Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వ్యాధి మళ్లీ హైదరాబాద్ ను గడగడలాడిస్తోంది. గడచిన రెండు రోజుల్లోనే 30 మందికి ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపగా, ఇద్దరికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. వీరిలో ఓ రోగి సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో, మరొకరు నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారి నుంచి ఇక్కడికి చేరిన ఈ వైరస్, మన వాతావరణంలోనే తిష్ఠ వేసుకుని కూర్చుందని వైద్యులు చెబుతున్నారు.

గతంలో ఇతర రాష్ట్ర వ్యక్తుల నుంచి వ్యాధి సోకుతుండగా, తాజాగా మన రాష్ట్రంలోని వ్యక్తుల మధ్యే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. కొంతమంది వైద్యులు ఈ వ్యాధిని సాధారణ టైఫాయిడ్, మలేరియా వ్యాధుల్లాగే పరిగణిస్తున్న నేపథ్యంలోనే సమస్య తీవ్రత పెరుగుతోందని వైద్యాధికారులు భావిస్తున్నారు.

స్వైన్ ఫ్లూను శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమివేసేందుకు అటు ప్రజలకు వ్యాధి వ్యాప్తిపై అవగాహన పెంచడంతో పాటు చికిత్సలపై వైద్యులకూ అవగాహన కల్పించాల్సి ఉందని భావిస్తున్న వైద్యశాఖ అధికారులు… ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు.