Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్’ మంత్రం బాగానే పనిచేసింది. పదవి చేపట్టిన మూడు నెలల్లోగానే మోడీని మరింత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. రెండున్నరేళ్లుగా భారీ పతన దశలో కూనారిల్లుతున్న దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని భారీగా పెంచేసింది. గడచిన తొమ్మిది త్రైమాసికాల జీడీపీ రేటును తాజా త్రైమాసిక ఫలితాలు తిరగరాసేలా చేసింది. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో జీడీపీ 5.7గా నమోదైనట్లు వెల్లడించాయి. అంటే అంతకుముందు క్వార్టర్ జీడీపీ 4.6 కంటే భారీ వృద్ధి నమోదైనట్లే లెక్క. అంతేకాక గడచిన తొమ్మిది క్వార్టర్లు, అంటే రెండున్నరేళ్ల తర్వాత జీడీపీలో భారీ పెరుగుదల నమోదైంది.

మోడీ గద్దెనెక్కిన తర్వాత దేశంలో ఉత్పత్తి రంగంతో పాటు మైనింగ్ రంగం కూడా వృద్ధి బాటన పరుగులు పెట్టిందని గణాంకాలు వెల్లడించాయి. 15 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన ఉత్పత్తి రంగం జీడీపీ పెరుగుదలలో కీలక భూమిక పోషించింది. జూన్ తో ముగిసిన క్వార్టర్ లోనే ఏకంగా 3.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదిలా ఉంటే, మైనింగ్ రంగం, మోడీ పాలన పగ్గాలు చేపట్టడంతో ఉరకలెత్తిందనే చెప్పాలి. 0.4 శాతం వార్షిక పెరుగుదలతో మెల్లగా సాగుతున్న ఈ రంగం, జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా 2.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ రెండు రంగాల్లో నమోదైన వృద్ధి, జీడీపీ భారీ పెరుగుదలకు దోహదం చేసిందని పారిశ్రామిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి మూడు నెల్లలోనే మోడీ మంత్రం ‘అచ్చే దిన్’ ఈ మాత్రం ఫలితాను సాధిస్తే, రానున్న కాలంలో దేశాభివృద్ధిని ఉరుకులు, పరుగులు పెట్టించనుందనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.