Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్దికి తోడ్పాటునందించాలి. ఆరోగ్య సమాజ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆగస్టు 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. నులిపురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలను వాడుతారు.

అపరిశుభ్రతతో నులి పురుగులు

అపరిశుభ్రతతో నులిపురుగులు పిల్లలకు సంక్రమిస్తాయి. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. చేతి గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి. అలా చేయకపోవడం వల్ల వాటిలో మట్టిచేరి అనారోగ్యానికి కారణమవుతారు. అలాగే పరిశుభ్రమైన నీరు తాగాలి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. ఆహార పదార్థాలపై ఎప్పుడు మూతలు కప్పి ఉంచాలి.

నులి పురుగులతో అనర్థాలు

నులి పురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారిలో నులిపురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నులిపురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ది చెందే పరాన్న జీవులు. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపరిచే ప్రయోజనాలను పుష్కలంగా కలుగజేస్తుంది.

రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రే 

పిల్లల్లో సాధారణంగా మూడు రకాల నులిపురుగులు కనబడే అవకాశం ముంది. ఏలిక పాములు, నులిపురుగులు, కొంకిపు రుగులు ఉంటాయి. వీటిని నిర్మూలించేందుకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 400 ఎంజీలో సగం 200 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మిగతావారు 400 ఎంజీ మాత్రను వేసుకుని బాగా నమలాలి. భోజనం తర్వాత వేసుకోవచ్చు. కడుపులో నులి పురుగులు ఉన్నట్లయితే.. మాత్రలు వేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. దీర్గకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు వేసుకోకూడదు. నులి పురుగులు ఉన్నవారు మత్రమే మాత్రలు వేసుకుంటే.. వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

పిల్లల చేతి వేళ్ల గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. చిన్నవిగా ఉంచుకోవాలి. వాటిలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్లపుడూ పరిశుభ్రమైన నీటినే త్రాగాలి. తినే ఆహారం కలుషితం కాకుండా ఎల్లపుడూ కప్పి ఉంచాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న పధార్థాలే తీసుకోవాలి. ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో క డిగిన తర్వాతే వండాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనను మానేసి మరుగుదొడ్ల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంటి చుట్టు పక్కల పరిసరాలను అన్ని వేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మాత్రల కోసం ఎవరిని సంప్రదించాలి

పిల్లలకు నులిపురుగుల నివారణా మాత్రలు (ఆల్బెండజోల్‌) వేయించడానికై తల్లిదండ్రులు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం లేదా పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని సంప్రదించాలి. అస్పత్రుల్లో ఎప్పుడు వెళ్లినా ఈ మాత్రలను వేస్తారు.