Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తిరుగులేని వాగ్ధాటితో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన మోడీ, ఎర్రకోట నుంచి చేసే ప్రసంగం, జాతికి కొత్త జవసత్వాలను నింపేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పొచ్చు. ఎర్రకోట నుంచి మోడీ చేసే ప్రసంగంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, గతేడాది ఎర్రకోట నుంచి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగంపై గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోడీ విమర్శలు గుప్పించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ చేసిన తొలి ప్రసంగ పాఠాన్నే తాజాగా మన్మోహన్ సింగ్ మళ్లీ చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. “నెహ్రూ, తన తొలి ప్రసంగంలో ప్రస్తావించిన సమస్యలు, వెలిబుచ్చిన ఆందోళనలనే మీరూ వెలిబుచ్చారు. అంటే 60 ఏళ్లలో మనమంతా ఏం చేయలేదా?” అంటూ మోడీ నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో మోడీ ఎర్రకోట ప్రసంగంపై తాజాగా ఆసక్తి నెలకొంది.

ప్రధాని ప్రసంగానికి సంబంధించి ఆయా శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల సమాచారాన్ని ఈ నెలాఖరులోగా కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథీ కార్యాలయానికి చేరవేయాలని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్రంలోని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రసంగంలో ఏఏ అంశాలను పొందుపరచాలనే విషయంపై కెబినెట్ సెక్రటేరియట్ ఆగస్టు 10లోగా నిర్ణయం తీసుకుంటుంది. ఎర్రకోట ప్రసంగం ద్వారా బ్రాండ్ ఇండియా నినాదాన్ని మోడీ వినిపించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంగ్ల అక్షరం ’టీ’ తో ప్రారంభమయ్యే ఐదు అంశాలు… సంస్కృతి(ట్రెడిషన్), మేధస్సు(టాలెంట్), పర్యాటకం(టూరిజం), వాణిజ్యం(ట్రేడ్), సాంకేతికం (టెక్నాలజీ) ల సమాహారమే బ్రాండ్ ఇండియా నినాద లక్ష్యంగా బీజేపీ వర్గాలు ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే.