Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధానిగా తాను తీసుకున్న నిర్ణయాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు నోరు విప్పారు. అయితే, ఆ ఆరోపణలను ఆయన ఖండించలేదు, అలాగని సమర్థించనూ లేదు. తన డ్యూటీ తాను చేశానని ముక్తాయించారు. అంతేకాక సదరు వ్యక్తులు తనపై చేసిన ఆరోపణల సారాంశం పూర్తిగా తనకు తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘నిజానికి నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి రాశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’అంటూ మన్మోహన్ రెండంటే రెండు ముక్కల్లో తన స్పందనను వెల్లడించేశారు.

‘‘స్ట్రిక్ట్ లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’’ పేరిట కూతురు దమన్ సింగ్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన కూతురు మాత్రం దీనిపై స్పందించేందుకు యత్నించినా, ఆమె కూడా అరకొరగానే మాట్లాడారు. ‘‘వాస్తవంగా ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. అందువల్ల దానిపై నేనేమీ మాట్లాడలేను. అసలు దానిపై నా వద్ద ఎలాంటి సమాచారం లేదు. వారేమి చెప్పారో నాకు తెలియదు. ఈ కారణంగా నేనేమీ చెప్పలేను. నిజంగా వారేమన్నారో నాకు తెలియదు. కాబట్టి, దానిపై నేను చెప్పేదేమీ లేదు’’ అంటూ వినోద్ రాయ్ వ్యాఖ్యలపై స్పందించాలన్న విలేకరుల ప్రశ్నలకు దమన్ సింగ్ సమాధానమిచ్చారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలెవరూ హాజరుకాకున్నా, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగ్ అహ్లూవాలియా, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ లు మాత్రం హాజరయ్యారు.