Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘మా స్వస్థలం నిజామాబాద్‌. నేను పుట్టింది మాత్రం కర్ణాటకలో! పెరిగింది… ఫలానా చోట అని చెప్పలేను. దేశమంతటా అనొచ్చు. అదేంటి! అని ఆశ్చర్యపోకండి… నాన్న పి.వి. దుర్గాప్రసాద్‌ సాయుధ బలగాల్లో పనిచేసేవారు. అందుకే ఏడు వేర్వేరు సిటీల్లో పెరిగాను. పదకొండు స్కూల్స్‌లో చదివాను. దాదాపుగా మన దేశంలోని అన్ని రాష్ర్టాలు చుట్టొచ్చా. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో హైదరాబాద్‌ వచ్చేశా. అప్పట్నించీ ఇక్కడే ఉంటున్నా, కాకపోతే మధ్యలో ఒక ఏడాది ముంబయిలో, కొన్ని నెలలు నైరోబీలో ఉన్నాను.
 
ఆ భావనతోనే…
చిన్నప్పుడు నాక్కూడా నాన్నలా ఇండియన్‌ ఆర్మీలో చేరాలనిపించేది. కానీ… నా ఆలోచనను మార్చేసే విషయం ఒకటి నా జీవితంలో జరిగింది. నాకు పదిహేను సంవత్సరాలప్పుడు ప్రాణాంతకమైన ‘సెరిబ్రల్‌ మలేరియా’ బారిన పడ్డాను. దానివల్ల నెలల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అలా దాదాపు ఏడాది పాటు ఇంటికి, బెడ్‌కే పరిమితం. అప్పుడు నాకనిపించింది జీవితం అనేది ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదని! అదీకాక నలుగురికీ ఉపయోగపడే పని ఏదీ చేయకుండానే జీవితం ముగించాల్సి వస్తుందనే భావన ఎంత దారుణంగా ఉంటుందో అర్థమైంది. అప్పట్నించీ నా లక్ష్యం ఒక్కటే – నేను భూమ్మీద ఉన్నంతవరకు నా దగ్గరున్న సమయాన్ని సద్వినియోగం చేయాలంతే!
 
వాస్తవ జీవితాలకి దూరంగా…
స్కూల్లో చదువుకునేటప్పుడు స్పోర్ట్స్‌లో, పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. మా అమ్మ అరుంధతీ ప్రసాద్‌తో కలిసి ‘ఆర్మీ వైవ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’కు పనిచేశాను కూడా! ఇంటర్మీడియెట్‌ చదివేటప్పుడు ఎన్‌సిసిలో చేరాను. అప్పుడు రిపబ్లిక్‌డే పెరేడ్‌లో రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం, బ్రిటన్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌’లో పాల్గొనే అవకాశం వచ్చాయి. కాలేజిలో ఉండగా మన చదువులు వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉన్నాయనిపించేది. అందుకని ఒక పక్క ఇంజనీరింగ్‌ చేస్తూనే, మరో వైపు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయిన ‘కోర్సెరా, ఉడాసిటీ’ల్లో నూతన నైపుణ్యాలు నేర్చుకునేదాన్ని. వాటిని రియల్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌కు అమలుచేసేదాన్ని. గత ఏడాది కోర్సెరా ద్వారా ‘జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ’ నుంచి డేటా సైన్స్‌లో ‘ఎగ్జిక్యూటివ్‌ స్పెషలైజేషన్‌’ పూర్తి చేశాను. అక్కడ నేర్చుకున్నదాన్ని వాస్తవ జీవితానికి అమలుచేశాను. డేటా ప్లాట్‌ఫామ్‌ ద్వారా బెంగళూరులో ఏయే ప్రాంతాల్లో డయాబెటిస్‌, గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందనే సమాచారాన్ని సేకరించా.
అవి వెంటాడుతున్న టైంబాంబులు!
ఆ స్కిల్స్‌నే ఈ ఏడాది ‘లకీర్‌’ సంస్థ ద్వారా అమలు చేయబోతున్నా. ‘లకీర్‌’ గురించి చెప్పనేలేదు కదూ… ఈ సంస్థకు నేను సహవ్యవస్థాపకురాలిని. పట్టణాల్లో జనావాసాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. మన దేశం ప్రస్తుతం భారీగా నగరీకరణ సంక్షోభ దిశగా అడుగులు వేస్తోంది. ప్రతీ గంటకు 1800 మంది భారతీయులు పట్టణాలకు వస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో వస్తున్న ప్రజా ప్రవాహాన్ని తట్టుకునేందుకు సిద్ధంగా మన పట్టణాలు లేవు.
నిజానికి పట్టణాలనేవి దేశానికి ఆర్థిక శక్తి కర్మాగారాలు. కానీ… అవే నేడు వెంటాడుతున్న టైంబాంబుల్లా తయారవుతున్నాయి. గత ఏడాది ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ బ్రిడ్జి ప్రమాదంలో 22 మంది మరణించడం, ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం వల్ల అత్యవసర స్థితి ప్రకటించడం, బెంగళూరులో తాగునీటి ఎద్దడి వంటివి… రానున్న అతిపెద్ద సమస్యలకు ముందు కనిపించే లక్షణాలు మాత్రమే! ఈ సమస్యల పరిష్కారంలో ప్రజల్ని చురుకుగా ఉంచేందుకు ‘లకీర్‌’ ఒక సాధనంగా పనిచేస్తుంది.
