Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలుగు సినీ రంగ చరిత్రలో డా డి రామానాయుడిది ప్రత్యేక అధ్యాయం. యాభైయేళ్ల ఉద్ధానపతనాల రామానాయుడి సినీ జీవిత ప్రస్థానం నేటి తరం వారికి ఒక పెద్ద బాలశిక్ష. ఎంతదూరం ప్రయాణించినా రామానాయుడు తన చిన్ననాటి రోజుల్ని, తాను పెరిగిన గ్రామీణ వాతావరణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ జ్ఞాపకాలను గతంలో ‘నవ్య’తో ఆయన పంచుకున్నారు. వాటిలో కొన్ని…
గాలివాన తర్వాత…
గుంటూరు జిల్లా కారంచేడు గ్రామం (ఇప్పుడిది ప్రశాశం జిల్లాలో ఉంది) మా ఊరు. ఆ జిల్లాలో మాదే పెద్ద ఊరు. ధనవంతులున్న ఊరు కూడా. మా నాన్నగారికి ఆరువందల ఎకరాలుండేది. దాంతోపాటు రెండు కార్లు, ఓ నాలుగు జతల ఎడ్లు, ఓ పది పాడి గేదెలు ఉండేవి. 1936లో వచ్చిన గాలివానకి ఊళ్లన్నీ నీట మునిగాయి. నేను గాలి వాన వచ్చిన ఆరు నెలలకు పుట్టానని చెబుతారందరూ. ఆ లెక్కప్రకారమే నా పుట్టినరోజు జరిపేవారు.
అమ్మలేని ఊరు…
నాకు మూడేళ్ల వయసుండగానే మా అమ్మ చనిపోయింది. తర్వాత నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు. నాన్న నన్ను చాలా గారంగా చూసుకునేవాడు. నేనేదంటే అదే. మాది ఉమ్మడి కుటుంబం. నాన్న, పెదనాన్న కలిసే ఉండేవాళ్లు. తెల్లారేసరికి పొలంలో ఉండేవాడ్ని. పాలేర్లు కూడా నన్ను బాగా చేరదీసేవారు. పొలంలో నాన్న లేకపోతే రాజ్యం నాదే.
న్యూయార్క్‌ మేడలు…
కారంచేడుకి స్పెషల్‌ అట్రాక్షన్‌ మా ఇళ్లు. మాది, మా పెదనాన్నది, మా తాతయ్యది, అత్తయ్యది…ఇలా అందరి మేడలు వరుసగా ఉంటాయి. మా వీధిని సరదాగా అందరూ న్యూయార్క్‌ అని పిలిచేవారు. మా వెనకపక్క ఉన్న బజారుని మాస్కో(కమ్యూనిస్టుల వీధి అని) అనేవారు. మాది రెండంతస్తుల మేడ. చాలా బాగుండేది. మేమే కాదు…మా ఊర్లో నూటికి అరవైమంది బాగా ఉన్నవారే. అందుకే రిచ్‌ విలేజ్‌ అని పిలిచేవారు.
తొమ్మిదేళ్లకే దానం…
నాకు తొమ్మిదేళ్ల వయసుండగా…ఒక రోజు వినోబాభావే మనుషులు మా ఊరొచ్చారు. పేదలకు సాయం చేయాలని చెప్పారు. మా ఊళ్లో డబ్బున్నవారంతా ఎకరం, అరకెరం, పావెకరం పొలాలు దానం చేస్తున్నారు. నేను కూడా వారిపక్కనే నిలబడి ఉన్నాను. నా వంతు రెండెకరాలు అంటూ చెయ్యెత్తాను. నా పక్కనే నిలబడ్డ ఓ పెద్దాయన ‘మీ నాన్న ఒప్పుకుంటాడా.. ’అని అడిగాడు. నాన్న ఇవ్వకపోతే అమ్మ పొలం దానం చేస్తానని చెప్పాను. వినోబాభావే మనుషులు చప్పట్లు కొట్టారు.
