Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థుల బిగ్ డిబేట్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధించింది. ఆమెకు 62శాతం మద్దతు లభించగా.. డోనాల్డ్ ట్రంప్ కు 27శాతం మద్దతుమాత్రమే దక్కింది. నవంబర్ లో జరగనున్న ఎన్నికలకు ముందు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ చర్చ జరుగుతుండగా సీఎఎన్ఎన్-ఓఆర్సీ సంస్థ ఈ పోల్ నిర్వహించింది. ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని దాదాపు 100 మిలియన్ల మంది వీక్షించారని సర్వే పేర్కొంది. ఈ సమయంలోనే సీఎన్ఎన్-ఓఆర్సీ టీవీ వీక్షకుల నుంచి అభిప్రాయంకోరగా 62శాతం మంది క్లింటన్ కు మద్దతివ్వగా 27శాతం మంది ట్రంప్ కు మద్దతిచ్చారు.

అంతకుముందు ఇవే నిర్వహించిన సర్వేలో హిల్లరీ, ట్రంప్ ల మధ్య కొద్ది వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ నెల 19న వెల్లడైన సర్వేలో కూడా డోనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతు వచ్చారు. అప్పుడు లైక్లీ ఓటర్లలో హిల్లరీకి 42 శాతం, ట్రంప్‌కు 40 శాంత మంది మద్దతు ఉన్నట్లు మార్నింగ్ కన్సల్ట్ పోల్ ద్వారా తెలిసింది. రిజిస్టర్డ్ ఓటర్లలో 39శాతం మంది హిల్లరీకి, 38శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లు పొలిటికో సంస్థ తెలిపింది. న్యుమోనియాతో బాధపడుతూ ఒక బహిరంగ సభలోనే కుప్పకూలక ముందు హిల్లరీ ట్రంప్‌ల మధ్య 41-39 తేడా ఉండేది. వాస్తవానికి, ట్రంప్‌కు సొంత పార్టీలోనే మద్దతు అంతగా లేదు. పార్టీ తరుఫున అతడు సరైన అభ్యర్థి కాదని 43 శాతం మంది రిపబ్లికన్లు చెప్పారు. మరోవైపు డెమొక్రాట్లలో 41 శాతం మంది కూడా క్లింటన్ విషయంలో అలాంటి అభిప్రాయమే వెల్లడించారు. హిల్లరీ కచ్చితంగా గెలుస్తారని 47 శాతం మంది భావించగా, ట్రంప్ విజయం మీద 33 శాతం మందికే నమ్మకం ఉంది.

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి 90 నిమిషాలపాటు ఈ బిగ్ డిబేట్ కార్యక్రమం కొనసాగగా ముందునుంచే హిల్లరీ చాలా స్పష్టమైన సమాధానాలు చెప్పడంతోపాటు, ట్రంప్ వ్యాఖ్యలపై తెలివిగా దాడులు చేస్తూ వచ్చారు. హిల్లరీ మాత్రం ప్రణాళికను వివరించగా ట్రంప్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హిల్లరీ చెప్పగా.. గతంలో కంపెనీలకు ఉన్న 35శాతం పన్నును 15శాతానికి తగ్గిస్తామని ట్రంప్ అన్నారు. అయితే, పన్ను మినహాయింపు వల్ల ధనవంతులే బాగుపడతారని హిల్లరీ చెప్పారు. కార్పొరేట్ లొసుగులు తొలిగిస్తామని చెప్పారు.

నిర్మాణ రంగం, టెక్నాలజీ ఇతర రంగాల్లో ఉద్యోగ వృద్ధి చేస్తామని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ డిబేట్ గెలవడమే లక్ష్యంగా హిల్లరీ ప్రిపేర్ అయి వచ్చిందని, ఆమె గెలుస్తుంది కూడా అని చెప్పగా.. తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నందున తన దేశ ప్రజలకు ఏమేం చేయగలననే అంశాలనే చెప్తున్నానని, ఆ మాత్రం బాధ్యతగా ప్రిపేర్ అవ్వకుంటే ఎలా అంటూ స్మార్ట్ గా సమాధానం ఇచ్చారు. ఇలా మాట్లాడుతూ ఆమె అనూహ్యంగా పెద్ద మొత్తంలో ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. మున్ముందు జరగబోయే డిబేట్లలో కూడా ప్రస్తుతం ఉన్న మద్దతు హిల్లరీకీ మరింత పెరుగుతుందేమో చూడాలి.