Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దాదాపు రెండు నెలల పాటు సెలవుల్లో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నాడు తొలిసారి సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గోదుమల పైన మద్దతు ధర రూ.10 మాత్రమే పెంచారన్నారు. రైతులు ఆనందంగా ఉంటేనే దేశానికి శ్రేయస్కరం అని చెప్పారు. యూపీఏ హయాంలో వ్యవసాయం వృద్ధి రేటు 4.2 శాతంగా ఉందని, అదే సమయంలో దేశం వెలిగిపోతోందంటూ ప్రచారం చేసుకున్న గత ఎన్డీయే హయాంలో 2.6 శాతంగా మాత్రమే ఉందన్నారు. మార్కెట్లో కుప్పలుతెప్పలుగా పడిపోయి ఉన్న ధాన్యం రాశులను ప్రధాని ఎందుకు పరిశీలించరని ప్రశ్నించారు. ఇది పేదల ప్రభుత్వం కాదని, కార్పోరేట్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ఇది సూటూ, బూట్ల ప్రభుత్వమని, సామాన్యులది కాదన్నారు. రాహుల్ మాట్లాడే సమయంలో అధికార పార్టీ సభ్యులు పదేపదే నినాదాలు చేస్తుండటంతో… నిజం నిష్ఠూరంగా ఉంటుందని, కాస్త వినాలన్నారు. మీ ప్రధాని కాదు.. దేశ ప్రధాని.. రాహుల్ తన ప్రసంగం సమయంలో మీ ప్రధాని మీ ప్రధాని అంటూ వ్యాఖ్యానించారు. దీనిని బీజేపీ నేతలు తప్పుపట్టారు. దీంతో, మీ ప్రధాని కాదు దేశ ప్రధాని అంటూ సవరించుకున్నారు.