Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పవన్ కళ్యాణ్ తన పార్టీ నిర్మాణంపై వడివడిగా అడుగులేస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.ఇటీవల జనసేన పార్టీ ఎంపిక చేసిన అనంతపురం నాయకులతో పవన్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో తాను అనంతపురంజిల్లా నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు జనసేన కార్యకర్తలకు స్పష్టం చేశాడు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ ప్రకటించించాడు. కానీ తాను అనంతపురంలో పాదయాత్ర చేయనునట్లు కూడా పవన్ జనసేన కార్యకర్తల ముందు ప్రకటించడంతో పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. కదిరితో పాటు గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాలపై కూడా పవన్ కన్నేశాడనేది ఈ వార్తల సారాంశం. ఈ మూడు నియోజకవర్గాలలో ఏదో ఒక దానినుంచి పవన్ పోటీ చేయడం ఖాయమనే చర్చ జరుగుతోంది.అయితే ఈ విషయంపై జనసేన వర్గాలతో పవన్ చర్చించినట్లుగాని, తాను పోటీ చేయబోయే నియోజకవర్గ పేరుని ప్రస్తావించినట్లు గాని అధికారిక సమాచారం లేదు. దీనిపై అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలు స్పదించారు. పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సంతోషమే అని అంటున్నారు. అయితే పవన్ పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని వారు చెబుతున్నారు. పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించక పోయినా దీనిగురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం విశేషం.