నైబర్‌హుడ్‌ గ్రూపుల ద్వారా…
పొరుగు వారిలో పరివర్తన తేవడం ద్వారా పూర్తి పట్టణంలో పరివర్తన తేవచ్చు. దానికోసమే ‘నైబర్‌హుడ్‌ గ్రూప్స్‌’ను ఏర్పాటుచేశాం. వీటిని సమన్వయం చేసేందుకు అంకితభావంతో పనిచేసే ‘సిటిజన్‌ ఛాంపియన్స్‌’ ఉంటారు. వీళ్లు తమ పొరుగు వారి భాగస్వామ్యంతో, ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తారు. మాస్‌ కమ్యూనికేషన్‌ టూల్‌ అయిన వాట్సాప్‌ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలను ఒక దగ్గర చేరుస్తున్నాం. ఈ మోడల్‌ను దేశంలోని ఇతర పట్టణాల్లో కూడా అమలు చేయనున్నాం.
పాశ్యాత్య దేశాల మీద ఆధారపడకుండా…
నేను ఇంటెల్లిక్యా్‌పలో పనిచేసిన ఏడు సంవత్సరాల ఉద్యోగ ప్రయాణంలో నేర్చుకున్నది ఎంతో ఉంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాల్లో ‘వరల్డ్‌ బ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ది రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌, బోష్‌, యునిలివర్‌, గిజ్‌, షెల్‌ ఫౌండేషన్‌, ప్రదాన్‌ల’తో కలిసి పనిచేశా. పలు కార్యక్రమాలను ప్రారంభించడం, నాయకత్వం వహించడం వంటి అవకాశాలు కలిగాయక్కడ. అలా చేసిందే ‘స్టార్ట్‌పవేవ్‌’. ఇది మన దేశంలో మొట్టమొదటి ఇంక్యుబేషన్‌ ప్లాట్‌ఫామ్‌. దీనికి ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’, ‘హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌’ల గుర్తింపు లభించింది.
దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లో పనిచేశానని చెప్పాను కదా … అక్కడ కూడా మన దేశంలో ఎదుర్కొంటున్న పేదరికం, అభివృద్ధికి పరిమిత వనరులు ఉండడం వంటి అంశాలున్నాయి. వీటినుంచి బయటపడాలంటే నూతన నమూనాలతో బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్భవించాలి. ఒకేరకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలు సామాజిక ఆవిష్కరణలను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేయాలి. అలా చేస్తే కనుక పాశ్చాత్య దేశాలు రూపొందించిన నమూనాలను డూప్లికేట్‌ చేసి వాడాల్సిన అవసరం ఉండదనిపించింది.’’
ఆడవాళ్లే సక్సెస్‌ఫుల్‌
ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో ఎంట్రప్రెన్యూర్‌లుగా మగవాళ్ల కంటే ఆడవాళ్లే విజయం సాధిస్తారని వెల్లడైంది. 2013లో జెఎమ్‌జె కన్సల్టింగ్‌ నివేదిక ప్రకారం 25 శాతం మంది మహిళలు ఏంజిల్‌ ఫండింగ్‌ అందుకోగా, మగవాళ్లు మాత్రం 21 శాతమే ఉన్నారు.
ఆ తప్పులు చేయకూడదు!
మన దేశంలో జనావాసానికి అనుకూలంగా ఉన్న మెట్రో నగరాల్లో ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నది గ్రేటర్‌ హైదరాబాద్‌ ఒక్కటే. అయితే ఆర్థిక పెరుగుదల వేగంగా జరుగుతుండడంతో జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతున్నారు. దాంతో దేశంలోని మిగతా మెట్రోలలాగా హైదరాబాద్‌ కూడా తయారయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండేందుకు హైదరాబాద్‌ ముందు అద్భుతమైన అవకాశం ఉంది. మిగతా మెట్రో నగరాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. ఆయా మెట్రో సిటీలు చేసిన తప్పులను మనం చేయకూడదు.
ఉత్సాహంగా ఉన్నా!
దావోస్‌లో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ సమావేశంలో ‘లకీర్‌’ సంస్థ తరపున హాజరు కావడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. యువత గొంతును వినేందుకు గ్లోబల్‌ లీడర్స్‌ ఆసక్తి కనపర్చడం చాలా గొప్ప అంశం. ఈ సదస్సులో పౌరుల చర్యలు, సివిక్‌ టెక్‌ ద్వారా పట్టణాలను జనావాసాలుగా మార్చడం అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. సదస్సుకు హాజరయ్యే దేశ, విదేశీ ప్రతినిధులు మేం చేస్తున్న పనికి మద్దతు పలికి, భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నా.