Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చిన్నప్పుడు అందరు పిల్లల్లో సహజంగా కలిగినట్టే… హైదరాబాద్‌కి చెందిన గౌతమ్‌లోనూ సేవా భావం మొగ్గతొడిగింది. అయితే, అతనితో పాటే ఆ భావన పెరిగి పెద్దదైంది. ఎంతలా అంటే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి.. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇన్‌వాల్వ్‌ చేసేంతలా! గౌతమ్‌ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగి. ఊహించిన దానికంటే ఎక్కువ వేతనం బ్యాంకు అకౌంట్లో వచ్చి పడుతోంది. అవసరానికి మించిన ఆదాయం ఉంటే అనవసరమైన ఖర్చులు చేయడం ఎలాగో ఈతరానికి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కానీ, గౌతమ్‌.. పదిమందికి అవసరమైన పనికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్ల కిందట ‘సర్వ్‌ నీడీ’ (అవసరంతో ఉన్నవారికి సేవ చేయండి) పేరుతో సేవా సంస్థను ప్రారంభించాడు.
ఒంటరిగా మొదలు.. ఉమ్మడిగా ముందుకు..
గౌతమ్‌ తండ్రి ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. తండ్రితో ఆయా ప్రాంతాలు చూశాడు గౌతమ్‌. ప్రాంతాలు మారినా.. భాషలు మారినా.. సంప్రదాయాలు మారినా.. ఆ కుర్రాడికి ఒక విషయంలో మాత్రం మార్పు ఎక్కడా కనిపించలేదు. అదే పేదరికం. హైదరాబాద్‌ ఫుట్‌పాతలపై అచేతనంగా పడి ఉన్న అభాగ్యులను ఎందరినో చూశాడు. ఉత్తరాది నగరాల్లోనూ ఇదే సీన్‌ కనిపించిందతనికి. ‘వీరికి సాయం చేసేవాళ్లు ఎవరు లేరా..?’ గౌతమ్‌ను ఎప్పుడూ తొలుస్తూ వచ్చిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఎన్నో ఎన్జీవోల్లో వాలంటీర్‌గా పని చేశాడు. తనకు చేతనైన సాయం చేశాడు. జీవితంలో స్థిరపడిన తర్వాత ఒక రోజు.. ‘సర్వ్‌ నీడీ’ గురించి తన ఆలోచననూ, లక్ష్యాన్నీ… తల్లితండ్రులు, సోదరి, స్నేహితులతో పంచుకున్నాడు. అందరూ భేష్‌ అన్నారు. అండగా ఉంటామన్నారు.
వెంటనే ఆలోచనను అమల్లో పెట్టమని ప్రోత్సహించారు. అనాథలకు, అభాగ్యులకు సాయం చేసే సంస్థ ఇది. రోగగ్రస్థులకు వైద్య సాయం, అన్నార్థులకు అన్నదానం, విద్యార్థులకు విద్యాదానం.. ఇలా రకరకాల కార్యక్రమాలు రూపొందించాడు. సంస్థ తరఫున ఒక అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తూ పాతిక మంది చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు. ‘సర్వ్‌ నీడీ’ చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాతో పంచుకుంటాడు గౌతమ్‌. వాటిని చూసి స్ఫూర్తి పొందిన ఎందరో యంగిస్థాన్‌లు ఆయనతో చేతులు కలిపారు. కాలేజీ స్టూడెంట్స్‌, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా ముప్ఫయ్‌ మంది వరకు గౌతమ్‌ టీమ్‌లో చేరారు. వీరంతా ఉమ్మడిగా ‘సర్వ్‌ నీడీ’ని నడిపిస్తున్నారు.
