Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక భూమిక పోషించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని ఇటీవల బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు. దేవెగౌడతో భేటీకి ఆయన్ను కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఆయన పాత్ర ఏంటన్న చర్చలు సాగుతున్నాయి.

ఫ్రంట్‌పై ఇప్పటికే స్టాలిన్‌తో చర్చలు 
కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన ప్రకాశ్‌రాజ్‌ సినిమా నటుడిగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రజలకు సుపరిచితుడు. మొదటి నుంచి సెక్యులరిజం భావజాలం పట్ల ఆసక్తి చూపిస్తున్న ఆయన.. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యపై అక్కడి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమించారు. బీజేపీని బాహటంగానే విమర్శించారు. ఇటీవల బడ్జెట్‌ సమావేశాల సమయంలో ప్రకాశ్‌రాజ్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గంటపాటు మాట్లాడారు. ఫ్రంట్‌ వెంట ఉంటానని, తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఆ సందర్భంగా మాటిచ్చినట్లు తెలిసింది.

ఇటీవల జరిగిన దేవెగౌడ, కేసీఆర్‌ భేటీలో ప్రకాశ్‌రాజ్‌ సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆయన సన్నిహితులు చెబున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీకి ప్రకాశ్‌రాజ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తమిళ ప్రేక్షకులకు చిరపరిచితుడు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తనయుడు స్టాలిన్‌తోనూ ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో కరుణానిధి–కేసీఆర్‌ భేటీ ఏర్పాట్లలో ప్రకాశ్‌రాజ్‌ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉద్దేశాలను స్టాలిన్‌కు వివరించి ఆయన్ను ఒప్పించినట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగితే వచ్చే వచ్చేనెలలో కేసీఆర్, కరుణ భేటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కేసీఆర్‌ విధానాల పట్ల ఆకర్షితుడైన ప్రకాశ్‌రాజు ఫెడరల్‌ ఫ్రంట్‌కు శక్తి వంచన లేకుండా సహకారం అందించాలన్న నిర్ణయానికి వచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 10 సినిమాల్లో నటిస్తున్నారు. నానా పటేకర్‌ నటించిన ‘నట సామ్రాట్‌’అనే మరాఠీ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసే హక్కులు కొనుక్కున్నారు. కేసీఆర్‌ కోరితే ఒప్పుకున్న ఈ చిత్రాలను త్వరగా పూర్తి చేసుకొని, నటసామ్రాట్‌ చిత్ర రీమేక్‌ను వాయిదా వేసుకునేందకు ప్రకాశ్‌రాజ్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ లోపు కేసీఆర్‌తో కలిసి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జాతీయ రాజకీయలపై ఆసక్తి చూపుతున్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మంగళూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్‌ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరితే ఇక్కడ్నుంచి అందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.