీ ఆశలు రేకెత్తిస్తున్న యువ సంచలనం. అయితే ఆరు నెలల క్రితం వరకు కూడా హిమదాస్‌ పేరు ఎవరికీ పెద్దగా తెలీదనేది నిజం. ఆమె ప్రపంచ అథ్లెటిక్స్‌లో సాధించిన విజయం మాత్రం హఠాత్తుగా వచ్చింది కాదు. దాని వెనక హిమదాస్‌ ప్రయత్నం ఎంతుందో.. బుకారిన కృషి కూడా అంతే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోచ్‌గా పనిచేయడం కోసమే మొదటిసారి భారత్‌ వచ్చిన ఆమె… ఇక్కడి పరిస్థితులను, క్రీడాకారిణుల సామర్థ్యాలను, అందుబాటులో ఉన్న వసతులను త్వరగానే గ్రహించింది. శిక్షణా విధానంపై ఓ అంచనాకు వచ్చింది. తన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తూ మంచి ఫలితాలు వచ్చేలా చూస్తోంది.

ఒలింపిక్‌ పతకం… యుఎస్‌లో జీవితం: భారత అథ్లెటిక్స్‌ రంగాన్ని విజయాల వైపు నడిపిస్తున్న బుకారిన జీవితంలో ఎన్నో ఆసక్తికర మలుపులున్నాయి. సోవియట్‌ యూనియన్‌ తరపున 1968 ఒలింపిక్స్‌ 4×100మీ. రిలేలో కాంస్యం నెగ్గిన జట్టులో సభ్యురాలైన ఆమె ఎన్నో అంతర్జాతీయ టోర్నీలకు ప్రాతినిధ్యం వహించింది. పరుగుకు వీడ్కోలు పలికిన తరువాత తన కూతురు క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడింది. కుటుంబాన్ని పోషించడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని చెబుతున్న ఆమె కూతురు చికిత్స కోసం నానా రకాల పనులు చేసింది. ‘‘అథ్లెటిక్స్‌కు సంబంధించిన ఉద్యోగం అంత త్వరగా దొరకలేదు. డబ్బులు కోసం చాలా రకాల పనులు చేశా. పెద్దవాళ్లకు సాయం చేయడంతో పాటు ఇళ్లు శుభ్రపరచడం వరకూ అన్ని పనులు చేశా. మూడేళ్ల పాటు నిర్దిష్టమైన ఉద్యోగం అంటూ ఏదీ లేదు. అయినా నా కూతురికి చికిత్స అందించడంతో పాటు… ఇంటిని నెట్టుకురావడానికి ఎంతో కష్టపడ్డా’’ అని చెబుతుందామె. కొన్ని రోజులకు టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో అథ్లెటిక్స్‌ కోచ్‌గా చేరిన ఆమె ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతకు ముందు సోవియట్‌ యూనియన్‌ జాతీయ స్థాయుల్లో వివిధ విభాగాల్లో 17 ఏళ్ల పాటు కోచ్‌గా పనిచేసింది. ఆమె శిక్షణలో సోవియట్‌ యూనియన్‌ మహిళల 4×400మీ. రిలే జట్టు 3:15.15ని. టైమింగ్‌తో 1988 ఒలింపిక్స్‌లో నెలకొల్పిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. అయితే సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమయ్యాక తన సొంత దేశానికి ఆమె వెళ్లలేకపోయింది.
అంతర్జాలంలో తెలుసుకుని: టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బుకారిన 2011లో ఆ పదవికి వీడ్కోలు పలికింది. ఆ తరువాత తన మనవళ్లతో సమయం గడపడానికి బామ్మ అవతారం ఎత్తి పూర్తి సమయం కుటుంబానికి కేటాయించింది. అయితే తిరిగి ట్రాక్‌లో అడుగుపెట్టాలనే తపనే ఆమెను భారత్‌కు రప్పించేలా చేసింది. ‘‘ఇలా భారత్‌కు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ట్రాక్‌లో సమయం గడిపే అవకాశం లేకపోవడంతో చాలా బాధపడ్డా. దాంతో తిరిగి ట్రాక్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా. భారత  జట్టుకు కోచ్‌గా పనిచేయడం చాలా ఆసక్తిగా ఉంటుంది. నా స్థాయి కూడా ఇదే. మా అమ్మాయి పిల్లలతో సరదాగా గడపగలను కానీ అది నాకు సంతృప్తిని ఇవ్వదు. తిరిగి రష్యాకు వెళ్లి కోచ్‌గా పనిచేస్తారా అన్ని నన్ను అని చాలామంది అడుగుతున్నారు. కానీ నేను వెళ్లానుకోవట్లేదు’’ అని చెబుతుంది బుకారిన.   భారత్‌కు వచ్చే ముందు మన దేశం గురించి అంతర్జాలంలో శోధించి కొన్ని విషయలు తెలుసుకున్నానంటుంది ఆమె. ఈ  వయసులో కూడా ఆమె తన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తన శిక్షణలో భారత అథ్లెట్స్‌ మరిన్ని పతకాలు సాధించేలా  చేసి… అంతిమంగా ఒలింపిక్స్‌లో పతకం అందించడమే తన లక్ష్యమంటోంది బుకారిన.