Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో పంచాయతీలు సంఘ వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని అమలు చేయని కుటుంబాలను సాంఘికంగా బహిష్కరించడం సర్వసాధారణం. కానీ అందుకు విరుద్ధంగా భాగ్‌పట్ జిల్లాలోని సిసాన గ్రామ పంచాయతీ మొట్టమొదటి సారిగా బుధవారం సంఘహిత ఉత్తర్వులు జారీచేసి రాష్ట్రంలోనే ఓ కొత్త స్ఫూర్తికి బాటలు వేసింది.

గురువారం (ఫిబ్రవరి 4వ తేదీన) పెళ్లికి అంతా సిద్ధమయ్యాక మంగళవారం అదనపు కట్నం కింద రెండు లక్షల రూపాయలను, ఓ ఎస్‌యూవీ కారును ఇస్తేగానీ పెళ్లి చేసుకోనని అదే గ్రామానికి చెందిన ప్రకాశ్ సింగ్ అనే పెళ్లి కొడుకు మంకుపట్టు పట్టాడు. తనకు అంతస్థోమత లేదంటూ పెళ్లి కూతురు తండ్రి కాళ్లా వేళ్లా పడి బతిమాలినా కరుణించలేదు. పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు పెళ్లి కొడుకు, ఆయన కుటంబ సభ్యులు ప్రకటించారు. ఊహించని సంఘటనకు హతాశులైన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కుమిలిపోసాగారు.

మంగళవారం ఈ సంఘటన గురించి తెలిసిన సిసాన గ్రామ పంచాయతీ ఎవరి ఫిర్యాదు అందకపోయినా తానంతట అదే స్పందించింది. బుధవారం పెళ్లి కూతురు తండ్రిని పిలిపించి పెళ్లి నిలిచిపోవడం వల్ల జరిగిన నష్టం గురించి వాకబు చేసింది. పెళ్లి కొడుకు కోసం అప్పటికే సమర్పించిన బహుమతులు కలుపుకొని పెళ్లి ఏర్పాట్లకు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు పెళ్లి కూతురు తండ్రి పంచాయతీకి తెలిపారు.

పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను తక్షణమే పిలిపించి పంచాయతీ విచారించింది. పెళ్లిని కాదన్నందుకు నష్ట పరిహారంగా ఐదు లక్షల రూపాయలు సాయంత్రానికల్లా చెల్లించాలని ఆదేశించింది. పెళ్లి కొడుకు కుటుంబం అక్షరాల ఐదు లక్షల రూపాయలను తెచ్చి పంచాయతికి అప్పగించారు. 65 ఏళ్ల పంచాయతీ పెద్ద హీరో దేవీ ఆ సొమ్మును పెళ్లి కూతురు తండ్రికి అప్పగించారు. పీటల మీద పెళ్లి నిలిచిపోయిన కారణంగా పిల్ల పెళ్లి కాదని ఆందోళన చెందవద్దని, ఆ బాధ్యత తాము తీసుకుంటామని, తగిన వరుణ్ని వెతికి పెట్టే బాధ్యత కూడా తమదేనని పంచాయతీ తీర్మానించింది.

పంచాయతీ అంతటితో సరిపెట్టక, పెళ్లి కొడుకు ప్రకాష్ సింగ్ పీటల మీదదాక వచ్చిన సంబంధాన్ని అదనపు కట్నం కోసం వదులు కోవడం రెండోసారి కావడంతో పెళ్లి కొడుకు కుటంబాన్ని గ్రామంలో సంఘ బహిష్కరణ చేసింది. ఈ విషయమై స్థానిక మీడియా పోలీసులను సంప్రదించగా, ఈ విషయం గురించి తమకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా పంచాయతీ తీసుకున్నది ప్రశంసనీయ నిర్ణయమేకదా! పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సర్కిల్ ఇనిస్పెక్టర్ వ్యాఖ్యానించారు.