Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

307662-3x2-340x227
నీళ్లలో నిప్పులు పడటం అంటే ఇదేనేమో! పాకిస్థానీ ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్నట్టు చెబుతున్న బోటు గుజరాతీ తీరం సమీపంలో పేలిపోయిన అంశంపై నేవీ అధికారులు పూటకో మాట మారుస్తూ, ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెస్తున్నారు. తొలుత.. ‘మేమే పేల్చివేశాం. పేల్చేయక ఉగ్రవాదులను కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తామా?’ అని వ్యాఖ్యానించిన తీర గస్తీదళం డీఐజీ బీకే లోషాలీ అంతలోనే మాట మార్చారు. ‘ఏమో ఎలా జరిగిందో! నాకేమీ తెలియదు’ అంటూ నాలుక తిరగేశారు. ఆయన ప్రకటన ప్రభుత్వ వైఖరిని ఖండించేవిధంగా ఉండటం, తాను చేయలేదని ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఓ జాతీయ దినపత్రిక వీడియో రూపంలో విడుదల చేయడంతో.. ఇప్పుడీ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. నిజంగానే ఉగ్రవాదుల బోటును పేల్చివేస్తే ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గెందుకు అని కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది. ఒక చెయ్యి ఏమి చేస్తున్నదో మరో చేతికి తెలియని చందంగా.. ఎన్టీయే ప్రభుత్వం పనితీరు ఉన్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. ప్రభుత్వం మాత్రం ‘బోటును గస్తీ దళం చుట్టుముట్టింది. దాడికి సిద్ధమవుతుండగానే, బోటులో ఉన్నవాళ్లు తమను తాము పేల్చేసుకున్నారు’ అన్న తన పూర్వ ప్రకటనకే కట్టుబడి ఉంది. లోషాలీపై వేటుకు సిద్ధమవుతోంది. మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నేవీ విభాగం..లోషాలీకి నోటీసు ఇచ్చింది.
దేశమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిఉన్నతరుణంలో.. గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరానికి 365 కిలోమీటర్ల దూరంలో ఒక బోటు తగలబడిపోయింది. ఆ బోటులో పాక్‌ ఉగ్రవాదులు ఉన్నారని, పట్టుకోవడానికి ప్రయత్నించేలోగానే బోటుకు నిప్పు పెట్టి ఆత్మాహుతి చేసుకున్నారని అప్పట్లో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పార్రీకర్‌ ప్రకటించారు. నిజానికి, ఆ తరువాత అందరూ ఈ అంశాన్ని మరిచిపోయారు. మంగళవారం సూరత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తీర గస్తీదళం డీఐజీ, వాయవ్య తీర ప్రాంత విభాగం చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ లోషాలీ, తిరిగి ఆ ఘటనను తెరపైకి తెచ్చారు. ‘‘ఊరికే ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఈరోజు నా మనసులో మాటని చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు రాత్రి (డిసెంబర్‌ 31, 2014) ఏమి జరిగిందో మీకు తెలుసు. అయితే, నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఉంది. మేం ఆ రాత్రి ఆ పాకిస్థానీ వాళ్లను (ఉగ్రవాదులు) పేల్చివేశాం. అప్పుడు నేను గాంధీనగర్‌లో ఉన్నాను. విషయం తెలిసిన వెంటనే ‘బోటును పేల్చివేయండి’ అని ఆదేశించాను. వాళ్లకు (ఉగ్రవాదులు) బిర్యానీలు మోయడం మాకు ఇష్టం లేదు మరి!’’ అని లోషాలీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో దుమారం రేగింది. దీంతో బుధవారం ఆయన మాట మార్చారు. ‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు’ అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాను. ‘‘నేను నిర్దిష్టంగా ఏ ఘటనపైనా స్పందించలేదు. అసాంఘిక శక్తుల పట్ల ఉండే సాధారణ వైఖరిని వ్యక్తం చేశాను. దేశ ద్రోహులు సముద్ర తీర భద్రతని ఛేదించుకొని చొచ్చుకురావడాన్ని ఎంతమాత్రం అనుమతించరాదని చెప్పాను. వారికి బిర్యానీలు మోయడం మన అభిమతం కారాదని పేర్కొన్నాను. అంతేగానీ, ఆ రోజు ఏమి జరిగిందనేది నాకు తెలియదు. అలాంటివి రెండో కంటికి తెలియకుండా జరుగుతాయి కాబట్టి, నాకు తెలిసే అవకాశం కూడా లేదు’’ అని వివరణ ఇచ్చారు. ఏమైనా ఉంటే తన పై అధికారి, వాయవ్య సముద్ర తీర ప్రాంత ఐజీ కుల్దీప్‌ సింగ్‌ షెరోన్‌కు తెలిసి ఉంటుందని చెప్పారు.
పేల్చేస్తే చెప్పడానికి సిగ్గెందుకు? : కాంగ్రెస్‌
మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి వచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే ప్రతిపక్షాలు అందిపుచ్చుకున్నాయి. వాస్తవాలు ఏమిటనేది రక్షణ మంత్రి పార్రీకర్‌ జాతికి వివరణ ఇవ్వాలని ఏఐసీసీ నేత మనీశ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. ‘‘ పార్రీకర్‌జీ! మీ దృష్టిలో అంత ఘోరమైన పాపం ఏమిటి? బోటును పేల్చివేయడమా? జాతికి అబద్ధాలు చెప్పడమా?’’ అని మనీశ్‌ తివారీ నిలదీశారు. గుజరాత్‌లోని బూటకపు ఎన్‌కౌంటర్ల సంస్కృతికీ.. ఈ ఉదంతానికీ దగ్గర పోలికలు ఉన్నాయని ట్విట్‌ చేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో మోదీ సర్కారు, దేశ భద్రతను బలహీనపరుస్తున్నదని ‘ఆప్‌’ ప్రతినిధి అశుతోష్‌ విమర్శించారు. ప్రభుత్వానికి గల ప్రజాసంబంధాల వ్యవస్థ పనితీరుకు ఇది అద్దం పడుతున్నదని అదే పార్టీకి మరో నేత దీపక్‌ బాజపాయ్‌ దుయ్యబట్టారు.
మాది అదే వైఖరి : పార్రీకర్‌
లోషాలీ తీరుపై రక్షణ శాఖ రగిలిపోతున్నది. ఈ అంశంపై మాట్లాడటానికి ఏమీ లేదని తేల్చిచెప్పింది. ‘ఇప్పటికే మా శాఖ ప్రకటన చేసింది. దానికే కట్టుబడి ఉన్నాం’ అని రక్షణ మంత్రి పార్రీకర్‌ తెలిపారు. లేని వివాదం సృష్టించిన లోషాలీపై చర్య తప్పదని పరోక్షంగా స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ఎవరైనా ఒకరు రేపు ఒక ప్రకటన చేస్తారు. అది వాస్తవాలకు దూరంగా ఉందనుకుందాం. అప్పుడు మీరు వచ్చి సదరు వ్యక్తిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారా అని అడగొచ్చు. అలాగే, ఒక వ్యక్తి చేసిన ప్రకటనను, అది అతడు చేసిందేనని మీరు నిరూపించారని అనుకుందాం. అప్పుడూ మీరు వచ్చి చర్యల గురించి ప్రశ్నించొచ్చు. దానికీ దీనికీ ఏమీ తేడాఉండదు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. లోషాలీ వ్యాఖ్యలను ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక రికార్డు చేసిందని చెప్పగా.. ఆ వీడియో కాపీని చూసిన తరువాత ఏమి చేయాలనేది నిర్ణయిస్తామని బదులిచ్చారు. ఇదిలాఉండగా, భారత్‌ తీరే అంత అని పాకిస్థాన్‌ ప్రభుత్వం విమర్శించింది. ఒక వైపు శాంతిని కోరుతూనే మరోవైపు క్రూరత్వాన్ని ప్రదర్శించే భారత వైఖరి మరోసారి రుజువు అయిందని ఆ దేశ రక్షణ మంత్రి క్వాజా అసీఫ్‌ దుయ్యబట్టారు.