Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘నీ స్నేహితులెవరో చెప్పు! నువ్వు ఎలాంటివాడివో చెబుతాను!’ అని ఇంగ్లీషు వాళ్ళ సామెత. దాని సంగతి అలా ఉంచితే, ‘మీరు పనిచేసే డెస్క్ ఎలా ఉంచుకున్నారో చూపించండి. మీరు ఎలాంటివాళ్ళో చెబుతాం’ అని తాజాగా శామ్ గోస్లింగ్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ అంటున్నారు. కూర్చొని పని చేసుకొనే డెస్క్‌ను మనం ఎలా ఉంచుకుంటున్నామన్న దాన్ని బట్టి, మనమానసిక స్థితి అర్థమవుతుందట! అలా అర్థం చేసుకున్న విషయాన్ని బట్టి, మనలో కొత్త స్ఫూర్తిని నింపవచ్చని ఈ అమెరికన్ మనస్తత్వవేత్త అంటున్నారు. ‘స్నూప్ – వాట్ యువర్ స్టఫ్ సేస్ ఎబౌట్ యు’ అనే పుస్తకం రాసిన ఈ నిపుణుడు కొన్ని కీలకమైన పాయింట్లు చెప్పారు. ఆయన పేర్కొన్న కింది నాలుగు విభాగాలూ చదివి, మీరు ఎలాంటివారో, ఏమిటో మీరే ఒకసారి చూసుకోండి!

 1  డెస్క్ గనక పద్ధతిగా సర్దివుంటే…
అందంగా, పొందిగ్గా సర్దిన డెస్క్. దాని మీద ఒక చిన్న తేదీల క్యాలెండర్. గబుక్కున ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్ మీద నుంచి కళ్ళు పక్కకు జరిపి, ఆ క్యాలెండర్ చూసుకొనే అవకాశం. తేదీలు చూస్తూ, కీలకమైన తేదీలు, ఆ రోజులలో చేయాల్సిన పనులు రాసుకొనే వీలు. ఎదురుగా ఉన్న పిన్ బోర్డ్ మీద పిన్ చేసి పెట్టుకున్న ‘చేయాల్సిన పనుల’ జాబితా. వాటిలో పూర్తయిపోయిన పనులకు టిక్కు పెట్టుకోవడం. హాజరైన ప్రతి మీటింగ్ తాలూకు సమాచారంతో కూడిన ఫైలున్న సొరుగు. ఏ క్షణమైనా అవసరమైతే ఉంటుందని ఒక అదనపు పెన్ను, కావాల్సిన కాగితాలు. ఫుల్‌ఛార్జ్‌లో ఫోన్… ఆ పక్కనే పవర్ బ్యాకప్.

...అందరూ ఆధారపడదగ్గ రకం!
ఇంత సక్రమంగా డెస్క్ సర్దుకొన్నవాళ్ళంటే, అత్యంత ఆధారపడదగిన వ్యక్తి అన్న మాటే! అంత నమ్మకస్థుడు మరొకరు ఉండరన్న మాటే! ఏదైనా సమస్య వస్తే, ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని సంప్రతిస్తారు. ఇలాంటి వ్యక్తులు బోలెడంత బాధ్యతతో వ్యవహరిస్తారు. ఏ పని ఇచ్చినా అద్భుతంగా నెరవేరుస్తారు. బేసిక్‌గా చెప్పాలంటే, ఏదైనా సరే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, హడావిడీ హంగామా చేయకుండా పూర్తి చేసేసే టైప్ అన్న మాట!

2.విలక్షణమైన వస్తువులుంటే…
పని చేసే డెస్క్ దగ్గర, ఎదురుగా పిన్ బోర్డ్‌కు ఆసక్తికరమైన బొమ్మ ఏదైనా పిన్ చేసి ఉంచుకోవడం కొందరికి అలవాటు. కొన్నిసార్లు ఆ బొమ్మ వాళ్ళు వేసినదే కావచ్చు. కామిక్స్ నుంచి ఆసక్తికరమైన బొమ్మలు కత్తిరించి, అందంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే, సొరుగులో ‘రూబిక్స్ క్యూబ్స్’ లాంటి మెదడుకు మేత పెట్టే ఆటవస్తువులు పెట్టుకుంటూ ఉంటారు. డెస్క్‌టాప్ కూడా పాత పద్ధతిలో ఉంటుంది.

… సృజనాత్మకత పొంగిపొర్లే రకం!

