Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశ చరిత్రలో ఇందిరా గాంధీ తరువాత అంతటి కీర్తి సంపాదించుకున్న మహిళా నాయకురాలు కేవలం జయలలితేనని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. సినిమాలు నుండి రాజకీయ రంగంలోకి అడుగులు వేసి ఎదురులేని ధీర వనితగా, విప్లవ నాయకురాలిగా ఆమె జీవిత ప్రస్థానంలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఎన్నో అవమానాలు, ధిక్కారాలు, మరెన్నో అపజయాలు, విజయాలు. 1989లో నిండు శాసన సభలో డిఎంకె నేతలు కొట్టి, చీర లాగి బయటకు తోస్తే జయలిత బయటికొచ్చి ఈసారి సభలోకి అడుగుపెడితే అది ముఖ్యమంత్రిగానే అని శపథం చేసి 1991లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి తనను ఘోర అవమానికి గురిచేసిన కరుణానిథిని చిన్న స్థాయి పోలీసుల చేత ఈడ్పించి మరీ పోలీసు వ్యానెక్కించి పగ తీర్చుకున్న ధైర్య శాలి. 2015లో అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి హోదాలోనే జైలుకెళ్లి గంటల వ్యవధిలో బెయిల్ తెప్పించుకుని బయటికొచ్చిన పలుకుబడి ఆమెది.

ఆమె కేవలం రాజకీయాలకు పరిమితమవకుండా సామాన్య ప్రజల కష్టాలు చూశారు. వాళ్లకు ఏం కావాలో తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అవి ప్రజలకు సక్రమంగా చేరేలా చూశారు. ఉచిత మధ్యాహ్న భోజనం, అమ్మ కాంటీన్లు, అమ్మ వాటర్, అమ్మ తాళిబొట్లు, అమ్మ మందులు, అమ్మ మొబైల్ ఫోన్లు, అమ్మ మీకేసీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు, టీవీలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, బీదవారికి అమ్మ ఉచిత్ర ఆరోగ్య కేంద్రాలు వంటి పథకాలతో ప్రజల ఆలనాపాలనా చూశారు. కడు బీదరికంలో ఉన్నవారికి భవిష్యత్తు మీద భరోసా ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. ప్రతి తమిళ సామాన్యుడు ప్రస్తుతం కనీస అవసరాల లోటు లేకుండా బ్రతుకుతున్నాడంటే అది ఆమె చలవే. ఒక్క మాటలో చెప్పాలంటే కన్న తల్లి బిడ్డల్ని చూసుకున్నట్టే చూసుకున్నారు. వీటి వల్లే తమిళులు అమ్మను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. యువత ధీరవనితగా స్ఫూర్తి పొందుతారు. అందుకే ఆమె మరణించారన్న వార్త వినగానే గుండె పగిలేలా రోదిస్తూ అమ్మలేని పాలనలో ఎలా బ్రతకాలని విలపిస్తున్నారు.