రకరకాలుగా సహకారం
సేవ చేయడమే ప్రధాన లక్ష్యం అనుకున్నప్పుడు.. అందుకు సరైన మార్గాలు ఎంచుకోవాలి. గౌతమ్‌ టీమ్‌ ప్రత్యేక థీమ్‌లు ఎంచుకుని.. విభిన్న వర్గాలకు చెందిన అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తోంది. ‘డైలీ అన్నదాత’ అలాంటిదే. వివాహాది శుభకార్యాల్లో వ్యర్థమయ్యే భోజనం అంతా ఇంతా కాదు. ఆ ఆహార పదార్థాలు చెత్త కుప్పల పాలు కాకుండా.. అనాథల ఆకలి తీర్చేలా రూపొందించన ప్రణాళికే ‘డైలీ అన్నదాత’. ఫంక్షన్లలో పదార్థాలు మిగిలిపోయాయన్న సమాచారం అందితే చాలు ‘సర్వ్‌ నీడీ’ ప్రతినిధులు అక్కడికి చేరుకుంటారు. ఆహార పదార్థాలను శుభ్రంగా సేకరిస్తారు. వాటిని ఏదైనా అనాథాశ్రమానికి చేరవేస్తారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న మరో బృహత్తర కార్యక్రమం ‘మెడికల్‌ మొబైల్‌ సర్వీస్‌’. స్లమ్‌ ఏరియాల్లో మెడికల్‌ క్యాంప్‌లు, హెల్త్‌ చెక్‌పలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం ఈ విభాగం ప్రత్యేకత. గర్భిణులను ఆస్పత్రులకు చేర్చడం, వైద్యం అందజేయడం చేస్తుంటారు. మనుషులకే కాదు గాయాలపాలైన మూగజీవాలను కూడా ఆదుకుంటూ ఉంటారు.
స్ఫూర్తినిచ్చే స్పృహ
ఎవరూ లేని అనాథ శవాలకు దహన సంస్కారాలు ‘లాస్ట్‌ రైట్స్‌’ విభాగం నిర్వహిస్తుంటుంది. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ప్రభుత్వాస్పత్రుల నుంచి సమాచారం అందగానే ‘లాస్ట్‌ రైడ్స్‌’ బృందం అక్కడికి చేరుకుంటుంది. అనాథ మృతదేహానికి సకల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అక్కడితో వదిలేయకుండా.. ఆ అనాథ అస్థికలు నదిలో నిమజ్జనం చేసి వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. ‘‘సర్వ్‌ నీడీ’ అనేది పేరుకు తగ్గట్టుగా అవసరార్థులకు అండగా ఉండే సంస్థ. ఎందరో పెద్దల అనుభవం, యువకుల ఉత్సాహంతో మా సంస్థ నడుస్తోంది. వీరందరి సహకారంతో 14 ప్రాజెక్టులతో… 24 గంటలూ సేవలందిస్తున్నాం. ఎంతో తృప్తినిస్తోంద’ని చెప్పుకొచ్చాడు గౌతమ్‌. ఈ యువకుడి సామాజిక స్పృహ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం.
జీవితానికి భరోసా..
‘సర్వ్‌ నీడీ’ చేపట్టిన ప్రాజెక్టుల్లో ‘సేవ్‌ ఎ లైఫ్‌’ ఎందరికో వరదానమైంది. నా అన్నవాళ్లు లేని అనాథలు, హైదరాబాద్‌ నగరంలో ఫుట్‌పాతలపై మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వాళ్లను చేరదీయడమే ఈ ప్రాజెక్ట్‌ పని. వీరికి మెరుగైన వైద్యం అందేలా చూడటం, బాగోగులు చూసుకోవడం అన్నీ సంస్థ ప్రతినిధులే చూసుకుంటారు.
సెలబ్రిటీల బాసట
సోషల్‌ మీడియా సహకారంతో.. ‘సర్వ్‌ నీడీ’ చేస్తోన్న సేవా కార్యక్రమాలు ఎందరికో చేరుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం వీరితో జట్టు కడుతున్నారు. హీరో శ్రీకాంత, భానుచందర్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డి, సంగీత దర్శకుడు అనూప్‌ రుబెన్స్‌ ఇలా ఎందరో గౌతమ్‌ సేనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.