ఊరు దాటాను…
నా బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్న చదువు గట్టెక్కలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సి ఫెయిలయ్యాను. అక్కడ నాకు అన్ని సబ్జెక్టులకీ ట్యూషన్లు ఉండేవి. అయినా లాభం లేకపోయింది. తర్వాత మళ్లీ పరీక్షలు రాసి అరకొర మార్కులతో పాసయ్యాను. మద్రాసు లయోలాకాలేజ్‌వారు ఇంటర్‌లో సీటు చ్చారు. పుస్తకాలు పక్కన పెట్టి క్యాంటిన్లో కబుర్లు చెప్పుకుంటూ ఇంటర్‌ కూడా తప్పాను. చదువులతో నాకు కుదరదంటూ అందరికీ బై చెప్పి ఊరొచ్చేసాను.
మా ఊరి మర్యాదలు…
ఆ సమయంలో ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్‌ నిమిత్తం సినిమా నటులు మా ఊర్లో దిగారు. ఆ సినిమా ప్రొడ్యూసర్లు మా బంధువులే. అందులో పదివేల రూపాయలు మా నాన్నగారు కూడా పెట్టారు. నాగేశ్వరరావు, సావిత్రి, రంగారావు టాప్‌ యాక్టర్లంతా మా ఊరు వస్తున్నారని తెలిసాక ఊరంతా హోరెత్తిపోయింది. సావిత్రికి, నాగేశ్వరరావుకి మా ఇల్లు, రంగారావుకి, గుమ్మడిగారికి మా పెదనాన్నవాళ్ల ఇల్లు, మిగతావారికి మా తాతయ్యగారి ఇల్లు ఇలా వారి వసతి, మర్యాదలకు అన్ని ఏర్పాట్లూ చేశాము. ఎడ్ల పందెం సీనుకి మా ఎడ్లనే ఇచ్చాం. ఆ సమయంలో అక్కినేనిగారితో పరిచయం పెరిగింది. ‘నువ్వు కూడా మద్రాసు వచ్చేయకూడదూ…’ అని అన్నారు ఆయన.
హిట్‌ కొట్టాక…
మొదట ఓ డబ్బింగ్‌ సినిమాకి పెట్టుబడి పెట్టాను. తర్వాత సొంత ప్రొడక్షన్‌ పెట్టుకున్నాను. 1963లో ‘రాముడు భీముడు’ సినిమా హిట్‌తో మొదలైంది నా నిర్మాత జీవితం. ఆ సినిమా హిట్‌ సంబరాలు మా ఊళ్లోనే జరుపుకున్నాను. సంబరం అంటే వేడుక మాత్రమే కాదు… అమ్మ పేరుతో ఊళ్లో లక్ష్మీదేవి కల్యాణమండపం కట్టించడం. రెండున్నర లక్షలు ఖర్చయింది. ఆ రోజుల్లో అలాంటి కల్యాణమండపం మా చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడా లేదు. ఇప్పటివరకుమా ఊళ్లో పదిసినిమాల వరకూ షూటింగ్‌ చేశాం. ప్రేమించుకుందాం రా…సినిమాలో హీరో ఉండే ఇల్లు మా ఇల్లే. హీరోయిన్‌ ఉన్న ఇల్లు మా పెదనాన్నగారిది. అప్పటి ఇళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నాన్నకి క్యాన్సర్‌ వచ్చినపుడు మద్రాసులో చాలా ఆసుపత్రులు తిప్పాను. లాభం లేకపోయింది. చివరి గడియలు ఊర్లోనే గడపాలన్నాడు. నాన్నని తీసుకుని ఊరికి వచ్చేశాను. నాకు అమ్మప్రేమ తెలియదు. అన్నీ నాన్నే. ఆయనకి నేనంటే ప్రాణం. అన్నీ నా ఇష్ట ప్రకారమే చేసేవాడు. నాన్నెక్కడ నా కళ్లముందు కన్నుమూస్తాడోనని రోజూ తెల్లవారకుండానే పొలం వెళ్లిపోయేవాడ్ని. అయినా నాన్న చివరికి నా చేతుల్లోనే కన్నుమూశాడు.