Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

Imag

సాగు కోసం ఐఎస్‌ఐ మార్క్‌ సోలార్‌ విద్యుత్‌ పంప్‌ సెట్లను ఏర్పాటు చేయాలంటే రైతులు రూ. 50,000 రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. ఆ మొత్తాన్ని వ్యవసాయదారుడు భరిస్తే.. రూ. 5 లక్షల విలువజేసే సోలార్‌ పంప్‌ సెట్‌ను ఏపీ ఇంధన శాఖ ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో బుధవారం జరిగిన సలహా సంఘం సమావేశానికి అజయ్‌ జైన్‌ హాజరయ్యారు. వ్యవసాయానికి సోలార్‌ పంప్‌ సెట్లను బిగించడంతో పాటు.. వాటిని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం సాగుకు రాత్రి సమయంలోనే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నందున చాలా బాధగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పగటి పూట సాగుకు విద్యుత్తు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. థర్మల్‌ విద్యుత్‌ నిరంతరం పని చేస్తుందని, రాత్రి సమయంలో ఉత్పత్తిని ఆపేయడం సాధ్యం కాదన్నారు. విద్యుత్తు చార్జీల సవరణ విషయంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని అజయ్‌ జైన్‌ వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయానికి విద్యుత్‌ కోసం డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న వ్యాఖ్యలను తాము నమ్మడం లేదన్నారు. సోలార్‌ పంపుసెట్ల కోసం ఇప్పటికే 8,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. సాగు కోసం వినియోగించే పంప్‌ సెట్లన్నింటిని ఐఎస్‌ఐ పంప్‌ సెట్లుగా మారుస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే .. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదని, డిస్కమ్‌లే 24 గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్లను మారుస్తాయని వివరించారు. రాష్ట్రంలోని 9,600 విద్యుత్‌ ఫీడర్లను ఆన్‌లైన్‌ చేస్తామని, వచ్చే నెల నుంచి ఏ ఫీడర్లలో ఎంత సరఫరా జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లోనే విద్యుత్‌ అనుమతులను సింగిల్‌ డెస్క్‌ విధానంలో ఇస్తామన్నారు.