డెస్క్ దగ్గర వాతావరణాన్ని ఇలా కళాఖండాలతో, బొమ్మలతో అలంకరించుకున్నారంటే – సృజనాత్మకత పొంగిపొర్లుతున్న వ్యక్తి అనుకోవచ్చు. కొత్త కొత్త ఆలోచనలకూ, అనుభవాలకూ సిద్ధంగా ఉండే తరహా వ్యక్తి అన్న మాట. ఇలాంటివాళ్ళు ఎక్కువ శాతం బహిర్ముఖులై ఉంటారు. ఆ డెస్క్ పక్క నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం అక్కడ ఆగి, ఆ క్రియేటివిటీని చూసి ముచ్చట పడతారంటే అతిశయోక్తి కాదు. స్వతంత్ర భావాలనూ, సృజనాత్మకతనూ ప్రోత్సహించే వాతావరణంలో ఇలాంటి వ్యక్తులు బాగా రాణిస్తారు.

 3. స్ఫూర్తినిచ్చే మెసేజ్‌లు ఉంటే…
కొందరు తాము పని చేసే డెస్క్ దగ్గర ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా… ఓటమి!’ లాంటి స్ఫూర్తిదాయకమైన మెసేజ్ పోస్టర్లు పెడుతూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు రాగానే, సానుకూల అంశానికి సంబంధించిన ఏదో ఒక కొత్త మెసేజ్‌ను ప్రింట్ అవుట్ తీసుకొని, దాన్ని పిన్ బోర్డుకు గుచ్చుతూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరినీ భావావేశపరంగా కలసికట్టుగా ఉంచడం కోసం ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఉపయోగిస్తుంటారని అమెరికన్ సైకాలజిస్టుల మాట.
… కంగారు పడినా, సక్సెస్‌ఫుల్ రకం!
ఇలా మెసేజ్‌లు పెట్టేవాళ్ళది ఒక గమ్మత్తై వ్యక్తిత్వమట! వాళ్ళు ‘టైప్ ఎ పర్సనాలిటీ’ మనుషులని సైకాలజిస్ట్‌లు భావిస్తున్నారు. పరిస్థితులు అంతా సవ్యంగా ఉంటాయో, లేదోనని వీరు ఎక్కువగా వర్రీ అవుతుంటారట! మరీ ఎక్కువగా వర్రీ అవద్దని వీళ్ళను అనునయించడం అవసరం. అలాగని, ఆ స్ఫూర్తిదాయక సందేశాల్ని డెస్క్ దగ్గర నుంచి తీసేయమని చెప్పాల్సిన పని ఏమీ లేదు. నిజానికి, ఇలాంటి వ్యక్తులు పనిలో చాలా సక్సెస్‌ఫుల్ వ్యక్తులు. ఎదైనా సరే, కాస్తంత ఎక్కువగానే ఆలోచించి, లోతుగా చూస్తూ ఉంటారు కాబట్టి, పని పూర్తి చేయడంలో ఢోకా ఏమీ లేదు.

4. సొరుగు దగ్గర ఈ వస్తువులుంటే…
కొంతమంది డెస్క్ పక్కనే చాక్లెట్లు, మింట్‌లతో కూడిన గాజు గిన్నె పెట్టుకుంటారు. అలాగే, సొరుగుల్లో కూడా అట్టిపెట్టుకుంటారు. మరికొంత మంది సిగరెట్లు, అదనంగా మరో లైటర్, కోకా-కోలా, రెడ్ బుల్ టిన్నులు కూడా ఉంచుకుంటారు. ఎందుకైనా మంచిదని ఒక సాక్స్‌ల జత కూడా పెట్టుకుంటారు. ఈ రకం వ్యక్తుల సొరుగులు చూస్తే – అందులో అత్యుత్తమ పాటల సీడీ మొదలు బోలెడన్ని వస్తువులు కనిపిస్తాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి సౌకర్యవంతమైన కుర్చీల లాంటివి వీళ్ళు ఆర్డర్లూ చేస్తుంటారు.

…ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారాలు చూపే రకం!
డెస్క్ అంతా అందంగా, పొందికగా సర్దుకొనే వ్యక్తి లాంటివాళ్ళ మనస్తత్వం లాంటిదే వీళ్ళది కూడా! అందరినీ ఆకట్టుకొనేలా మాట్లాడతారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారాలు చూపడంలో వీళ్ళు దిట్టలు. ఇమేజ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ వీళ్ళకు ఆకర్షితులవుతారు. సమస్య వస్తే – చటుక్కున దానికో పరిష్కారం చూపుతారు.