Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు పోలీసులను అడ్డుకొని హాస్టల్ ఆవరణలోకి తరలించారు. దీంతో వర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. గుంటూరుకు చెందిన వేముల రోహిత్ (27) సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఎన్‌ఆర్‌ఎస్‌ఐ వింగ్ హాస్టల్లో 207 నంబర్ రూమ్‌లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఫ్యాన్‌కు కండువాతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయంత్రం స్నేహితులు ఎంతగా పిలిచినా తలుపు తీయకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా, రోహిత్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని బయటకు వెళ్లనీయబోమంటూ విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారు. ఆదివారం రాత్రి వరకు కూడా మృతదేహం హాస్టల్ ఆవరణలో ఉంది. పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు.

 బహిష్కరణ వెనుక…
గత ఆగస్టులో సుశీల్ కుమార్ అనే విద్యార్థి తన ఫేస్‌బుక్ ఖాతాలో అంబేడ్కర్ స్టూడెం ట్స్ అసోసియేషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దానిపై అతనిని నిలదీయగా క్షమాపణ చెప్పారు. అనంతరం తనపై ఐదుగురు విద్యార్థులు దాడి చేశారంటూ సుశీల్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిసెంబర్ 18న పీెహ చ్‌డీ విద్యార్థులు రోహిత్‌తోపాటు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్నలను వర్సిటీ వీసీ సస్పెండ్ చేశారు. దీంతో వారంతా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ 14 రోజులుగా వర్సిటీలో ధర్నా చేస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో రోహిత్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారని తోటి విద్యార్థులు చెప్పారు. వీసీ పట్టించుకోవడం లేదని, రేపు ఎలా ఉంటుందో అని రోహిత్ ఆదివారం ఉదయం స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

 ఐదు పేజీల సూసైడ్ నోట్    
ఆత్మహత్యకు పాల్పడే ముందు రోహిత్ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాశారు. శరీరం, హృదయానికి ఘర్షణ జరుగుతుందని ఆనోట్‌లో పేర్కొన్నారు. మనిషిని మనిషిగా చూడటం లేదు, పుట్టుక తీరునే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలియడంతో వందలాది మంది విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీసీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంఎల్‌సీ రాంచందర్‌రావులపై ఎస్‌సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో సోమవారం బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహించి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని భద్రం డిమాండ్ చేశారు. వీసీని సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ, ఓయూ జాక్ చైర్మన్ మానవతా రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.