Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘‘నా పేరు సొనాల్‌. చిన్నప్పుడు మా చెల్లికి కొన్ని శారీరక సమస్యలుండేవి. ఆమె ఆలనాపాలనా చూసేందుకు అమ్మ ఇబ్బందులు పడేది. చెల్లిని చదివించడానికీ అవస్థలు పడ్డాం. ఆ బాధలన్నీ నాకు తెలుసు. అప్పటికే నేను సేవా రంగంలోకి వెళదామనుకున్నాను. అందుకు నాన్న వీకే సారస్వత స్ఫూర్తి. ఆయన హైదరాబాద్‌లోని డిఆర్‌డివోకు డైరెక్టర్‌ జనరల్‌గా చేశారు. రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగానూ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ప్రస్తుతం ‘నీతి ఆయోగ్‌’ సభ్యులు కూడా! అప్పట్లోనే ఆయనకు పద్మశ్రీ వచ్చింది. నాన్న పేరు ప్రతిష్ఠలు దేశమంతా తెలుసు. నాన్నలోని జాతీయభావన నాలో ఆలోచనల్ని రేకెత్తించింది. మా కుటుంబం సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తుంది. నేను ఎంఏ సైకాలజీ చదివాను. సింబయాసి స్‌లో ఎంబీఏ కూడా పూర్తిచేశా. చదువు పూర్తయ్యాక.. నా చెల్లి పడే బాధ మరొకరు పడకూడదని.. ఆటిజం పిల్లల కోసం ఏదైనా చేయాలన్న నిర్ణయానికి వచ్చాను.
 

భూదేవంత ఓర్పు అవసరం 

ఆటిజం పిల్లలు హైపర్‌యాక్టివ్‌గా ఉంటారు. మనం పిలిచినా పలకరు. ఆ పిల్లల పట్ల తల్లులకు భూదేవంత ఓర్పు అవసరం. లేకపోతే సేవ చేయలేరు. వీటన్నిటినీ అర్థం చేసుకుని.. ఆటిజం పిల్లల కోసం స్కూలు ప్రారంభించాం. మా కుటుంబ సభ్యుడైన పంచముఖితో కలిసి ‘స్పర్శ్‌ ఫౌండేషన్‌’ను 2005లో మొదలుపెట్టాం. హైదరాబాద్‌లోని ఒక చిన్న ఇంట్లో .. కేవలం ముగ్గురే ముగ్గురు పిల్లలతో ప్రయాణం ప్రారంభమైంది. అయినా నిరుత్సాహపడలేదు. ముందుగా ఆటిజంతో బాధపడే పిల్లల తల్లులను గుర్తించాం. ఇటువంటి పిల్లలను ఎలా హ్యాండిల్‌ చేయాలో వాళ్లకు బాగా తెలుసు. ఆ తల్లులకు శిక్షణ ఇచ్చాం. మా సంస్థ అంకితభావం తల్లులకు అర్థమైంది. వారి సహాయం తీసుకున్నాం. ఫిజియోథెరపిస్టులు, సైకాలజిస్టుల్నీ ఏర్పాటు చేసుకున్నాం. మెల్లమెల్లగా ఆటిజం పిల్లల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం స్పర్శ్‌ ఫౌండేషన్‌ పరిధిలో ఎనిమిది బ్రాంచిల్లో కలిపి ఐదొందల మంది విద్యార్థులు ఉన్నారు. భవిష్యత్తులో ఢిల్లీ, ఫరీదాబాద్‌, గుజరాత్‌లలోను స్కూల్‌ బ్రాంచ్‌లను విస్తరించనున్నాం. హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తున్నాం.
 

ఈ పిల్లల పట్ల దయ లేదా? 

ఆటిజం పిల్లల ఒక కొత్త బ్రాంచ్‌ ప్రారంభించాలంటే- ముందుగా ఎదురయ్యే సమస్య వసతి సదుపాయం. భాగ్యనగరం ఇంత పెద్దది కదా! ఎక్కడా ఇల్లు సులువుగా దొరకడం లేదు. ఆటిజం పిల్లల కోసం స్కూలు పెడుతున్నామంటే.. అద్దెకు ఇవ్వడానికి యజమానులు ఒప్పుకోవడం లేదు. ఒక బ్రాంచ్‌లో పిల్లల గోల ఎక్కువైందంటూ.. ఇరుగుపొరుగు వాళ్లు పోలీసు కేసు కూడా పెట్టారు. మేము ఆటిజం పిల్లలతో విద్యావ్యాపారం చేయడం లేదు. సంఘంలో వీళ్లకూ బతికే హక్కు ఉంది. అందరు పిల్లల్లాగే చదువుకుని, ఆశలు తీర్చుకుని.. ఆడుతూపాడుతూ జీవించే స్వేచ్ఛ ఉంది. అలాంటి పిల్లలను దయగా చూడాల్సిన బాధ్యత సంఘానికి లేదా! ఈ విషయంలో కొన్నేళ్లు పోరాటమే చేశాం. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. మా శ్రమను, అంకితభావాన్ని అర్థం చేసుకున్న కొందరు ఉదారవాదులు ముందుకు వస్తున్నారు.
 

తెలియగానే కుంగిపోవద్దు!

‘మీ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు’ అని చెప్పగానే భూమి బద్దలైనట్లు కుంగిపోతారు తల్లితండ్రులు. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆటిజం అనేది ఒక జబ్బు కాదు. పుట్టుకతో వచ్చే జన్యు సమస్య. బుద్ధిమాంద్యం లాంటిదే ఇది! ప్రేమతో, ఓర్పుతో పిల్లల్లో మానసిక ఎదుగుదలకు చేయూతనివ్వాలి. అందుకు ఆటిజం స్కూల్స్‌ ఒక్కటే మార్గం. చదువు, థెరపీలతో చక్కబడతారు. పూర్తిగా మార్చలేము కానీ.. ఎంతోకొంత మార్పు అయితే వస్తుంది. మా దగ్గరున్న చాలామంది పిల్లలు కంప్యూటర్‌ ఉపయోగిస్తున్నారు. బాగా చదవగలుగుతున్నారు. కొంత చురుకుదనమూ వచ్చింది. తల్లితండ్రులు ఏమీ చేయకుండా.. మార్పు కోరుకుంటే రాదు. ఆటిజం పిల్లలను ఎలా చూసుకోవాలో.. తల్లికి శిక్షణ ఇవ్వడం మా ప్రత్యేకత. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి.
 

ఇప్పుడిప్పుడే చైతన్యం 

ఆటిజం పిల్లల బాగోగుల కోసం మానవీయ స్పందన అసవరం. సంఘంలో ఆశించినంత అవగాహన ఉండటం లేదు. ఈ విషయంలో ప్రసారమాధ్యమాలు కొంత చైతన్యం కలిగిస్తున్నాయి. కనీసం పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఆటిజం పిల్లలకు సీట్లు ఇవ్వడం లేదు. తల్లితండ్రులు తమ పిల్లల్ని తీసుకుని.. స్కూలుకు వెళ్లగానే ‘‘వేరే స్కూలుకు తీసుకెళ్లండి. మా స్కూల్‌లో వద్దు’’ అని మొహం మీదే అనేస్తున్నారు. ఇది అన్యాయం. కేవలం వాణిజ్య కోణంలోనే అడ్మిషన్లు ఉండకూడదు కదా! ఆటిజం పిల్లలు సాధారణ పిల్లల్లో కలిసి చదువుకున్నప్పుడే.. త్వరగా ఆ సమస్య నుంచి బయటపడతారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆటిజం పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వ చొరవ తప్పనిసరి. ఈ నెలలోనే ‘వరల్డ్‌ ఆటిజం అవేర్‌నెస్‌ డే’ను జరుపుకున్నాం. ఆ సందర్భంగా మేము పధ్నాలుగు భాషల్లో ఆటిజం అవగాహన పోస్టర్లను ముద్రించాం. వీటిని పద్నాలుగు రాష్ర్టాలకు పంపించి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఆటిజం అంటే ఏమిటి? వాటి లక్షణాలు? ఎలా ఎదుర్కోవాలి? వంటి విషయాలన్నీ పోస్టర్లలో పేర్కొన్నాం. తల్లితండ్రుల నుంచి మంచి స్పందన వచ్చింది. మా ప్రయాణం ఇంతటితో ఆగదు. దేశవ్యాప్తంగా మరిన్ని ‘స్పర్శ్‌’ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి.. ఆటిజం పిల్లలకు అండగా నిలవాలన్నదే మా లక్ష్యం. ఎందుకంటే.. ఇది మా హృదయ ‘స్పర్శ’!